Thursday, 7 September 2023

94 ఏళ్ళు జీవించిన ఆయన మృత్యువు ని ముందుగానే ఊహించారా


 జయంత మహాపాత్ర (94) గత నెల 27 వ తేదీన పరమపదించారు. అప్పుడు కొన్ని వాక్యాలు రాద్దామని , ఎందుకనో రాయలేకపోయాను. చాలామంది రాసేశారు. కాని నాకు తోచింది నేను రాస్తాను. భారతీయాంగ్ల సాహిత్యం లో ముఖ్యంగా కవిత్వం కి సంబంధించి ముగ్గుర్ని త్రిమూర్తులు గా భావిస్తారు. వారు ఏ.కె.రామానుజన్, ఆర్. పార్థసారథి ఇంకా ఇటీవల మరణించిన జయంత మహాపాత్ర. ఇంచుమించు రెండు తరాల కిందట నుంచి జయంత పేరు ఇంగ్లీష్ సాహిత్యం చదివేవారికి సుపరిచితం. దేశ విదేశాల్లో కూడా..!

బొంబాయ్ నుంచి ఆ రోజుల్లో నిస్సిం ఎజికెల్, అరుణ్ కొలత్కర్ లాంటి వాళ్ళు రాసే ఇంగ్లీష్ కవిత్వం పరిచిన దారిని కాదని తనదైన ,తమ దైనందిన జీవితానికి సంబంధించిన ఇతివృత్తాలతో కొత్త దారిని పరిచినవాడు జయంత. ఇంగ్లీష్ కవిత్వమే గాని ఒరియా జీవితాన్ని ఆలంబనగా చేసుకుని రాసినది. కవిత్వం మాత్రమే కాదు కథలు,వ్యాసాలు కూడా ఆయన రాశాడు. మొత్తం 27 పుస్తకాల్లో ఇరవై పుస్తకాల్ని ఇంగ్లీష్ లోనూ ఏడు పుస్తకాల్ని ఒరియా భాష లోనూ జయంత రాశాడు.

విదేశీ పత్రికలు గుర్తించి ప్రచురించిన తర్వాతనే భారతీయ ఆంగ్ల పత్రికలు ఆయన రచనల్ని ప్రచురించడం మొదలుపెట్టాయి. ద న్యూయార్కర్,న్యూ ఇంగ్లండ్,చికాగో రివ్యూ,జార్జియా రివ్యూ, ద న్యూ రిపబ్లిక్ ఇలాంటి పత్రికలు మొదట్లో ఆయన ఇంగ్లీష్ కవిత్వాన్ని బాగా ప్రోత్సహించాయి. కేంద్ర సాహిత్య అకాడెమీ వారు ప్రచురించే బై మంత్లీ ఇండియన్ లిటరేచర్ లో ఇంకా ఇతర దేశీ పత్రికల్లో బాగా ఆయన రచనలు వచ్చేవి.

ఇంగ్లీష్ సాహిత్యం లో మొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ ప్రదానం చేసినది ఈయనకే. అవార్డులు, గౌరవ డాక్టరేట్లు గురించి చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది. స్వతహాగా ఫిజిక్స్ ఆచార్యుడైనప్పటికీ ఇంగ్లీష్ కవిత్వం వల్ల ఆయనకి ప్రత్యేకత ఒనగూరింది. చాలా లేటుగా అంటే తన 60 వ ఏట నుంచి కవిత్వం రాయడం మొదలెట్టారు. కటక్ నుంచి ఈయన వెలువరించే చంద్రభాగ అనే సాహిత్య పత్రిక భారతీయ ఇంగ్లీష్ సాహిత్యసేవ విషయం లో చెప్పుకోదగిన మైలురాయి.

సచ్చిదానంద మొహంతి అనే అభిమాని (రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్) జయంత మహాపాత్ర గురించి రాస్తూ ఆయన బాల్యం రెండు ప్రపంచాల మధ్య బాధాకరం గా సాగిందని,దాని గురించి చివరి దశలో మిత్రుల వద్ద చెప్పేవారన్నారు. జయంత మహాపాత్ర యొక్క తాత గారు క్రైస్తవ మతం స్వీకరించడం తో ఇంట్లో ఆ పద్ధతులు పాటించడం ఉండేదని, అయితే బంధువులు అంతా సనాతన సంప్రదాయవాదులు కావడం తో హిందూ మతానికి దూరమయ్యానని...అటూ ఇటూ ఏ మతానికి చెందని వాడిగా నా బాల్యం గడిచిందని దానివల్ల మానసిక క్షోభ కి గురయ్యానని చెప్పేవారు.

గ్ర్రాండ్ ఫాదర్ అనే కవిత నిజంగా వాళ్ళ తాత గారిని ఉద్దేశించి రాసిందే. దానికి బాగా పేరు వచ్చింది. 1866 లో వచ్చిన భయంకరమైన కరువు నుంచి రక్షించుకోవడానికి ఆయన కన్వర్ట్ అయినట్లు దానిలోని సారాంశం. ఆ రోజుల్లో కరువు నుంచి ఆదుకునే క్యాంపు ల్లో క్రైస్తవ మతం లోకి మారినవాళ్ళకి మాత్రమే ఆహారం ఇచ్చేవారట. దాన్ని దయనీయంగా ఆ కవిత లో వర్ణించారు జయంత.

94 ఏళ్ళు జీవించిన ఆయన మృత్యువు ని ముందుగానే ఊహించారా అనిపిస్తుంది. బర్డ్స్ ఆఫ్ వాటర్ అనే మీ కవితా సంకలనాన్ని డిసెంబర్ 2023 లో ప్రచురిస్తాను అని ఓ పబ్లిషర్ చెప్పినప్పుడు , నేను అంత వరకు బతికి ఉంటాననే అనుకుంటున్నావా అని జోక్ చేశారట. అదే నిజమైంది. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిపింది.

--- మూర్తి కెవివిఎస్ 

No comments:

Post a Comment