Sunday 28 September 2014

30,000 కోట్ల రూపాయల పై మాటే..!

2జి స్పెక్ట్రం,బొగ్గు కుభకోణాలు వెలుగు చూసినపుడు వాటివల్ల దేశ ఖజానా కి వాటిల్లిన నష్టం ఎంతో చెప్పడానికి ఎన్ని సున్నాలు ఒక అంకెకి పక్కన పెట్టాలో చాలామందికి తెలియలేదు.అయితే పశ్చిమ బెంగాల్ లోని శారదా చిట్ ఫండ్ స్కాం లో గల్లంతయిన జనాల సొమ్ము మాత్రం అక్షరాలా 30,000 కోట్ల రూపాయల పై మాటే..!ఎంతో సింపుల్ గా బయటకి అగుపించే మమతా బెనర్జీ దీని వెనుక ప్రధాన పాత్ర పోషించినట్లు ప్రస్తుతం జాతీయ మీడియా కోడై కూస్తున్నది.

సి.బి.ఐ. ఇంకా ఈ.డి.లాంటి కేంద్ర సంస్థలు పరిశోధనలోకి దిగడం తో అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి.

ఈ డబ్బులన్నీ ఎవరివో కావు.పశ్చిమబెంగాల్,ఒడిశా,అస్సాం లోని సామాన్య జనాలు మదుపుచేసినవి.మూడు రాష్ట్రాల్లో విస్తృతమైన నెట్ వర్క్ ఏర్పాటుచేసుకొని ఈ స్కాం కి తెర లేపారు.ఎక్కువ లాభాల్ని ఎరగా చూపించడం,స్వయంగా తృణమూల్ మంత్రులే ప్రచారం చేయడం ..ఇలాంటివాటిని నమ్మి జనాలు డిపాజిట్లు పెద్ద ఎత్తున చేశారు.ఈ దర్యాప్తు మొదలైనాక దాదాపు 50 మంది డిపాజిటర్లు నిరాశతో ఆత్మహత్య చేసుకున్నారు.రమారమి 35 లక్షల డిపాజిటర్లకి సంబందించిన వ్యవహారమిది.

2009-11 మధ్య కాలం లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు.ఆ సమయం లోనే శారదా గ్రూప్ కంపెనీస్ కి చెందిన ట్రావెలింగ్ ఏజన్సీలకి లబ్ది చేకూరేలా రైల్వే శాఖ అనుబంధం మొదలైంది.ఆ గ్రూప్ చైర్మన్ సుదీప్తో సేన్ ,ఈయన షాడో చైర్మన్ అని చెబుతారు.శారదా గ్రూప్ కంపనీస్ ఏర్పాటు చేసే ప్రారంభోత్సవాలకి, వెంచర్ల ఓపెనింగ్స్ కి మమతా తప్పక హాజరయ్యేవారు.సుదీప్తో సేన్ కూడా మమత అసెంబ్లీ నియోజకవర్గంలో 100 కోట్ల పైన ఖర్చులు భరించినట్లు దర్యాప్తులో తేలింది.

మమత తర్వాత రైల్వే మంత్రి అయిన దినేష్ త్రివేది హయాం లో ఈ గ్రూప్ కాంట్రాక్ట్ లని రైల్వేశాఖ రద్దు చేసింది.ఆ పిమ్మట నాటకీయంగా త్రివేది రాజీనామా సమర్పించవలసివచ్చింది.ప్రత్యక్షంగా మమత కి డబ్బు ముట్టినట్లు ఎక్కడా బయటపడలేదుకాని,ఆ సంస్థ కి అడుగడుగున ఆమె ప్రభుత్వం సహకరించడం బహిరంగ సత్యం.ఆమె వేసిన పేయింటింగ్స్ ని సైతం ఈ సంస్థలు పెద్ద ధరపెట్టి కొన్నాయి.ఈ విషయాన్ని సి.బి.ఐ.ముందు సేన్ అంగీకరించాడు.తృణమూల్ రాజ్యసభ సభ్యుడు కునాల్ ఘోష్ ఈ గ్రూప్ కి చెందిన ఒక పత్రికకి ఎడిటర్ గా ఉంటూ వేతనం కింద నెలకి 15 లక్షలు తీసుకునేవాడు.మీడియా ద్వారా దీదీ ని సమర్దించే పనికి ఈయన పబ్లికేషన్స్ హెడ్ గా నియమింపబడ్డాడు.తనకి ఏమాత్రం అననుకూలంగా వార్త వచ్చినా దీదీ ఫోన్ చేసి చెడామడా తిట్టేవారని తెలిసింది.తృణమూల్ ప్రభుత్వం లో మంత్రి గా ఉన్న శ్యామపాద ముఖర్జీ కి చెందిన నష్టాల్లో ఉన్న కంపెనీ ని పెద్దరేటు ఇచ్చి కొనడం జరిగింది.రెండు సంవత్సరాల్లో ఈ గ్రూప్ 100 పైగా కంపెనీలు పెట్టినట్లు సెబి కి కూడా తెలియదట.

ఈస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ క్లబ్ కూడా పన్నులో ఎగవేయడం లో శారదా గ్రూప్ కి సహకరించినట్లు వెల్లడవడంతో దాని బాధ్యుల్ని కూడా ప్రశ్నించారు.తృణమూల్ కి అనుకూలంగా ఉండే కళాకారులకి,మేదావులకి కూడా నగదు రూపేణా ప్రయోజనం సమకూరింది.ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్న మదన్ మిత్ర అయితే డైరెక్ట్ గా సభల్లో చెప్పేవారు..ఈ కంపెనీ లో మదుపు చేయండి అని జనాలకి..అది నమ్మి కూడా చాలామంది డిపాజిట్లు చేశారు.నటుడు,ఎం.పి. మిథున్ చక్రవర్తి,నటి,ఎడిటర్ అపర్ణా సేన్, ఇంకో ఎం.పి.అహ్మద్ హుస్సేన్ ఇమ్రాన్ ఇలాంటి ప్రముఖుల్ని ఇప్పటికే కేంద్ర సంస్థలు ప్రశ్నించాయి.రాష్ట్రం లోని ప్రతిపక్షాలు మాత్రం మమతా బెనర్జీ వెంటనే గద్దే దిగి తన నిజాయితిని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

    --News Post network

No comments:

Post a Comment