Showing posts with label జాతీయ వార్తలు. Show all posts
Showing posts with label జాతీయ వార్తలు. Show all posts

Saturday 23 December 2023

ఎందుకు MBBS కి అంత ఫీజు మన దేశం లో ?

 


ఎందుకు MBBS కి అంత ఫీజు మన దేశం లో ? విదేశాల్లో అంత ఎందుకు ఉండదు. అక్కడ వైద్య విద్య అంత నాణ్యత ఉండదేమో అనుకుంటారు చాలామంది. 

కాని అది నిజం కాదు. కిర్గిస్తాన్, రష్యా, చైనా, ఫిలిప్పైన్స్, కజకస్థాన్ ఇలాంటి దేశాల్లో మెడిసిన్ చదువు మన దేశం లో అంత ఖరీదు కాకపోయినా విద్య నాణ్యత లో ఏ మాత్రం తేడా ఉండదు.

 ఆ దేశాల్లో వైద్య విద్య చదివిన వారిని చిన్న చూపు చూడల్సిన పని లేదు.

మన దేశం లో ఉన్న విపరీతమైన డిమాండ్ ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక్కో రాష్ట్రం లో ఫీజులు ఒక్కోలా ఉన్నాయి. 

వీటిని అదుపు చేసే వ్యవస్థ లేకపోవడం విచిత్రం. కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సంవత్సరానికి గాను మూడు కోట్ల రూపాయల పైన వసూలు చేస్తున్నాయి.

 ఇక మెడిసిన్ అయిపొయేసరికి ఎంత అవుతుందో తేలిగ్గా ఊహించవచ్చు.

మన దేశం లో ప్రైవేట్,ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నీ కలిపి 1,04,333 సీట్లని కలిగి ఉంటే ,మొన్న 2023 NEET లో పరీక్ష రాసిన అభ్యర్థులు ఇరవై లక్షల మంది పై మాటే. 

మరి ఈ లెక్కన ఎంత పోటీ ఉందో చూడండి,అందుకే డబ్బులున్న వాడు ఎంతకైనా కొనుక్కుంటున్నాడు.

టాప్ 4 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల్లో మూడు దక్షిణాది లోనే ఉన్నాయి. ఎక్కువ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు ఉన్న రాష్ట్రం కర్నాటక గా తేలింది. 

రమారమి 208 దాకా ఉన్నాయి. ప్రైవేట్ సీట్లలో తక్కువ ఫీజు తో దొరికే కాలేజ్ లు కర్నాటక,కేరళ,చత్తిస్ ఘడ్ లలో ఉన్నాయి. 

మెడిసిన్ మీద ఇష్టం లేకపోయినా, స్టేటస్ కోసం పెద్దల వత్తిడి తో మెడిసిన్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. మన సమాజం లో డాక్టర్ కి ఉన్న స్థానం అలాంటిది.

--- NewsPost Desk

Thursday 7 September 2023

94 ఏళ్ళు జీవించిన ఆయన మృత్యువు ని ముందుగానే ఊహించారా


 జయంత మహాపాత్ర (94) గత నెల 27 వ తేదీన పరమపదించారు. అప్పుడు కొన్ని వాక్యాలు రాద్దామని , ఎందుకనో రాయలేకపోయాను. చాలామంది రాసేశారు. కాని నాకు తోచింది నేను రాస్తాను. భారతీయాంగ్ల సాహిత్యం లో ముఖ్యంగా కవిత్వం కి సంబంధించి ముగ్గుర్ని త్రిమూర్తులు గా భావిస్తారు. వారు ఏ.కె.రామానుజన్, ఆర్. పార్థసారథి ఇంకా ఇటీవల మరణించిన జయంత మహాపాత్ర. ఇంచుమించు రెండు తరాల కిందట నుంచి జయంత పేరు ఇంగ్లీష్ సాహిత్యం చదివేవారికి సుపరిచితం. దేశ విదేశాల్లో కూడా..!

బొంబాయ్ నుంచి ఆ రోజుల్లో నిస్సిం ఎజికెల్, అరుణ్ కొలత్కర్ లాంటి వాళ్ళు రాసే ఇంగ్లీష్ కవిత్వం పరిచిన దారిని కాదని తనదైన ,తమ దైనందిన జీవితానికి సంబంధించిన ఇతివృత్తాలతో కొత్త దారిని పరిచినవాడు జయంత. ఇంగ్లీష్ కవిత్వమే గాని ఒరియా జీవితాన్ని ఆలంబనగా చేసుకుని రాసినది. కవిత్వం మాత్రమే కాదు కథలు,వ్యాసాలు కూడా ఆయన రాశాడు. మొత్తం 27 పుస్తకాల్లో ఇరవై పుస్తకాల్ని ఇంగ్లీష్ లోనూ ఏడు పుస్తకాల్ని ఒరియా భాష లోనూ జయంత రాశాడు.

విదేశీ పత్రికలు గుర్తించి ప్రచురించిన తర్వాతనే భారతీయ ఆంగ్ల పత్రికలు ఆయన రచనల్ని ప్రచురించడం మొదలుపెట్టాయి. ద న్యూయార్కర్,న్యూ ఇంగ్లండ్,చికాగో రివ్యూ,జార్జియా రివ్యూ, ద న్యూ రిపబ్లిక్ ఇలాంటి పత్రికలు మొదట్లో ఆయన ఇంగ్లీష్ కవిత్వాన్ని బాగా ప్రోత్సహించాయి. కేంద్ర సాహిత్య అకాడెమీ వారు ప్రచురించే బై మంత్లీ ఇండియన్ లిటరేచర్ లో ఇంకా ఇతర దేశీ పత్రికల్లో బాగా ఆయన రచనలు వచ్చేవి.

ఇంగ్లీష్ సాహిత్యం లో మొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ ప్రదానం చేసినది ఈయనకే. అవార్డులు, గౌరవ డాక్టరేట్లు గురించి చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది. స్వతహాగా ఫిజిక్స్ ఆచార్యుడైనప్పటికీ ఇంగ్లీష్ కవిత్వం వల్ల ఆయనకి ప్రత్యేకత ఒనగూరింది. చాలా లేటుగా అంటే తన 60 వ ఏట నుంచి కవిత్వం రాయడం మొదలెట్టారు. కటక్ నుంచి ఈయన వెలువరించే చంద్రభాగ అనే సాహిత్య పత్రిక భారతీయ ఇంగ్లీష్ సాహిత్యసేవ విషయం లో చెప్పుకోదగిన మైలురాయి.

సచ్చిదానంద మొహంతి అనే అభిమాని (రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్) జయంత మహాపాత్ర గురించి రాస్తూ ఆయన బాల్యం రెండు ప్రపంచాల మధ్య బాధాకరం గా సాగిందని,దాని గురించి చివరి దశలో మిత్రుల వద్ద చెప్పేవారన్నారు. జయంత మహాపాత్ర యొక్క తాత గారు క్రైస్తవ మతం స్వీకరించడం తో ఇంట్లో ఆ పద్ధతులు పాటించడం ఉండేదని, అయితే బంధువులు అంతా సనాతన సంప్రదాయవాదులు కావడం తో హిందూ మతానికి దూరమయ్యానని...అటూ ఇటూ ఏ మతానికి చెందని వాడిగా నా బాల్యం గడిచిందని దానివల్ల మానసిక క్షోభ కి గురయ్యానని చెప్పేవారు.

గ్ర్రాండ్ ఫాదర్ అనే కవిత నిజంగా వాళ్ళ తాత గారిని ఉద్దేశించి రాసిందే. దానికి బాగా పేరు వచ్చింది. 1866 లో వచ్చిన భయంకరమైన కరువు నుంచి రక్షించుకోవడానికి ఆయన కన్వర్ట్ అయినట్లు దానిలోని సారాంశం. ఆ రోజుల్లో కరువు నుంచి ఆదుకునే క్యాంపు ల్లో క్రైస్తవ మతం లోకి మారినవాళ్ళకి మాత్రమే ఆహారం ఇచ్చేవారట. దాన్ని దయనీయంగా ఆ కవిత లో వర్ణించారు జయంత.

