Thursday 27 May 2021

ముస్సోరి గ్రాండ్ మేన్ ..!

 

రస్కిన్ బాండ్..! ఈ పేరు వినగానే చిన్న పిల్లలు ,పెద్ద వాళ్ళు అనే భేదం లేకుండా చదవడం హాబీ గా ఉన్న వారి హృదయాలు ఆహ్లాదం తో పరవశిస్తాయి.ఈయనని ముస్సోరి గ్రాండ్ మేన్ అని పిలుస్తారు.ఎందుకంటే ఈ రచయిత హిమాలయ సానువుల్లోని లాండోర్ అనే ప్రాంతం లో నివసిస్తూంటారు.ఇది ముస్సోరి లో ఓ భాగమే.ప్రతి శుక్రవారం అక్కడ ఉన్న ఓ బుక్ షాప్ లో తన అభిమానుల్ని కలుసుకుంటూంటారు.


87 ఏళ్ళ రస్కిన్ బాండ్ దాదాపుగా 80 కి పైగా పుస్తకాలు రాశారు.కొన్ని వందల కథలు రాశారు.ఆయన రచనల నేపథ్యం అంతా  ముస్సోరి దాపుల్లోని గుట్టలు,అడవులు,ప్రకృతి శోభ మీద ఆధారపడిఉంటాయి.అంతే గాక తన అనుభవాల్లోకి వచ్చిన ఇతర విషయాలని కూడా ఆధారభూతంగా తీసుకుంటారు. ఆయన రచనలు ఎన్నో పాఠ్య గ్రంథాల్లో ప్రచురింపబడ్డాయి.


దూర దర్శన్ టి.వి.సీరియల్స్ గా  వచ్చాయి.కొన్ని సినిమాలు గానూ రూపొందాయి.ఆయన తల్లిదండ్రులు బ్రిటీష్ జాతీయులు. తండ్రి నాటి బ్రిటీష్ రాజ్ లో చిరు ఉద్యోగి.ఆ తర్వాత రాయల్ నేవీ చేరారు.రస్కిన్ బాండ్ సింలా లోని బిషప్ కాటన్ విద్యాలయం లో చదివారు.కొంత కాలం లండన్ వెళ్ళి చిన్నా చితకా పనులు చేశారు.ఆ తర్వాత భారత్ కి వచ్చి రచనల్నే వృత్తిగా చేసుకొని చేసుకొని జీవించడం మొదలెట్టారు. 


పద్మశ్రీ,పద్మభూషణ్ పురస్కారాల్ని పొందారు.ఎంతో సరళమైన ఆంగ్లం లో అందరకీ అర్ధమయ్యే రీతి లో ఉండే ఆయన పుస్తకాలు అమెజాన్ లోనూ ఇంకా ఇతర ప్లాట్ ఫాం ల్లోనూ అందుబాటు లో ఉన్నాయి.ఈ లాక్ డవున్ సమయం లో చిన్నలూ,పెద్దలూ చదవడానికి ప్రయత్నించడి.   

Thursday 13 May 2021

ఇప్పటికీ ఈ శిఖరం ఓ రహస్యమే..!


 ప్రపంచం లో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఎందరో ఉన్నారు. కాని ఆ హిమాలయ శ్రేణుల్లో భాగమైన కైలాస్ శిఖరాన్ని మాత్రం ఇప్పటి దాకా ఎవరూ అధిరోహించలేకపోయారు.ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8850 మీటర్లు కాగా,కైలాస్ శిఖరం ఎత్తు 6638 మీటర్లు మాత్రమే.ఎవరెస్ట్ కన్నా ఎత్తు లో అంత తక్కువ ఉన్న కైలాస్ శిఖరాన్ని ఎందుకని ఎవరూ అధిరోహించలేకపోయారు అనేది ఇప్పటికీ ఓ గొప్ప రహస్యమే..!


ఎక్కడానికి ప్రయత్నించినవారు లేకపోలేదు సుమా..!కల్నల్ విల్సన్ (బ్రిటీష్),సెర్గీ సిస్త్యకొవ్(రష్యన్) వంటి ప్రసిద్ధ పర్వాతారోహక బృందాలు ప్రయత్నించి విఫలమై తిరిగివచ్చారు.సైబీరియా కి చెందిన కొందరు కూడా ప్రయత్నించారు కాని వారు కూడా విజయం సాధించలేకపోయారు.సైబీరియాకి చెందిన వారు ప్రయత్నించిన సంవత్సరం తర్వాత మృత్యు వాత పడ్డారు.ఒక ఏడాది లో పదేళ్ళ లో వచ్చే వృద్ధాప్యం వచ్చింది వారికి.


