Thursday, 5 June 2014

శారదా చిట్ ఫండ్ ఏజంట్ల బాధలు చెప్పనలవి గానివి ( విశేష వార్త)పశ్చిమబెంగాల్,ఒడిశా,అసోం,త్రిపుర నాలుగురాష్ట్రాల్లో అసంఖ్యాకమైన సంఖ్యలో ఏజంట్లను నియమించుకొనికొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని దిగమింగి చేతులెత్తేసిన "శారదా చిట్ ఫండ్" కంపెనీ ప్రస్తుతం దేశం లో హాట్ టాపిక్ గా మారింది.

ముధురాపుర్ గ్రామం కలకత్తా నగరానికి తూర్పుగా 5కి.మి.దూరం లో ఉంటుంది.అయితే ఇక్కడికి చేరుకోవడానికి సరైన వాహన సౌకర్యం కూడ ఉండదు.24 పరగణాల జిల్లా లోకి వచ్చే ఈ ఊరికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలిసిందే.

ఇక్కడ నివసించే శిబానీదాస్ అనే మహిళ శారదా చిట్ ఫండ్ ఏజంట్ గా పనిచేసేది.రోల్డ్ గోల్డ్ నగలు అమ్మే వేరే చిన్న వ్యాపారం కూడా ఈమెకి ఉంది.2012 లో ఏజెన్సీ తీసుకున్న ఈమె 100 మంది దగ్గరనుంచి కొన్ని లక్షల రూపాయలు సేకరించింది.అంతేకాదు ఆమె కింద కొంతమంది ఏజంట్లని కూడా చేర్పించింది.ఒకటిన్నర లక్షల రూపాయలు శిబానీ కూడా పొదుపు చేసింది.ముందు వడ్డీ బాగానే వచ్చింది.2500 కోట్ల రూపాయలకి కంపెనీ శఠగోపం పెట్టడంతో ఈమె లాంటి ఏజంట్ల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి.

ఈమెని  నమ్మి ఆ చిట్ ఫండ్లో డబ్బులు పెట్టినవారంతా ప్రస్తుతం  వత్తిడి పెడుతున్నారు. మాడబ్బులైనా ఇవ్వు లేదా..లేదా నువ్వైనా మాతో పడుకో అని పచ్చిబూతులు తిడుతున్నారు అని ఆమె వాపోతున్నది.పొద్దుటే బయటికి వెళ్ళిపోయి చీకటి పడినతరువాత వచ్చి ఇంట్లో పడుకుంటున్నానని శిబాని తెలిపింది.చాలామంది ఏజంట్ల జీవితాలు ఇలాగే తయారయ్యాయి.

శారదా చిట్ ఫండ్ ప్రధాన కేంద్రం కలకత్తా నగరం.దాని అధినేత సుదీప్తో సేన్ అనేది తెలిసిన విషయమే.నాలుగు రాష్ట్రాల్లో అంటే బెంగాల్,ఒడిశా,అసోం,త్రిపుర లలో మొత్తం ఈ కంపెనీకి 10 లక్షలమంది ఏజంట్లు ఉన్నారు. వాళ్ళలో చాలామంది పరిస్థితి శిబానీ లాగానే ఉన్నది.

పెట్టిన పెట్టుబడివరకైనా తిరిగి చెల్లిస్తామని పశ్చిమ బెంగాల్ రాష్ట్రప్రభుత్వం ముందు హామీ ఇచ్చిన ..ప్రస్తుతం ఆ విషయాన్ని పట్టనట్లే వ్యవహరిస్తున్నది.తృణమూల్ పార్టీలోని అగ్రనాయకులకి,శారదా చిట్ ఫండ్ అధినేత కి మధ్యగల సంబంధాల వల్ల ఈ కంపెని ని నమ్మి జనాలు మదుపు చేసిన మాట వాస్తవం.

2013 లో శారదా గ్రూప్ ఏర్పాటు చేసిన ఒక మీటింగ్ లో కూడా తృణమూల్ మంత్రులు ఈ కంపెనీ ఏజంట్లుగా చేరమని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. శారదా గ్రూప్ ని ముట్టుకునే సత్తా ఎవరికీ లేదని బాహాటంగా ప్రచారం చేసేవారు.తీరా అలంటి నాయకులంతా ప్రస్తుతం మొహం చాటు వేస్తున్నారని ఏజంట్లు అంటున్నారు.