94 ఏళ్ళు జీవించిన ఆయన మృత్యువు ని ముందుగానే ఊహించారా అనిపిస్తుంది. బర్డ్స్ ఆఫ్ వాటర్ అనే మీ కవితా సంకలనాన్ని డిసెంబర్ 2023 లో ప్రచురిస్తాను అని ఓ పబ్లిషర్ చెప్పినప్పుడు , నేను అంత వరకు బతికి ఉంటాననే అనుకుంటున్నావా అని జోక్ చేశారట. అదే నిజమైంది. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిపింది.

--- మూర్తి కెవివిఎస్ 

Wednesday 14 June 2023

"కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు..." అనే జీవిత చక్రం లోని పాట ఎవరు మరిచిపోగలరు..?


 మధుర గాయని,విలక్షణమైన స్వరం తో ఎంతో మంది సంగీతాభిమానులను ఆకట్టుకున్న పాతతరం గాయని శారద నిన్న తన 86 వ యేట మృతి చెందారు. ముఖ్యంగా తెలుగు వారికి జీవిత చక్రం సినిమా లో పాడిన మధుర గాయని గా గుర్తు. "కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు...,మధురాతి మధురం మన ప్రేమ మధువు " లాంటి పాటలు ఎన్ని ఏళ్ళు మారినా మరిచిపోలేని పాటలు.శారద గొంతు లో ఒక గమ్మత్తు ఉండేది. ఓ చిన్నపిల్ల,అల్లరిపిల్ల పాడుతున్నట్లుగా ఉండేది.

తమిళనాడు లో జన్మించిన ఈమె పూర్తి పేరు శారదా రాజన్ అయ్యంగార్. హిందీ చిత్రసీమ లో తనదైన ముద్ర వేశారామె. Titli Udi అనే పాటతో (సూరజ్ చిత్రం,1966) ఆమె పేరు మారుమోగింది.రాజ్ కపూర్ ఈమె ని సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ కి పరిచయం చేశారు. హేమామాలిని,షర్మిలా ఠాగూర్,సైరాబాను,రాజశ్రీ లాంటి హీరోయిన్ల కి పాడారు. ఫిల్ ఫేర్ అవార్డ్ పొందారు.

హిందీ మాత్రమే కాకుండా తెలుగు,తమిళ్,గుజరాతీ వంటి భాషల్లో సైతం పాడారు.ఆమె చివరిసారిగా సినిమాల్లో కాంచ్ కి దీవార్ కి పని చేశారు.గాలీబ్ గీతాల్ని ఆల్బం గా పాడారు.హిందీ సినీ పరిశ్రమ లో గల రాజకీయాల వల్ల శారద ఎక్కువ కాలం అక్కడ నిలబడలేకపోయారని అంటారు.ఏది ఏమైనా ఒక విలక్షణ గాయని గా సగీత అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిందామె.   

Monday 8 May 2023

కుకీ ప్రజల గురించి కొన్ని కొత్త సంగతులు

 మణిపూర్ లో చెలరేగిన హింసాత్మక ఘటనలు దేశం మొత్తాన్ని కలవరపరిచాయి. కుకీ ఇంకా మైటే తెగల మధ్య జరుగుతున్న ఘర్షణ అందరినీ మరోసారి ఈశాన్య రాష్ట్రాల వైపు చూసేలా చేశాయి. అసలు ఈ కుకీ తెగ ప్రజలు ఎవరు అని ప్రశ్నించుకుంటే వీరు ఒక్క మణిపూర్ లోనే కాక నాగాలాండ్,మిజోరాం,అస్సాం వంటి రాష్ట్రలతో బాటు మైన్మార్, బంగ్లాదేశ్ లలో కూడా ఉన్నారు.మళ్ళీ వీరిలో కొన్ని ఉప తెగలు ఉన్నాయి.లుషాయ్,డార్లంగ్,రోఖంస్,సరిహద్దు ప్రాంతాల్లో ఉండే చిన్ ఇలా చెప్పవచ్చు.

                                                                     (Kuki women)

వీరు టిబెటొ బర్మన్ మంగోలాఇడ్ జూయిష్ ఎత్నిక్ కమ్యూనిటికి చెందినవారని శాస్త్రవేత్తలు అంటారు. ఖు అంటే గుహ అని అర్థం.దాన్నుంచి కుకి అనే మాట వచ్చింది.అత్యంత్  పురాతన తెగల్లో ఇది ఒకటి.జంతువులు,చెట్లు,పర్వతాలు ఇలాంటి వాటిని ఒకప్పుడు పూజించేవారు.ప్రస్తుతం అనేకమంది క్రైస్తవ మతం లోకి మారడం తో పాత పద్ధతులు అడుగంటాయని చెప్పాలి. విలియం పెట్టి గ్రు అనే బ్రిటీష్ మిషనరీ 1890 ప్రాంతం లో ఇక్కడికి ప్రవేశించి క్రైస్తవ మతాన్ని వ్యాపింప జేశాడు.క్రైస్తవ మతం రాకతో కుకీ సమాజం లో అనేక సాంఘిక పరమైన మార్పులు చోటుచేసుకున్నాయి.  

మణిపూర్ రాష్ట్రం లో కుకీ లు ముప్ఫై శాతం దాకా ఉంటారు. ముఖ్యంగా రాష్ట్రం నలుమూలలా ఉన్న పర్వతాల మధ్య వీరు జీవిస్తుంటారు. మైటే తెగ వారు అధికార కేంద్రానికి దగ్గరగా ఇంఫాల్ పరిసర ప్రాంతం లో ఎక్కువ ఉన్నారు.కుకీ తెగ ప్రజలు క్రైస్తవ మతం లోకి మారినప్పటికీ వారి గిరిజన తెగ హోదా అలాగే ఉంటుంది.ఈశాన్య రాష్ట్రాల కి దానికి సంబందించి కొన్ని ప్రత్యేక చట్టాలు ఉండటం వల్ల అలా కొనసాగుతోంది. కుకీ ప్రజలు సెప్టెంబర్ 13 ని బ్లాక్ డే గా పరిగణిస్తారు.అదేరోజు 1993 లో NSCN(IM) అనే మిలిటెంట్ సంస్థ 15 గ్రామాల్లోని కుకీల్ని చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ఊచకోత కోసింది.

 ఈ మిలిటెంట్ సంస్థ నాగా తెగ కి చెందినది.ఈశాన్య ప్రాంతాల్లోని నాగా ప్రజల్ని,మైన్మార్ లో ఉన్న నాగా ప్రజల్ని ఏకం చేసి ప్రత్యేక దేశం గా ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నది.చైనా,పాక్ ల నుండి విరాళాలు వస్తుండేవి.2019 లో భారత సైన్యం వీరి గూఢచార నెట్ వర్క్ ని ధ్వంసం చేసి చాలా వరకు దీని ప్రభావాన్ని తగ్గించింది. ఈ NSCN సంస్థ ఓ వైపు మావో లతో కలిసిపనిచేస్తూనే మరోవేపు క్రైస్తవ మతం ఆధారంగా పనిచేస్తుంది."నాగాలాడ్ ఫర్ జీసస్" అనేది వారి స్లోగన్.