అధిరోహించడానికి ప్రయత్నించిన వారు అందరూ చెప్పినదేమిటంటే కైలాస్ శిఖరం పరిధిలోకి కొంత దూరం వెళ్ళడం తో గోళ్ళు,వెంట్రుకలు చాలా వేగంగా పెరుగుతాయని తెలిపారు.హిందూ ,బౌద్ధ,జైన,బాన్ మతాల వారికి  కైలాస్ శిఖరం చాలా పవిత్రమైనది.సాక్షాత్ మహాశివుడే తన పరివారం తో ఇక్కడ కొలువై ఉంటాడని హిందూవులు భావిస్తారు.ఇక్కడ దగ్గర లో మానస సరోవరం,రాక్షస తల అనే రెండు సరస్సులు ఉంటాయి.ఒకటి మంచినీటి సరస్సు కాగా మరొకటి ఉప్పు నీటి సరస్సు.  


ఇంకా మిగతా చాలా వివరాలకోసం పైన ఇచ్చిన వీడియో చూడగలరు.

Wednesday 5 May 2021

మన తెలుగు పత్రికలు ఈ సాహితీ పుత్రుని మరణాన్ని పట్టించుకోలేదనే చెప్పాలి

 


గతనెల 27 వ తేదీన భారతీయ దిగ్గజ రచయిత అనదగ్గ మనోజ్ దాస్ గారు తన 87 వ యేట పరమపదించారు. మనకి స్వాతంత్రయం వచ్చిన తర్వాత మొదటి తరం ఇండో ఆంగ్లియన్ రచయితలు ఎవరయ్యా అంటే ఆర్.కె.నారాయణ్,ముల్క్ రాజ్ ఆనంద్ ఇంకా మనోజ్ దాస్ అని చెప్పాలి.ఇంకా కొంతమంది ఉండవచ్చు గాక కాని రాశి లోనూ,వాసి లోను ఎన్నదగిన వారి పేర్లు వచ్చినపుడు ఈ మూడు పేర్లు ముందు వరుస లో నిలుస్తాయి.


అటువంటి ప్రముఖ రచయిత మరణిస్తే మన తెలుగు దినపత్రికలు ఏవీ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.కనీసం ఆ న్యూస్ కూడా వచ్చినట్లు లేదు మరి ఎందుచేతనో అర్ధం కాలేదు. అయితే జాతీయ స్థాయి పత్రికలు అన్నీ బాగానే కవర్ చేశాయి.మనోజ్ దాస్ కి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఆయన మాతృభాష ఒరియా లో ఎంత విస్తృతం గా రాశారో,ఆంగ్లం లోనూ అంత విస్తృతం గానూ రాశారు.అటువంటి ద్విభాషా పాండిత్యం కలిగి రెండు భాషల్ని రెండు కళ్ళు గా భావించి సృజానాత్మక రచనలు చేసినవారు చాలా అరుదు.


రమారమి తొంభై దాకా పుస్తకాలు రెండు భాషల్లో రాశారు. ఒడియా ప్రజలు ఆయన్ని వ్యాస కవి అని గౌరవిస్తారు.కొన్ని వందల కథలు,వ్యాసాలు రాశారు.ట్రావెలోగ్స్ రాశారు.హిందూ,హిందూస్థాన్ టైంస్,టైంస్ ఆఫ్ ఇండియా వంటి ఇంగ్లీష్ దినపత్రికలకి కాలంస్ ని చివరి రోజుల దాకా రాస్తూనే ఉన్నారు.బాగా జ్ఞాపకం తెచ్చుకోగలిగినట్లయితే ఇంగ్లీష్ చందమామ లో కూడా ఆయన రాసిన బాలల కథలు వచ్చేవి.అవే తెలుగు లో కూడా అనువాదమయ్యేవి.


సాంఘిక,జానపద,పౌరాణిక అంశాల నుంచి నేటి ఆధునిక ధోరణుల్ని ఆయన తన రచనల్లో పొందుపరిచారు.ఇక అరవిందుని తాత్వికత పై ఎనలేని సాధికారత ఉండేది.1963 లో పాండిచేరి లోని ఆశ్రమం లో కి వచ్చి అక్కడే నివసించారు. ఆ సంస్థ కి సంబందించిన యూనివర్సిటీ లో ఇంగ్లీష్ సాహిత్యాన్ని,అరవింద తత్వాన్ని బోధించారు.కాలేజ్ రోజుల్లో వామపక్ష ఉద్యమనేత గా ఉండి ఒక ఏడాది జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత కొంత కాలానికి అరవిందుని ఫిలాసఫీ కి ఆకర్షింపబడి పాండిచేరి చేరుకున్నారు.


