Tuesday 18 October 2022

"కాంతార" సినిమా - ఓ అభిప్రాయం


 కాంతార సినిమా చూసిన తర్వాత కొన్ని విషయాలు తప్పక రాయాలనిపించింది. అసలు ఈ సినిమా పేరేమిటి కన్నడం లా ఉంది అన్నవారూ ఉన్నారు. నిజానికి ఈ పదం సంస్కృత పదం. కాళిదాస మహాకవి అలనాడు అమ్మవారిని స్తుతిస్తూ కాంతార వాస ప్రియే అని గదా అనింది. అంటే అరణ్యం లో నివసించడాన్ని కాళీ మాత ఇష్టపడుతుందట. ఆహా ఎంత చక్కని వర్ణన.

మళ్ళీ అలాంటి చక్కని టైటిల్ తో ఒక చక్కని సినిమాని తీశారు కన్నడ సోదరులు. రిషబ్ శెట్టి రచన,దర్శకత్వం చేసి హీరో గా కూడా నటించి మొత్తం ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నాడు. తుళునాడు లో ఉన్న గ్రామ దేవత ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చాటాడు అని చెప్పాలి.లేకపోతే అంతకు ముందు మనలో ఎంతమందికి తెలుసు..? భూత కోల అనే ఓ నాట్యం ఉందని,వరాహ వదనం తో ఉన్న  తొడుగు ని మొహానికి ధరించి,ఇంకా రకరకాల వస్త్రాల్ని,భయానకమైన ఆహార్యం తో మేళవించి మరణించిన పెద్దల్ని ఆహ్వానించే తంతు ఒకటి ఉందని ,ఆ మనిషి లోకి ఆత్మ చొరబడి ఇవన్నీ చేస్తుందని...ఇలాంటి నమ్మకాలతో జీవించే కొన్ని కులాలు ఉన్నాని ఎంత మందికి తెలుసు..?

ఎన్నో అద్భుతమైన స్థానిక ఆచారాలు,వ్యవహారాలు భారతీయ సమాజం లో ఉన్నాయి.వీటికి నవీన ఆలోచనలు రంగరించి నేటి తరానికి అందించవచ్చు. మేజిక్ రియలిజం అనే సాహిత్య ప్రక్రియ లో ఇలా ఒక కాలం నుంచి మరో కాలం లోకి చదువరిని తీసుకెళ్ళే విధానం ఉన్నది.అది ఇతర దేశాల్లో విజయవంతం గా చేశారు.అయితే ఈ మధ్య కాలం లో ఎవరూ ఇలా మన దేశం లో చేయలేదు. అందుకే ఈ సినిమా లోకల్ గా తీసినప్పటికీ పేన్ ఇండియా సినిమా ఐంది.

జానపదుల దేవుణ్ణి,నమ్మకాల్ని,మానసిక స్థయిర్యాన్ని ఈ కాంతార సినిమా సరికొత్త గా చూపించింది. కథ ని రాసుకున్న విధానం బాగుంది.అడవి ని రక్షించడానికి అనే పేరు మీద అటవీ అధికారి కి,హీరో శివణ్ణ కి జరిగిన ఈగో క్లాష్ ఈ సినిమా. దానికి భూత కోల నేపథ్యాన్ని అద్ది కథ కి మరింత వన్నె తెచ్చాడు రిషబ్ శెట్టి. 

కొన్ని తరాల క్రితం కోల్పోయిన అటవీభూమిని వెనక్కి తీసుకోడానికి ఈ తరపు భూస్వామి ఆడే ఆట లో అక్కడి పేదప్రజలు సమిధలు అవబోతుండగా అడ్డుకొని ఆపినవాడే హీరో , ఆ హీరోయిజం  వెనక ఉన్న చోదకశక్తి మాత్రం ఆ గ్రామదేవత నే అంటే అతిశయోక్తి కాదు. అడవి లో అరుపులు వినబడటం,హీరో జైలు లో ఉన్నప్పుడు గురవా ఆత్మ మూలుగుతూ కనబడటం వళ్ళు జలదరింపజేస్తుంది. అంతే కాదు చివర లో హీరో భూత కోల నాట్యం చేయడం, అడవి లో కి వెళ్ళిపోవడం ఆ సన్నివేశాలన్నీ హృదయం లో తడి ఉన్న ప్రతి ప్రేక్షకుడిని కన్నీరు పెట్టిస్తాయి. అంత చక్కగా రసోన్మాదాన్ని కలిగించాడు రిషబ్ శెట్టి.

సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్, కెమెరా పనితనం తో అలరించిన అరవింద్ ఎస్ కాశ్యప్ ఎంతైన అభినందనీయులు. ఈ సినిమా నార్త్ లో కూడా బాగా ఆడుతోంది.వాళ్ళ గ్రామ దేవతల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఈ సినిమా ని పొగుడుతున్నారు.ఒక సినిమా ని మనసు పెట్టి ,స్థానిక వస్తువు తో తీసినా దానిలో గనక కదిలించే దమ్ముంటే ఎల్లలు దాటి ఎక్కడకో వెళ్ళి అందర్నీ అలరిస్తుంది.ఆటోమేటిక్ గా పేన్ ఇండియా అవుతుంది,దానికి మించి కూడా అవుతుంది.ఆ సత్యాన్ని నిరూపించింది ఈ కాంతార సినిమా. 

----- NewsPost Desk

4 comments:

  1. ... కాదంబకాంతారవాసప్రియే....
    అని కాళిదాసు మాట. కదంబవనం అన్నమాట. మామూలు అడవి అన్న అర్ధంలో కాదు.

    ReplyDelete
  2. కోడి రామకృష్ణ గారు చనిపోయారు గానీ కాంతారా లాంటి సినిమాలు తీసేవారు. అమ్మోరు లాంటి సినిమాలు ever green అన్నమాట !

    ReplyDelete
  3. https://famus.blogspot.com/2022/10/kantara-is-movie-about-fight-for-forest.html nice reiew

    ReplyDelete