Sunday 23 April 2023

వీరు ఒక రకంగా హిందువులు, మరో రకంగా హిందువులు కారు

 మన దక్షిణ భారతం ఎన్నో రమణీయ దృశ్యాలకు పెట్టింది పేరు. దానిలో ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో ఉన్న కూర్గు ప్రాంతం తప్పక చూడదగినది. కర్ణాటక రాష్ట్రం లో ఉన్న ఈ జిల్లా బెంగుళూరు నుంచి 270 కి.మీ,మైసూర్ నుంచి 122 కి.మీ. ఉంటుంది.కూర్గు జిల్లా మొత్తం పచ్చని ప్రకృతి తో,జలపాతాలతో,కనువిందు చూసే కాఫీ తోటలతో అలరారుతూంటుంది. కూర్గు జిల్లాని మూడు తాలూకాలుగా విభజించారు. అవి మడికేరి,విరాజ్ పేట,సోమవార్ పేట. 


సంవత్సరం మొత్తం అంతా కూడా 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. అంత చల్లగా ఉంటూ ,కాఫీ పంట ఇంకా అరుదైన సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి కాబట్టి దీన్ని బ్రిటీష్ వారు స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు.ఇప్పటికీ మనవాళ్ళు అలానే పిలుస్తుంటారు. వీరి స్వీట్లు,వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి.బ్రహ్మాండమైన పశ్చిమ కనుమల అందాల్ని చూడాలంటే తప్పక ఇక్కడకి రావాలిసిందే.


(Kodagu people)

రకరకాల వైన్స్ ని తయారుచేయడం లో ఈ ప్రాంతానికి ఓ చరిత్ర ఉన్నది.ఇక్కడ నివసించే ప్రధాన ప్రజలు కొడవ జాతికి చెందినవారు.సైనిక లేద యోధ జాతికి చెందినవారిగా పరిగణించుకుంటారు.వీరి వేషభాషలు,సంస్కృతి,ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీరి ప్రధాన దైవం కావేరి నదీమాత.ఇంకా ప్రకృతి. తుపాకుల్ని సైతం పూజిస్తారు.కేలి మూర్త వీరి పండుగ.వీరి పెళ్ళిళ్ళు గాని శుభ కార్యాలు గాని అన్నీ ఆ కొడవ జాతి పెద్దలే నిర్వహిస్తారు తప్పా బ్రాహ్మల్ని పిలిచి చేయించడం ఉండదు. నిజానికి వీరిలో కులాలు,ఉపకులాలు ఏమీ ఉండవు. అందుకనే వీరు హిందువుల్లో ఉన్నా లేనట్లు గానే కొంతమంది పరిగణిస్తారు.  



Sunday 9 April 2023

ఈ హిల్ స్టేషన్ ప్రత్యేకతే వేరు - కానీ మనవాళ్ళు వెళ్ళేది తక్కువే


ఎంతసేపూ అందరూ వెళ్ళే పర్యాటక ప్రదేశాలేనా,మన దేశం లో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ వాటికి పెద్దగా ప్రాచుర్యం లభించదు. కారణాలు ఏవైనా కావచ్చు.మరి ఇప్పుడు అలాంటి ఓ ప్రదేశం గురించి తెలుసుకుందాం.అది కోరాపుట్ పట్టణం ,దాని పరిసర ప్రదేశాలు.ఒరిస్సా రాష్ట్రం లో ఉన్నది. అయితే విశాఖపట్టణానికి దగ్గర,రైలు ప్రయాణం అయితే అక్కడ నుంచి అయిదు గంటలు పడుతుంది.


సముద్రమట్టానికి రమారమి 3000 అడుగుల పైన ఉన్న ఈ ప్రదేశం మరో కాశ్మీరు మాదిరిగా ఉంటుంది.గొప్ప పర్వత దృశ్యాలు,అడవులు,జలపాతాలు,నదీ ప్రవాహాలు,అటవీ జంతువులు,ఎంతో పురాతమైన ఆదివాసీ తెగలు ఇవన్నీ కలిసి ఓ ప్రత్యేక తరగతి కి చెందిన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాయి.కళ్ళకి విందు చేసే పచ్చదనం,ఎత్తైన గుట్టలు మనోరంజకం గా ఉంటాయి.అంతేకాదు ఇక్కడ కాఫీ పంట కి మంచి గిరాకీ ఉంది.నూరుశాతం అరబిక రకానికి చెందినది.1930 ప్రాంతం లో అప్పటి స్థానిక పాలకుడు రాజా బహదూర్ రామచంద్ర దేవ్   కాఫీ మొక్కల్ని మొట్టమొదటిగా ఇక్కడ నాటారు.

ఇక్కడికి 20 కి.మీ. దూరం లో హిందూస్థాన్ ఏరొనాటిక్స్ లిమిటెడ్ వారి విమానాల ఇంజన్లు తయారుచేసే కర్మాగారం ఉంది. ఇప్పటికీ కోరాపుట్ యొక్క ప్రకృతి దృశ్యాలు నాగరికత కోరలకి బలికాకుండా ఉన్నాయి. మంచి హిల్ స్టేషన్ గా పిలువబడే ఈ ప్రదేశం తన ప్రత్యేక అస్థిత్వాన్ని నిలుపుకొంటున్నది. ఈ చుట్టు పక్కల ఉన్న గుప్తేశ్వర్ ఆలయం,శబర శ్రీక్షేత్రం,కోరాపుట్ మ్యూజియం,కొలాబ డ్యాం, జైన మందిరం వంటి వాటిని తప్పక దర్శించుకోవాలి.     

Wednesday 19 January 2022

దేశం లోని సంగీతప్రియుల్ని అలరిస్తున్న సంబాల్ పూర్ యువసంచలనం...!

మంటూ చురియా ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? ఈ కుర్రాడి వయసు 25 సంవత్సరాలు.ఒడిషా లోని సంబాల్ పూర్ జిల్లా కి చెందిన వాడు.సంబాల్ పూర్ ప్రాంతానికి ఇతను ఓ ప్రత్యేక గుర్తింపు తెస్తున్నాడు. ఒడియా భాష లో సంబాల్ పూర్ ప్రాంతానిది ఓ ప్రత్యేకమైన యాస , దానిపట్ల వారు ఎంతో గర్వంగా ఫీలవుతారు.ముఖ్యం గా జానపద సంగీతం లో వాళ్ళది ప్రత్యేకమైన ఒరవడి.అలాగే మిగతా జానర్ లని కూడా ఇప్పటి యువ సంగీతకారులు స్పృశిస్తున్నారు.


మంటూ చురియా తను తీసే వీడియో ఆల్బం లోని కళాకారులందరికీ సంబాల్ పూరి వస్త్రాలు ధరింపజేస్తుంటాడు.తనతో సహా.చూస్తూంటేనే కనుల విందుగా ఉంటాయి అవి.తను పాడతాడు.కొరియోగ్రఫీ చేస్తాడు.ఇంకా మిగతా నైపుణ్యాలు ఎన్నో ఉన్నాయి.అతని యూట్యూబ్ సబ్స్క్రైబర్లు 1.46 మిలియన్ల మంది ఉన్నారు.తన లేటేస్ట్ ఆల్బం "రాని గురి" అనేదాన్ని దాదాపు 53,781,661 మంది చూశారు. మొత్తం దేశం లోని అన్ని రాష్ట్రాల వారు అతని వీడియో సాంగ్స్ చూస్తూ టాలెంట్ అనేది ఉంటే ప్రజలకి వాళ్ళూ వీళ్ళూ అనే తేడా ఉండదు అని నిరూపిస్తున్నారు.

 మన తెలుగు సినిమాల తో పోలిస్తే ఒడియా సినిమాలు సంఖ్యాపరం గా తక్కువ గా నిర్మాణమవుతాయి.అయితే మ్యూజిక్ ఆల్బం లు మాత్రం బాగా రిలీజ్ చేస్తంటారు.దాంట్లో సంబాల్ పూర్ కళాకారుల క్రియేటివిటీ ని బాగా గమనించవచ్చు.ఈ మంటూ ప్రస్తుతం అసీమా పండా తో కలిసి పాడుతున్న పాటలు పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నాయి.ఢోల్,గిటార్,హర్మనీ వంటి వాయిద్యాల్ని వాయించడమే కాకుండా తన పాట తో,ఆట తో ఆకట్టుకునే మంటూ చురియా కి అభినందనలు తెలియజేద్దాం.