The Submerged valley,Tiger at the twillight,Chasing the rainbow,Bulldozers,Mystery of the missing cap ఇలాంటి కొన్ని నవలలు,కథా సంపుటాలు నేను చదివిన వాటిలో కొన్ని.ఇంకా ఆయన రాసే కాలంస్ ని కూడా ఆంగ్ల దినపత్రికల్లో ఫాలో అయ్యేవాణ్ణి.గంభీరత,వ్యంగ్యము,హాస్యము ,విషయ విశ్లేషణ వారి లో బాగా ఎన్నదగిన విషయాలు.సమకాలీన రాజకీయాలు,బ్రిటీష్ రాజ్ కాలం లోని అంశాలని భూమిక గా చేసుకొని చాలా కథలు రాశారు.బరంపురం కి చెందిన ఉపద్రష్ట అనురాధ గారు మనోజ్ దాస్ గారి కథల్ని కొన్ని తెలుగు లోకి అనువదించి పుస్తకం గా తెచ్చారని తెలిసింది.వాకబు చేస్తే ఆ కాపీలు ఇప్పుడు లభ్యం కావడం లేదని తెలిసింది.అనురాధ గారు జీవించి ఉన్నకాలం లో ఆమె తో ఫోన్ లో మాట్లాడాలని ప్రయత్నించాను.అయితే ఆమె అనారోగ్యం తో ఉన్నారని మిత్రులు విజయచంద్ర గారు చెప్పారు.ఆ కొన్నాళ్ళకే ఆమె పరమపదించడం జరిగింది.   


మనోజ్ దాస్ గారికి సరస్వతి సమ్మాన్,కేంద్ర సాహిత్య అకాడెమీ వారి ఫెలోషిప్ లాంటివి ఎన్నో గౌరవాలు వరించాయి. ఈ మధ్య కాలం లోనే పద్మభూషణ్ కూడా పొందారు.నిజానికి జ్ఞాన్ పీఠ్ అవార్డ్ కి ఆయన నూటికి నూరు పాళ్ళు అర్హుడు.కాని ఎందుచేతనో రాలేదు.ఆయన తో సన్నిహితం గా ఉండే ఒక ఒరియా మిత్రుని తో ఇదే మాట అన్నప్పుడు ఆయన చెప్పిందేమిటంటే రాయడం వరకే తప్పా అవార్డ్ ల కోసం పైరవీ లు చేయడం అనేది మనోజ్ దాస్ గారికి అసలు ఇష్టం ఉండదట.


బహుశా ఏడాది కి పై కాలం లోనే ఆయన భార్య మరణించారు.వాళ్ళకి పిల్లలు లేరు.నేను ఆయన్ని కలిసినపుడు ఆ వృద్ధాప్య భారం తో ఒంటరి గానే ఉన్నట్లు అనిపించింది.పనిమనిషి ఒకరు ఉన్నట్లు జ్ఞాపకం.అయితే ఆయన్ని కలవడానికి రచయితలు,పాత్రికేయులు,అభిమానులు ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు.చేతనైనంత వరకు దేశ విదేశాల్లో ఉపన్యాసాలు అవీ ఇస్తుండేవారు.గత నాలుగు నెలల నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. సోషల్ మీడియా లో ఆ వార్తలు బాగా వచ్చేవి.ఎట్టకేలకు మొన్న ఏప్రిల్ లో 27 న ఆయన తన దేహ యాత్ర చాలించారు.

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దివంగత మనోజ్ దాస్ పేరు మీద అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.ఒరియా,ఇంగ్లీష్ భాషల్లో వచ్చే ఉత్తమ సాహిత్యానికి పది లక్షల నగదు ప్రతి కేటాయిస్తారు.సొంత గ్రామమైన శాంఖరి లో మన్మధ్ మనోజ్ మెమోరియల్ లైబ్రరి ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.  

------ Murthy Kvvs (gitika232@gmail.com)

Sunday 13 December 2020

ఒకే ఒక్కరి కోసం పోస్ట్ ఆఫీస్ తెరిచారక్కడ.