రవాణాశాఖా మంత్రి అమిత్ మిత్రా ఆనాడు మాట్లాడిన ప్రసంగాన్ని సైతం కొంతమంది యూట్యూబ్ లో పెట్టారు.దీపికా దాస్ అనే గృహిణి మాట్లాడుతూ తాను 75 వేల రూపాయల్ని మదుపు చేశానని చేతికి పైసారాలేదని వాపొయింది.దీదీ ఆశీర్వాదం తమ కంపెనీకి ఉన్నాయని ఏజంట్లు ప్రచారం చేయడం వల్ల పెద్ద ఎత్తున జనం పెట్టుబడులు పెట్టారని చెప్పింది.అది ప్రభుత్వ సంస్థ, ప్రయివేట్ సంస్థ అనేది తమకి తెలియదు అని తృణమూల్ ఎం.పి.లు శతాబ్ది రాయ్ లాంటివాళ్ళు ఈ శారదా గ్రూప్ ఆఫీసులని అట్టహాసంగా ప్రారంభించేవారని ఆ నమ్మకం తోనే చేరి మునిగామని తెలిపింది.

మూడేళ్ళలో పెట్టుబడి రెండింతలు అవుతుందని,ఏడేళ్ళలో నాలుగు రెట్లు అవుతుందని,పన్నెండేళ్ళలో పదిరెట్లు అవుతుందని మాకు ఏజంట్లు చెప్పి తీరా ఇలా ముంచారని దీపికా అన్నది.ఈ కంపెనీ వాళ్ళు అంబులెన్స్ లు విరాళంగా ఇచ్చేవారు.అలాగే స్థానిక దుర్గ పూజ ఉత్సవాలకి కూడా విరాళాలు ఇచ్చేవారు.దీనికి రాష్ట్రమంత్రులు సైతం హాజరయ్యేవారు.అది చూసి జనాలు ఆకర్షితులయ్యారు.ఓ మైక్రో ఫైనాన్స్ లో అప్పుతీసుకొని,ఎక్కువ వడ్డీ వస్తుంది కదాని శారదా గ్రూప్ లో పెట్టినవాళ్ళుకూడా ఉన్నారు.

శ్యామల్ సేన్ కమీషన్ కంపెనీ కి గల ఆస్తులని వేలం వేయడానికి ఆదేశమిచ్చింది.అయితే మమతా సర్కారు ప్రజలకి వారి సొమ్ముని తామే చెల్లిస్తామని ,ఆందోళన చెందనవసరం లేదని ముందు ప్రకటించింది.ప్రస్తుతం సుప్రీం కోర్ట్ ఈ కేసు ని CBI కి అప్పగించమని ఆదేశించడం తో దీదీ ప్రస్తుతం మాట మార్చి కేంద్రప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని తమకి సంబంధం లేదని ఎదురుతిరిగింది.దీంతో జనాల పరిస్థితి దారీతెన్ను లేకుండా అయింది.

ఒడిశా రాష్ట్రం సుప్రీం కోర్ట్ తీర్పుని స్వాగతించింది.దీంట్లో ఇన్వెస్ట్ చేసిన నాలుగు రాష్ట్రాల ప్రజల్ని నిలువునా ముంచారని,దీని ప్రభావం గ్రామీణ ఆర్దిక వ్యవస్త పై దారుణంగా ఉంటుందని ఆశిం చటర్జీ అన్నారు.ఈ శారదా చిట్ ఫండ్ తో పాటు మిగతా చిట్ ఫండ్ స్కాం లని కూడా పరిశోధించమని సుప్రీం కోర్ట్ ఆదేశించింది. Rose valley ఇంకా సన్మార్గ్ చిట్ ఫండ్ వంటి  12 ఇతర కంపెనీలు కూడా ఈ దెబ్బకి భయపడుతున్నాయి.

సుదిప్తో సేన్ స్కాం చేసిన ధనాన్ని మొత్తం ఎక్కడికో తరలించి ఉండవచ్చునని ,నళినీ చిదంబరం లాంటి రాజకీయ పలుకుబడిగల న్యాయవాదులు అతని అమ్ములపొదిలో ఉన్నారని కాబట్టి ఏమి జరుగుతుందో ఊహించలేమని కొందరు అభిప్రాయపడుతున్నారు.రాష్ట్రం లోని కాంగ్రస్ పార్టి నాయకులు రంజన్ చౌధురి,సి.పి.ఎం.నాయకులు గౌతం దేబ్ వంటివారు పరిశోధన నిష్పక్షపాతంగా సాగాలని కోరుతున్నారు.

            --News Post Special Desk   

No comments:

Post a Comment