మొత్తానికి సంబాల్ పూరి మాండలీకానికి మంటూ వల్ల ఓ కొత్త గుర్తింపు వచ్చింది.నిజానికి అంతకు ముందు " రంగ బాతి" అనే జానపద పాట కూడా సంబాల్ పూర్ ని దాని మాండలీకాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది.ఆ కళాకారులు చాలా సీనియర్ లు ఇతని తో పోల్చితే..!

బిహు,సెల్ఫీ బేబొ,దెసి పిలా,హం సమల్ పూరియా బాబూ ఇంకా ఇలాంటి ఆల్బం లతో చిన్నసైజు స్టార్ అయిపోయాడు మంటూ చురియా.చూడటానికి చాలా చిన్నగా హై స్కూల్ కుర్రాడి లా ఉండే ఇతను ఒడియా జానపద సంగీతాన్ని మరో స్థాయి కి తీసుకువెళ్ళాడు అని చెప్పాలి. ఇక్కడ అతని పాట ఉన్న వీడియా ని ఇస్తున్నాము,చూడండి.   

Friday 17 September 2021

యూట్యూబర్ గా దుమ్ము దులుపుతున్న గిరిజనుడు

 
యూట్యూబర్ గా దుమ్మురేపుతున్న గిరిజనుడు ఇసాక్ ముండా. ఈయన ఒడిశా రాష్ట్రం లోని సంబల్ పూర్ జిల్లా కి చెందిన అతి సాధారణ వ్యక్తి. అయితేనేం,తనదైన శైలి లో తన రోజువారీ జీవితాన్ని యూట్యూబ్ లో పెడుతూ పేరు కి పేరు డబ్బు కి డబ్బు సంపాదిస్తున్నాడు.అసలు ఈ వీడియోలు చేయడం అలాంటివి ఏవీ మొదట్లో తనకి తెలియవు.


ఒకసారి వాళ్ళ ఇంట్లో పిల్లలు జియో ఫోన్ లో ఏదో యూట్యూబ్ కార్యక్రమం చూస్తూ ఉండగా మనోజ్ డే అనే సీనియర్, యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బులు సంపాదించవచ్చని చెబుతూ వివరాలు చెప్పసాగాడు.వీటిని బాగా విన్న ఇసాక్ ముండా తాను కూడా వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలని సంకల్పించాడు.


మంచి స్మార్ట్ ఫోన్ కావాలనే ఉద్దేశ్యం తో ఇన్స్టాల్ మెంట్ లో మూడువేల రూపాయల ఫోన్ ని కొనుగోలు చేశాడు.తన పాత ఫోన్ ని అమ్మేశాడు.నిరుపేద గా ఉన్న తను ఏవో లేనిపోని గొప్పలకి పోదలుచుకోలేదు. తన రోజువారీ గ్రామీణ గిరిజన జీవితాన్నే వీడియోలు గా తీశాడు.తాను ప్రతి రోజు తినే తిండి,ఆహార పానియాలు,చుట్టుపక్కల ఉండే వాటినే షూట్ చేసి అప్లోడ్ చేసే వాడు. 

ఒక్కో రోజు కూర కూడా వేసుకోకుండా అన్నం తినేవాడు.దాన్ని కూడా వీడియో తీశాడు.వంటలు,భోజనాలు,వాటికి సంబందించిన పోటీలు ఇలాంటివి అన్నీ షూట్ చేసి అప్లోడ్ చేసే వాడు.క్రమేపి అతని యూట్యూబ్ చానెల్ కి దేశీయం గా,అంతర్జాతీయం గా బాగా సబ్ స్క్రైబర్లు పెరిగారు. తన మొదటి వీడియో కి 34000 రూపాయలు వచ్చాయి.ప్రస్తుతం అతను నెలకి లక్ష రూపాయల కి పైగా సంపాదిస్తున్నాడు.


ఒకసారి మన్ కి బాత్ లో ప్రధాని ఈయన గూర్చి ప్రస్తావించారు.దానితో తన కీర్తి మరింత పెరిగింది. ఇతని కి ఓ అభిమాని ఇల్లు కూడా కట్టించాడు.విదేశాల నుంచి కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.మరి ఇది సామాన్యుడు సాధించిన ఘన విజయం కాక మరేమిటి..? ఈ ముప్ఫై ఏళ్ళ యువకుని చదువు కేవలం ఏడవ తరగతి మాత్రమే.రెక్కాడితే గాని డొక్క నిండని కుటుంబం.భార్య,నలుగురు పిల్లలు. అదండీ విషయం.

Wednesday 5 May 2021

మన తెలుగు పత్రికలు ఈ సాహితీ పుత్రుని మరణాన్ని పట్టించుకోలేదనే చెప్పాలి

 


గతనెల 27 వ తేదీన భారతీయ దిగ్గజ రచయిత అనదగ్గ మనోజ్ దాస్ గారు తన 87 వ యేట పరమపదించారు. మనకి స్వాతంత్రయం వచ్చిన తర్వాత మొదటి తరం ఇండో ఆంగ్లియన్ రచయితలు ఎవరయ్యా అంటే ఆర్.కె.నారాయణ్,ముల్క్ రాజ్ ఆనంద్ ఇంకా మనోజ్ దాస్ అని చెప్పాలి.ఇంకా కొంతమంది ఉండవచ్చు గాక కాని రాశి లోనూ,వాసి లోను ఎన్నదగిన వారి పేర్లు వచ్చినపుడు ఈ మూడు పేర్లు ముందు వరుస లో నిలుస్తాయి.


అటువంటి ప్రముఖ రచయిత మరణిస్తే మన తెలుగు దినపత్రికలు ఏవీ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.కనీసం ఆ న్యూస్ కూడా వచ్చినట్లు లేదు మరి ఎందుచేతనో అర్ధం కాలేదు. అయితే జాతీయ స్థాయి పత్రికలు అన్నీ బాగానే కవర్ చేశాయి.మనోజ్ దాస్ కి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఆయన మాతృభాష ఒరియా లో ఎంత విస్తృతం గా రాశారో,ఆంగ్లం లోనూ అంత విస్తృతం గానూ రాశారు.అటువంటి ద్విభాషా పాండిత్యం కలిగి రెండు భాషల్ని రెండు కళ్ళు గా భావించి సృజానాత్మక రచనలు చేసినవారు చాలా అరుదు.


రమారమి తొంభై దాకా పుస్తకాలు రెండు భాషల్లో రాశారు. ఒడియా ప్రజలు ఆయన్ని వ్యాస కవి అని గౌరవిస్తారు.కొన్ని వందల కథలు,వ్యాసాలు రాశారు.ట్రావెలోగ్స్ రాశారు.హిందూ,హిందూస్థాన్ టైంస్,టైంస్ ఆఫ్ ఇండియా వంటి ఇంగ్లీష్ దినపత్రికలకి కాలంస్ ని చివరి రోజుల దాకా రాస్తూనే ఉన్నారు.బాగా జ్ఞాపకం తెచ్చుకోగలిగినట్లయితే ఇంగ్లీష్ చందమామ లో కూడా ఆయన రాసిన బాలల కథలు వచ్చేవి.అవే తెలుగు లో కూడా అనువాదమయ్యేవి.