 


పట్టణం లో గాని గ్రామం లో గాని పోస్ట్ ఆఫీసు ఉండటం సహజమే గాని కొన్ని వాటి వెనుక మరిచి పోలేని విషయాలు ఉంటాయి.ఇప్పుడంటే సమాచార వ్యవస్థ ఎన్నో రకాలుగా విస్తరించింది గాని ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులు పోషించిన పాత్ర అమోఘం.


ఒకే ఒక వ్యక్తి కోసం పోస్ట్ ఆఫీసు ని తెరిచారు ఒరిస్సా లోని బరి కలామతియ అనే గ్రామం లో,అదీ 1960 ల్లో..!దాని కధాకమామీషు లోకి వెళదాం. కృపాసింధు మొహంతి అనే ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆ రోజుల్లో ఆంగ్లం బోధించేవారు. పర్యవేక్షణ కి వచ్చిన అధికారి విద్యార్థుల్లో సరిగ్గా ప్రగతి లేదని మందలించారట. దానితో కృపా సింధు ఈజీ గా ఆంగ్లం నేర్చుకోవడానికి పుస్తకాల గురించి వెతగ్గా అలాంటివి ఒడియా భాష లో కనిపించలేదు.


దానితో ఆయనే పూనుకుని The common knowledge in English అనే పుస్తకాన్ని అతి సరళ ఒడియా భాష లో రాశాడు.ఈ పుస్తకం ఆదరణ పొందడం తో మరిన్ని రాశాడు.ఇవి ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే రాష్ట్రం నలుమూలల నుంచి ఈయనకి వీటి గురించి ఉత్తరాలు రాసేవారు.కటక్ లోని పబ్లిషర్లని సంప్రదిస్తే ప్రచురించకపోవడం తో తన అయిదు ఎకరాల భూమిని అమ్మి ఈ పుస్తకాల్ని ప్రచురించారు ఆయన.


60 ల తర్వత కొన్ని జెనరేషన్ లు కృప మేస్టారి ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు చదివి ప్రభావితం అయ్యారు.నెలకి ఓ సారి "సమాజ్" అనే దినపత్రిక లో యాడ్ ఇచ్చేవారు.దానితో ఆర్డర్లు నెలకి 2500 దాకా వచ్చేవి.వి.పి.పి. లు పంపడం,మనియార్డర్లు రావడం ఎక్కువ అవడం తో ఆ బరి కలామతియ గ్రామం లో ఈయన అవసరాల నిమిత్తమే ఓ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ తెరిచారు. ఆ కార్యాలయం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కృప మేస్టారు 80 ఏళ్ళు జీవించి 2007 లో మరణించారు.ఇప్పటికీ ఆ మేస్టార్ గారి  ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాల గురించి గత తరాల వారు తలుచుకుంటూ ఉంటారు.     

Sunday 4 October 2020

ఆ రోజుల్లో ఇలాంటి శిల్పాల్ని చెక్కడం లో ఉద్దేశ్యం ఏమిటో..?

 


భోరం దేవ్ ఆలయం,ఇది చత్తీస్ ఘడ్ లో ఉన్న పురాతన దేవాలయాల్లో ఒకటి. ఇంచు మించు వెయ్యి ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ నిర్మాణం శివుని కి అంకితం చేయబడింది.రాయపూర్ కి 125 కి.మీ. దూరం లో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే కబీర్ ధాం జిల్లా లోని కేవర్ధా కి 18 కి.మీ.దూరం లో ఉంటుంది.ఆలయం ఉన్న ఊరి పేరు చౌరా గాం.


నగర వంశానికి చెందిన రామచంద్ర ఈ ఆలయాన్ని నిర్మించాడు.హయ రాజవంశానికి చెందిన అంబికా దేవి ని ఈయన వివాహమాడాడు.చరిత్రని, పురాతన దేవాలయ నిర్మాణాల్ని పరిశీలించే వారికి ఇక్కడ ఎంతో సమాచారం దొరుకుతుంది.ఒరిస్సా లోని కొన్ని ఆలయాల నిర్మాణ పద్ధతులు ఇక్కడ కనిపిస్తాయి.అదే సమయం లో తనదైన ప్రత్యకత కూడా ఈ ఆలయానికి ఉంది.


ఖజురహో వంటి ఆలయాల తీరు లోనే ఇక్కడ కూడా అనేక శృంగార భంగిమల్లో స్త్రీ పురుషులు క్రీడించే శిల్పాలు విరివిగా ఆలయం గోడల పై కనిపిస్తాయి.అదొక్కటే కాదు,వాస్తు నిర్మాణ విశేషాలు కూడా ఆసక్తికరం గా ఉంటాయి.మార్చి నెల చివరి వారం లో ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి.  