సాంఘిక,జానపద,పౌరాణిక అంశాల నుంచి నేటి ఆధునిక ధోరణుల్ని ఆయన తన రచనల్లో పొందుపరిచారు.ఇక అరవిందుని తాత్వికత పై ఎనలేని సాధికారత ఉండేది.1963 లో పాండిచేరి లోని ఆశ్రమం లో కి వచ్చి అక్కడే నివసించారు. ఆ సంస్థ కి సంబందించిన యూనివర్సిటీ లో ఇంగ్లీష్ సాహిత్యాన్ని,అరవింద తత్వాన్ని బోధించారు.కాలేజ్ రోజుల్లో వామపక్ష ఉద్యమనేత గా ఉండి ఒక ఏడాది జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత కొంత కాలానికి అరవిందుని ఫిలాసఫీ కి ఆకర్షింపబడి పాండిచేరి చేరుకున్నారు.


The Submerged valley,Tiger at the twillight,Chasing the rainbow,Bulldozers,Mystery of the missing cap ఇలాంటి కొన్ని నవలలు,కథా సంపుటాలు నేను చదివిన వాటిలో కొన్ని.ఇంకా ఆయన రాసే కాలంస్ ని కూడా ఆంగ్ల దినపత్రికల్లో ఫాలో అయ్యేవాణ్ణి.గంభీరత,వ్యంగ్యము,హాస్యము ,విషయ విశ్లేషణ వారి లో బాగా ఎన్నదగిన విషయాలు.సమకాలీన రాజకీయాలు,బ్రిటీష్ రాజ్ కాలం లోని అంశాలని భూమిక గా చేసుకొని చాలా కథలు రాశారు.బరంపురం కి చెందిన ఉపద్రష్ట అనురాధ గారు మనోజ్ దాస్ గారి కథల్ని కొన్ని తెలుగు లోకి అనువదించి పుస్తకం గా తెచ్చారని తెలిసింది.వాకబు చేస్తే ఆ కాపీలు ఇప్పుడు లభ్యం కావడం లేదని తెలిసింది.అనురాధ గారు జీవించి ఉన్నకాలం లో ఆమె తో ఫోన్ లో మాట్లాడాలని ప్రయత్నించాను.అయితే ఆమె అనారోగ్యం తో ఉన్నారని మిత్రులు విజయచంద్ర గారు చెప్పారు.ఆ కొన్నాళ్ళకే ఆమె పరమపదించడం జరిగింది.   


మనోజ్ దాస్ గారికి సరస్వతి సమ్మాన్,కేంద్ర సాహిత్య అకాడెమీ వారి ఫెలోషిప్ లాంటివి ఎన్నో గౌరవాలు వరించాయి. ఈ మధ్య కాలం లోనే పద్మభూషణ్ కూడా పొందారు.నిజానికి జ్ఞాన్ పీఠ్ అవార్డ్ కి ఆయన నూటికి నూరు పాళ్ళు అర్హుడు.కాని ఎందుచేతనో రాలేదు.ఆయన తో సన్నిహితం గా ఉండే ఒక ఒరియా మిత్రుని తో ఇదే మాట అన్నప్పుడు ఆయన చెప్పిందేమిటంటే రాయడం వరకే తప్పా అవార్డ్ ల కోసం పైరవీ లు చేయడం అనేది మనోజ్ దాస్ గారికి అసలు ఇష్టం ఉండదట.


బహుశా ఏడాది కి పై కాలం లోనే ఆయన భార్య మరణించారు.వాళ్ళకి పిల్లలు లేరు.నేను ఆయన్ని కలిసినపుడు ఆ వృద్ధాప్య భారం తో ఒంటరి గానే ఉన్నట్లు అనిపించింది.పనిమనిషి ఒకరు ఉన్నట్లు జ్ఞాపకం.అయితే ఆయన్ని కలవడానికి రచయితలు,పాత్రికేయులు,అభిమానులు ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు.చేతనైనంత వరకు దేశ విదేశాల్లో ఉపన్యాసాలు అవీ ఇస్తుండేవారు.గత నాలుగు నెలల నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. సోషల్ మీడియా లో ఆ వార్తలు బాగా వచ్చేవి.ఎట్టకేలకు మొన్న ఏప్రిల్ లో 27 న ఆయన తన దేహ యాత్ర చాలించారు.

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దివంగత మనోజ్ దాస్ పేరు మీద అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.ఒరియా,ఇంగ్లీష్ భాషల్లో వచ్చే ఉత్తమ సాహిత్యానికి పది లక్షల నగదు ప్రతి కేటాయిస్తారు.సొంత గ్రామమైన శాంఖరి లో మన్మధ్ మనోజ్ మెమోరియల్ లైబ్రరి ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.  

------ Murthy Kvvs (gitika232@gmail.com)

Sunday 13 December 2020

ఒకే ఒక్కరి కోసం పోస్ట్ ఆఫీస్ తెరిచారక్కడ.

 


పట్టణం లో గాని గ్రామం లో గాని పోస్ట్ ఆఫీసు ఉండటం సహజమే గాని కొన్ని వాటి వెనుక మరిచి పోలేని విషయాలు ఉంటాయి.ఇప్పుడంటే సమాచార వ్యవస్థ ఎన్నో రకాలుగా విస్తరించింది గాని ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులు పోషించిన పాత్ర అమోఘం.


ఒకే ఒక వ్యక్తి కోసం పోస్ట్ ఆఫీసు ని తెరిచారు ఒరిస్సా లోని బరి కలామతియ అనే గ్రామం లో,అదీ 1960 ల్లో..!దాని కధాకమామీషు లోకి వెళదాం. కృపాసింధు మొహంతి అనే ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆ రోజుల్లో ఆంగ్లం బోధించేవారు. పర్యవేక్షణ కి వచ్చిన అధికారి విద్యార్థుల్లో సరిగ్గా ప్రగతి లేదని మందలించారట. దానితో కృపా సింధు ఈజీ గా ఆంగ్లం నేర్చుకోవడానికి పుస్తకాల గురించి వెతగ్గా అలాంటివి ఒడియా భాష లో కనిపించలేదు.


దానితో ఆయనే పూనుకుని The common knowledge in English అనే పుస్తకాన్ని అతి సరళ ఒడియా భాష లో రాశాడు.ఈ పుస్తకం ఆదరణ పొందడం తో మరిన్ని రాశాడు.ఇవి ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే రాష్ట్రం నలుమూలల నుంచి ఈయనకి వీటి గురించి ఉత్తరాలు రాసేవారు.కటక్ లోని పబ్లిషర్లని సంప్రదిస్తే ప్రచురించకపోవడం తో తన అయిదు ఎకరాల భూమిని అమ్మి ఈ పుస్తకాల్ని ప్రచురించారు ఆయన.


60 ల తర్వత కొన్ని జెనరేషన్ లు కృప మేస్టారి ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు చదివి ప్రభావితం అయ్యారు.నెలకి ఓ సారి "సమాజ్" అనే దినపత్రిక లో యాడ్ ఇచ్చేవారు.దానితో ఆర్డర్లు నెలకి 2500 దాకా వచ్చేవి.వి.పి.పి. లు పంపడం,మనియార్డర్లు రావడం ఎక్కువ అవడం తో ఆ బరి కలామతియ గ్రామం లో ఈయన అవసరాల నిమిత్తమే ఓ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ తెరిచారు. ఆ కార్యాలయం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కృప మేస్టారు 80 ఏళ్ళు జీవించి 2007 లో మరణించారు.ఇప్పటికీ ఆ మేస్టార్ గారి  ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాల గురించి గత తరాల వారు తలుచుకుంటూ ఉంటారు.     

Sunday 4 October 2020

ఆ రోజుల్లో ఇలాంటి శిల్పాల్ని చెక్కడం లో ఉద్దేశ్యం ఏమిటో..?

 


భోరం దేవ్ ఆలయం,ఇది చత్తీస్ ఘడ్ లో ఉన్న పురాతన దేవాలయాల్లో ఒకటి. ఇంచు మించు వెయ్యి ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ నిర్మాణం శివుని కి అంకితం చేయబడింది.రాయపూర్ కి 125 కి.మీ. దూరం లో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే కబీర్ ధాం జిల్లా లోని కేవర్ధా కి 18 కి.మీ.దూరం లో ఉంటుంది.ఆలయం ఉన్న ఊరి పేరు చౌరా గాం.


నగర వంశానికి చెందిన రామచంద్ర ఈ ఆలయాన్ని నిర్మించాడు.హయ రాజవంశానికి చెందిన అంబికా దేవి ని ఈయన వివాహమాడాడు.చరిత్రని, పురాతన దేవాలయ నిర్మాణాల్ని పరిశీలించే వారికి ఇక్కడ ఎంతో సమాచారం దొరుకుతుంది.ఒరిస్సా లోని కొన్ని ఆలయాల నిర్మాణ పద్ధతులు ఇక్కడ కనిపిస్తాయి.అదే సమయం లో తనదైన ప్రత్యకత కూడా ఈ ఆలయానికి ఉంది.


ఖజురహో వంటి ఆలయాల తీరు లోనే ఇక్కడ కూడా అనేక శృంగార భంగిమల్లో స్త్రీ పురుషులు క్రీడించే శిల్పాలు విరివిగా ఆలయం గోడల పై కనిపిస్తాయి.అదొక్కటే కాదు,వాస్తు నిర్మాణ విశేషాలు కూడా ఆసక్తికరం గా ఉంటాయి.మార్చి నెల చివరి వారం లో ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి.  

Monday 6 July 2020

నాగా లు శునక మాంస ప్రియులా..?

నాగాలాండ్ మన దేశపు ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి అనే సంగతి అందరకీ తెలుసు.కానీ అక్కడి ప్రత్యేకమైన పండుగ గూర్చి ఎంత మందికి తెలుసు..?ఒక పక్షి పేరు మీదు గా ఆ పండుగ జరుగుతుంది. Hornbill Festival దాని పేరు. Hornbill అనే పక్షి కి నాగా సంస్కృతి లో విడదీయరాని సంబంధం ఉంది. అక్కడి కధల లోనూ,జానపద గీతాల లోనూ ఆ పక్షి కి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10 వ తేదీ వరకు కొహిమా దగ్గర లోని కొసిమా అనే ఊరి లో ఈ పండుగ నిర్వహిస్తుంది.దేశ విదేశాల నుంచి దీనికి చాలా మంది హాజరవుతుంటారు.



మొట్ట మొదటి గా 2000 వ సంవత్సరం లో ఈ పండుగ ని తమ ప్రత్యేకత అందరకీ తెలియజెప్పడం కోసం ప్రారంభించారు.అంగామి,రెంగామి,కుకీ,నాగా వంటి తెగలు ఈ రాష్ట్రం లో ఉన్నాయి. వారికి సంబందించిన విశేషాలు అంటే అక్కడి నృత్యాలు,శిల్పకళ,చేతి వృత్తుల వారి కళా స్వరూపాలు,పాటలు,ఆటలు,చిత్రకళలు ఒకటేమిటి ఇలాంటివి అన్నీ ఒకేచోట ఆ పది రోజుల పండుగ లో చూడవచ్చు.

నాగాలాండ్ రాష్ట్రం ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు.2013 లో జరిగిన జనగణన ప్రకారం నాగాలాండ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత నమోదయింది.అదేమిటంటే అక్కడి జనాభా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ శాతం లో తగ్గినట్లు గా వెల్లడయింది.గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేదరికం చాలా ఇత్ర రాష్ట్రాల తో పోలిస్తే తక్కువేనని చెప్పాలి. నాగాలాండ్ లోని లోపలి ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాలి.మైన్మార్ కి (బర్మా) సరిహద్దు లో ఉండటం వల్ల విదేశీయుల కదలికలు నియంత్రించబడతాయి.



1967 లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ ని అధికార భాష గా ప్రకటించింది.నాగామీస్,క్రియోల్,అస్సామీస్ ఆధారిత భాషలు కూడా ప్రధానం గా ఉన్నాయి. 16 వివిధ తెగల తో వర్ధిల్లే ఈ రాష్ట్రం లో సంవత్సరం అంతా ఏవో స్థానిక పండుగలు జరుగుతూనే ఉంటాయి. శునక మాంస ప్రియులు అంటూ నాగా ల మీద ఉన్న అపోహ లో పూర్తి సత్యం లేదు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ తరహా వారు ఉన్నారు.వారి జనాభా తో పోల్చితే అది చాలా తక్కువ.


















Sunday 16 February 2020

లక్ష దీవుల వంటకాలు అక్కడ ప్రత్యేకత



లక్ష దీవులు అంటే చాలా మందికి కేవలం మన దేశానికి చెందిన దీవులు మాత్రమే.కాని కేరళ కి చెందిన ముగ్గురు యువకులు మాత్రం ఆ దీవుల కి చెందిన రకరకాల వంటకాల్ని రుచి చూపించడానికి కేరళ లోని కోజికోడ్ లో ఒక హోటల్ ని తెరిచారు.హమిదుల్లా మహ్మద్,నౌషాద్, నిషాల్ పరంబిల్ అనే విద్యార్థులు సరదాగా తమ పాకెట్ మనీ కోసం ఈ దుఖాణం ని తెరిచారు.అయితే అది ఇప్పుడు  మంచి లాభాల్ని కూడా తెచ్చిపెడుతోంది.సముద్ర చేపలు,కొబ్బరి వంటకాలు అన్నీ కలిపి 20 రకాల వంటకాలు ఇక్కడ లభ్యమవుతాయి.కేవలం మేము 700 చదరపు అడుగుల స్థలం లోనే షాపు తెరిచాము.కష్టమర్లు బాగా సమకూరారు.ప్రస్తుతం మేము కొన్ని విదేశాలకి కూడా మా ఉత్పత్తుల్ని పంపిస్తున్నాము.ప్రభుత్వం అందిస్తున్న సాయం తో లక్ష దీవుల్లో కూడా బ్రాంచ్ పెట్టబోతున్నాము.టునా పికిల్,కోకోనట్ వినెగర్,టునా మాస్ పాపడ్,టునా మాస్ ఫ్రై,ఇలాంటివే కాకుండా లక్ష దీవుల్లో లభ్యమయ్యే ఔషధ ఉత్పత్తుల్ని కూడా విక్రయిస్తున్నాము అని ఆ యువకులు అంటున్నారు.    

Tuesday 8 October 2019

గుడి సముదాన్ని రక్షించమని కోరుతున్న చంబల్ బందిపోట్లు



బందిపోట్లు గా జనాల్ని ఒకనాడు గడ గడ లాడించిన చంబల్ లోయ నివాసులైన మొహర్ సింగ్ గుర్జర్,నిర్భయ్ గుర్జర్ చంబల్ లోయ లో ఉన్న బాటేశ్వర్ దేవాలయ సముదాయాల్ని ప్రభుత్వం ఇకనైనా పట్టించుకుని వాటిని సమ్రక్షించాలని కోరుతున్నారు.వాళ్ళు ఈ మేరకు ప్రధానికి కూడా వినతి పత్రాలు సమర్పించారు.భూతేశ్వర్ అనే మాట బాటేశ్వర్ అయి ఉంటుందని పరిశోధకుల అంచనా.ఇంతకీ గుళ్ళ ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 400 వరకు ఒకే కాంప్లెక్స్ లో ఉంటాయి.రమారమి 25 కి.మీ.ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చిన్న చిన్న గుళ్ళు దాదాపు ఏడు వందల ఏళ్ళ క్రితం గుర్జర-ప్రతిహార రాజులు నిర్మించినవని చరిత్ర.