Monday 6 July 2020

నాగా లు శునక మాంస ప్రియులా..?

నాగాలాండ్ మన దేశపు ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి అనే సంగతి అందరకీ తెలుసు.కానీ అక్కడి ప్రత్యేకమైన పండుగ గూర్చి ఎంత మందికి తెలుసు..?ఒక పక్షి పేరు మీదు గా ఆ పండుగ జరుగుతుంది. Hornbill Festival దాని పేరు. Hornbill అనే పక్షి కి నాగా సంస్కృతి లో విడదీయరాని సంబంధం ఉంది. అక్కడి కధల లోనూ,జానపద గీతాల లోనూ ఆ పక్షి కి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10 వ తేదీ వరకు కొహిమా దగ్గర లోని కొసిమా అనే ఊరి లో ఈ పండుగ నిర్వహిస్తుంది.దేశ విదేశాల నుంచి దీనికి చాలా మంది హాజరవుతుంటారు.



మొట్ట మొదటి గా 2000 వ సంవత్సరం లో ఈ పండుగ ని తమ ప్రత్యేకత అందరకీ తెలియజెప్పడం కోసం ప్రారంభించారు.అంగామి,రెంగామి,కుకీ,నాగా వంటి తెగలు ఈ రాష్ట్రం లో ఉన్నాయి. వారికి సంబందించిన విశేషాలు అంటే అక్కడి నృత్యాలు,శిల్పకళ,చేతి వృత్తుల వారి కళా స్వరూపాలు,పాటలు,ఆటలు,చిత్రకళలు ఒకటేమిటి ఇలాంటివి అన్నీ ఒకేచోట ఆ పది రోజుల పండుగ లో చూడవచ్చు.

నాగాలాండ్ రాష్ట్రం ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు.2013 లో జరిగిన జనగణన ప్రకారం నాగాలాండ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత నమోదయింది.అదేమిటంటే అక్కడి జనాభా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ శాతం లో తగ్గినట్లు గా వెల్లడయింది.గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేదరికం చాలా ఇత్ర రాష్ట్రాల తో పోలిస్తే తక్కువేనని చెప్పాలి. నాగాలాండ్ లోని లోపలి ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాలి.మైన్మార్ కి (బర్మా) సరిహద్దు లో ఉండటం వల్ల విదేశీయుల కదలికలు నియంత్రించబడతాయి.



1967 లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ ని అధికార భాష గా ప్రకటించింది.నాగామీస్,క్రియోల్,అస్సామీస్ ఆధారిత భాషలు కూడా ప్రధానం గా ఉన్నాయి. 16 వివిధ తెగల తో వర్ధిల్లే ఈ రాష్ట్రం లో సంవత్సరం అంతా ఏవో స్థానిక పండుగలు జరుగుతూనే ఉంటాయి. శునక మాంస ప్రియులు అంటూ నాగా ల మీద ఉన్న అపోహ లో పూర్తి సత్యం లేదు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ తరహా వారు ఉన్నారు.వారి జనాభా తో పోల్చితే అది చాలా తక్కువ.


















Tuesday 5 May 2020

కధాకళి ప్రత్యేకత ఇది




కేరళ రాష్ట్రం పేరు చెప్పగానే మనకి గుర్తు వచ్చేది కధాకళి నృత్యం.ఆ పాత్రలు పోషించే వారు వేసుకునే ఆ దుస్తులు,మేకప్ అవీ అన్నీ ప్రత్యేకం గా ఉంటాయి.ముఖ కవళిక ల తోను,కళ్ళ తోనూ,రకరకాల ముద్రల తోనూ భావ ప్రకటన చేస్తూ సాగుతుంది ఈ కళా రూపం.రామాయణం నుంచి ఇతర శైవ సాహిత్యం నుంచి పాత్రలను తీసుకుంటారు.16 వ శతాబ్దం నుంచి కధాకళి నిరాటంకంగా  కొనసాగుతూనే ఉన్నది.దీనిలో ప్రముఖం గా వాయించే వాయిద్యాలు మద్దల(పొడుగ్గా ఉండేది) , సెంట (నిలువు గా ఉండే డ్రమ్ములు) ,ఇడక్క (సౌమ్య పాత్రలకి వాయించే డ్రమ్ము) ఇలా ఉంటాయి.పద్మనాభన్ నాయర్ (జననం 7 అక్టోబర్ 1928) ని కధాకళి పితామహుని గా పిలుస్తారు.