ఈ సముదాయాన్ని మన దేశపు అంగోర్ వాట్ టెంపుల్ గా పిలుస్తారు.అనేక ఏళ్ళ పాటు అడివి లో ఉండిపోయి అనుకోని విధం గా కనుగొనబడ్డాయి.చాలా ప్రాంతం వరకు కూలగొట్టబడిన గుళ్ళ యొక్క శిధిలాలు పరుచుకుని ఉన్నాయి.ముందు ఇవి కనుగొనబడినప్పుడు ఏవో కొన్ని నిర్మాణాలు ఉండి ఉండవచ్చునని అనుకున్నారు కాని రమారమి 400 గుళ్ళ దాకా ఇప్పుడు లెక్క తేలింది.ఇవి ముస్లిం రాజుల దండయాత్రల్లో ధ్వంసం చేయబడినవా లేదా భూకంపం వచ్చి ఇలా అయినవా అనేది పూర్తిగా నిర్ధారింప బడలేదు.శివుడు,విష్ణువు,పార్వతి,గణేషుడు వంటి దేవతలకి ఇవి అంకితం చేయబడ్డాయి.బందిపోట్లు గా పేరు పొందిన చాలామంది వారి కార్యకలాపాలకి ముందు తమ ఇలవేల్పులైన ఈ దేవుళ్ళ గుళ్ళని దర్శించి పూజించి మరీ వెళ్ళేవారు.









  

Sunday 21 July 2019

ఏనుగుల్ని చంపడానికి యుథనేషియా చట్టం..?


దేశం లో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పట్టుబడి బతుకీడుస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కడ ఉన్నదో తెలుసా..? కేరళ రాష్ట్రంలోనే..! రమారమి 507 ఏనుగులు ఆ జాబితాలో ఉన్నాయి. వివిధ దేవాలయాల్లోనూ,ఉత్సవాల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు.అయితే కొన్నిసార్లు ఈ ఏనుగుల్లో కొన్ని అనారోగ్యం బారిన పడి బతుకు భారంగా వెళ్ళదీస్తుంటాయి.అలాటి వాటిని కారుణ్య ధృక్పథం తో చంపడానికి యుధనేషియా చట్టాన్ని తెచ్చేందుకు కేరళ రాష్ట్రం ప్రయత్నిస్తోంది.దీనికి తగిన సిఫార్సులను సంబందిత నిపుణులనుంచి తీసుకుంటున్నది.ఈ మధ్య కాలం లో ఏనుగుల్ని నిర్లక్ష్యం గా చూసే మావట్లను రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.ఏనుగులకి వాటి కి సరిపడే ఆహారం ఇవ్వాలి తప్పా తాము ఏది పడితే అది వాటికి పెట్టరాదని దాని సారాంశం.ఏనుగుల మావట్లను తరచూ మార్చరాదని దానివల్ల ఆ జంతువులు ఇబ్బందుల పాలవుతున్నాయని అక్కడి అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.   

Monday 15 April 2019

సైకత శిల్పి ని ఈ రోజు గుర్తు తెచ్చుకోవలసిందే..!



అనేక మార్లు మనకిది అనుభవమే..! మనం పేపర్ తెరవ గానే పూరి బీచ్ లో వేసిన  ఇసుక శిల్పాన్ని చూస్తాము,ఇంకా దానితో బాటుగా చక్కటి సందేశాన్ని కూడా చూస్తాము.దాన్ని చిత్రించిన శిల్పి సుదర్శన్ పట్నాయక్ అనే పేరు ని కూడా చదివి ఉంటాము.ఈరోజు అతని పుట్టిన రోజు.ఎన్నో దేశ విదేశీ సైకత శిల్పాల పోటీల్లో ఫాల్గొని తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న తనకి ఆ కళ ఎన్నో డాక్టరేట్లని,పద్మశ్రీ  అవార్డ్ ని తెచ్చిపెట్టింది.అయితే ఆ పూరీ కుర్రవాని జీవితం ని తెలుసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి.నిజానికి తను డిగ్రీ కూడా చదవలేదు.చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు.తండ్రి ఇంటినుంచి చిన్న తనం లోనే వెళ్ళిపోఅయడు.అయితేనేం తన సృజనా శక్తి తో తన విధిని తనే లిఖించుకున్నాడు.

చిన్నతనం లో ఒక ఇంట్లో పనిమనిషి గా చేసేవాడు.అక్కడ పిల్లలు వేసే బొమ్మలు చూసి తనలో సహజం గా ఉన్న కళ ని మెరుగులు దిద్దుకునేవాడు.ఖరీదైన పేయింట్స్ కొనే స్థోమత లేక పోవడం వల్ల పూరీ బీచ్ కి వెళ్ళి అక్కడ ఇసుక తో రకరకాల బొమ్మలు వేసేవాడు.అవి చూసిన జనాలు మెచ్చుకునే వారు ,అయితే ఇసుక తో వేస్తే అవి ఎంత కాలం ఉంటాయి,గాలి వచ్చినా అలలు వచ్చినా కొట్టుకుపోతాయి గదా అని నిరాశగా అనేవారు.అయితే తనకి మాత్రం దీనిలో బాగా నమ్మకం ఉండేది.ఒక రాత్రి పడుకున్నప్పుడు అనిపించింది ,అసలు జీవితమే పర్మినెంట్ కాదు అలాగని చచ్చిపోతున్నామా అని అనిపించింది.దీనికి
ఒక కొత్తదనాన్ని జోడించాలి,అప్పుడు ఇంకా బాగుంటుంది అని తోచి బొమ్మ వేసి దానికి కేప్షన్ ని సింపుల్ గా,శక్తిమంతం గా రాసేవాడు.క్రమేపి జనాలు వీటిని ఆదరించారు.ప్రాచుర్యం పొందిన తర్వాత ఫలాన సంఘటన కి ఏ బొమ్మ వేసి ఏ కేప్షన్ పెడతాడు అని లోకం ఎదురు చూడసాగింది.దేశ విదేశాల్లో ఎన్నో బహుమతులు పొందాడు.పత్రికలు దేశ వ్యాప్తం గా పోటీలు పడి తన చిత్రాలు ముద్రిస్తుంటాయి ఈరోజున.నాలో ఉన్న సహజ కళ ని నమ్ముకొని ముందుకి పోయిన నన్ను ఆ కళే పైకి తెచ్చింది.ప్రతి ఒక్కరి లోను ఏదో ఒకటి ఉంటుంది,దాన్ని గుర్తించి జీవితాన్ని అర్పించిన రోజున అది తప్పక మనిషి కి అన్నీ ఇస్తుంది అంటాడు మన సుదర్శన్ పట్నాయక్. 

Sunday 3 March 2019

ఇక మాల్గుడి స్టేషన్ కి వెళ్ళి రావచ్చు...!


మాల్గుడి అనే కల్పిత పట్టణం గురించి అందరకీ తెలిసిందే.ఆర్.కె నారాయణ్ నవల ల పుణ్యమాని ఆ పేరు చిర పరిచితం కాగా ,శంకర్ నాగ్ తీసిన మాల్గుడి డేస్ టి.వి. ఎపిసోడ్ ల తో మరింత చేరువ అయింది.అయితే ఇప్పుడు అరసలు అనే కర్నాటక రాష్ట్రం లోని రైల్వెయ్ స్టేషన్ పేరు ని మాల్గుడి రైల్వెయ్ స్టేషన్ గా మార్చబోతున్నారు.ఇందు కోసం రైల్వెయ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.శివ మొగ్గ జిల్లా పరిధి లోని ఈ స్టేషన్ కి ఈ పేరు ని సూచించిన వారు అక్కడి ఎం.పి. రాఘవేంద్ర.రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా రాగానే ఈ అరసలు ని మాల్గుడి రైల్వెయ్ స్టేషన్ గా మారుస్తారు.దీని ముస్తాబు కి గాను 1.3 కోట్లు కేటాయించినట్లు వార్త.

ఇంతకీ ఈ అరసలు కి ఇంత ప్రాముఖ్యత ఏమిటంటే శంకర్ నాగ్ చాలా మాల్గుడి ఎపిసోడ్ లని ఈ ప్రాంతం లోనే తీశాడు.ఈ స్టేషన్ చిన్నది...రోజుకి రెండు రైళ్ళు మాత్రమే వచ్చేవి.ఆ సమయం లోనే కొన్ని సన్నివేశాలు తీసేవారు.ఈ ప్రాంతం అంతా బ్రిటిష్ రోజుల్లో ని ఊరు గా కనిపిస్తుందని దీన్ని ఎంచుకొని శంకర్ నాగ్ రచయిత ఆర్.కె. నారాయణ్ కి చూపించగా ఆయన కూడా ఆనందం గా ఓకె చేశాడు.మరి అంత ప్రత్యేకత ఉన్న ఈ అరసలు ని మాల్గుడి గా మార్చడం లో తప్పు ఏముంది..?ఇక ఎవరైనా ఎంచక్కా ఎవరైనా మాల్గుడి వెళ్ళి రావచ్చు.ఇక ఇది ఎంతమాత్రమూ కల్పిత ప్రదేశం కాదు గదా ..ఏమంటారూ..?

Saturday 29 December 2018

ఆంధ్రా ప్రభుదేవా...ఒడిశా లో...!



టి.కృష్ణ మోహన్ రెడ్డి ఒడిశా లోని బరంపురం కుర్రాడు.ఇతను తన ప్రిన్స్ డాన్స్ అకాడమీ ద్వారా ఒక విప్లవమే రేపాడు.తెలుగు వారికి కొదువ ఏముంది అక్కడ.ఒకప్పుడు తెలుగు ప్రాంతమే,కాల మహిమ వల్ల ఆ పట్టణం ఒరిస్సా లో కలిసిపోయింది.ఆ ప్రాంత వాసుల్ని ప్రవాసాంధ్రులు అంటే విజయచంద్ర వంటి కవులు ఒప్పుకోరు గాక ఒప్పుకోరు.ఎప్పుడో మా తాత తండ్రులనుంచి ఇక్కడే ఉన్నాం,పెరిగాం ,ఎక్కడ నుంచీ మేము వలస రాలేదు ..కాకపోతే మా ప్రాంతాన్ని ఒరిస్సా లో కలిపివేయడం వల్ల మేము అలా పిలువబడుతున్నాం..అంతే అంటారు.నేను బరంపురం వెళ్ళి ఆ నేల లో తిరిగిన తర్వాత అది నూటికి నూరు పాళ్ళు నిజమని అనిపించింది.

సరే..ఈ కృష్ణారెడ్డి గా పిలువబడే బరంపురం కుర్రాడి గురించి భుబనేశ్వర్ నుంచి వెలువడే ఓ పత్రిక "మై సిటీ లింక్స్" ఇటీవల రాసింది చదివాక ఇది రాయాలనిపించింది.ఇతను తన జీవిత కధ ని సినిమా గా తీశాడు.అది ఇప్పుడు ఒరిస్సా లో రిలీజ్ అవడానికి తయారు గా ఉంది.ఇంతకీ ఈ యువకుని గొప్పదనం ఏమిటంటే 2009 లో ఓ హిందీ చానల్ లోని " India's Got Talent"  అనే డాన్స్ కాంపిటేషన్ లో పాల్గొని విజేత గా నిలిచి 50లక్షల నగదు,ఆడీ కార్ ని గెలుచుకున్నాడు.ఇతను ట్రూప్ లో 20 మంది ఉంటారు.ప్రిన్స్ డాన్స్ అకాడమీ అనే పేరు తో ఈయన చేసే కృషికి అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందించి 2కోట్ల నగదు సాయం ని,భూరి విరాళం ని ఇచ్చి ప్రోత్సహించాడు.

దానితో కృష్ణా రెడ్డి తన కార్యక్రమాల్ని విస్తరించి ఇతర రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ వంటి చోట్ల కూడా పోటీలో ఫాల్గొని గెలిచాడు.ఇప్పుడు తాను తన కధనే సినిమా గా తీశాడు.ఎన్ని అవాంతరాల్ని ఎదుర్కొని తను సక్సస్ గా నిలిచింది దీనిలో వివరించాడు.దీని కధ, స్క్రీన్ ప్లేయ్,డైరెక్షన్ అన్నీ ఆయనే.ఈ సినిమా పేరు "కృష్ణా ,ద డాన్సర్".రెండున్నర గంటల ఈ సినిమా ఒరిస్సా లో బాగా ఆడి తనకి పేరు ఇంకా ఇనుమడింప చేసందని ఆశిస్తున్నాడు.  

Tuesday 30 January 2018

అడవి లో బయట పడిన అపురూప శిల్పసంపద -ఉనాకోటి



త్రిపుర రాష్ట్రం యొక్క రాజధాని అగర్తల కి సుమారు 178 కి.మీ.దూరం లో దట్టమైన అడవి లో  ఉనాకోటి అనే ఒక ప్రదేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఇంతకాలం ఈ అడవి లో ఉండిపోయిన గొప్ప శిల్పసంపదని చూడాలని ప్రపంచం  తపిస్తున్నది.ఎందుకంటే వీటి ప్రత్యేకతలే వేరు అని చెప్పాలి.పెద్ద పెద్ద గుట్టల మీద రాతి ని చూడచక్కని శిల్పాలు గా మలిచారు. ఇవి భారత దేశం లోని ఇతర గుళ్ళ లోని  శిల్పశైలి లో కాకుండా స్థానిక ప్రాచీన తెగల వారసత్వ వైవిధ్యాన్ని తెలుపుతుంది.


8 లేదా 9 వశతాబ్దం లో వీటిని చెక్కి ఉండవచ్చునని భావిస్తున్నారు.శివుడు,పార్వతి,గంగ,దుర్గ,గణేశుడు ఇలా వివిధ శిల్పాలు దర్శనమిస్తున్నాయి.30 నుంచి 40 అడుగుల శిల్పాలు చూడవచ్చును.ఆరుబయట గుట్టల లో ఇంతకాలం అరణ్యం లో ఎవరూ పెద్ద గా వీటిని పట్టించుకోలేదు. నార్త్ త్రిపుర లో జంప్యు హిల్స్ లో ఉన్న ఈ ప్రదేశాన్ని  ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది పరిచే దిశలో సాగుతున్నది.



      

Thursday 7 December 2017

డాన్స్ చేస్తూ చిక్కిన ఆ పోలీస్ అధికారి


పశ్చిమ బెంగాల్ లోని హీరా పూర్ అనే పోలీస్ స్టేషన్ లో ASI గా పనిచేస్తున్న కృస్ణ సదన్ మండల్ కి తాను కోరుకున్న చిత్తరంజన్ స్టేషన్ కి బదిలీ అయింది.చివరి రోజున ఆ ఆనందాన్ని చక్కగా తనివి దీరా డాన్స్ వేస్తూ వ్యక్తపరుచుకున్నాడు.మొత్తానికి కొంతమంది ఎలాగో ఈ వ్యవహారాన్ని వీడియో తీశారు. దానితో ఇది వైరల్ అయి ఉన్నతాధికారులు ఈయన మీద విచారణకి ఆదేశించారు.ఈ వీడియో డిసెంబర్ 2 న తీసినట్లుగా ఉన్నది.సర్వీస్ రివాల్వర్,యూనిఫాం ధరించి స్టేషన్ లో డాన్స్ చేస్తుండడం తో అసాన్సోల్-దుర్గాపోర్ కమీషనర్ ఈ విషయం లో విచారణకి ఆదేశించారు.