పొన్నియన్ సెల్వన్ సినిమా సూపర్ హిట్ అంటున్నారు తమిళులు.మా చరిత్ర ని చక్కగా తెరకెక్కించాడు మణిరత్నం అని వాళ్ళ అభిప్రాయం.ఆ సినిమా చాలా గందరగోళం గా ఉంది,ఆ పాత్రల పేర్లు ఏవీ గుర్తుకి రావడం లేదు, పెద్ద లేవిష్ గా లేదు అంటున్నారు కొందరు తెలుగు వాళ్ళు.మీరు కల్కి కృష్ణమూర్తి నవల చదివితే ఆ మాట అనరు,కథ బాగా తెరకెక్కించాడు అంటున్నారు ఇంకొందరు.ఇంతకీ ఏది నిజం.అన్ని మాటల్లోనూ కొంత నిజం లేకపోలేదు.కొంత అతిశయోక్తీ లేకపోలేదు.
అసలు ఆ సినిమా టైటిల్ నే పక్కా తమిళ వాసన.అలా ఉండకూడదని ఏమీ లేదు.కాని మా చరిత్ర నే గొప్ప అనే మాట మాత్రం కూడనిది.పైగా వాళ్ళ నేటివిటీ ని మనం అందరం ఆమోదించాలి అనడం కొద్దిగా అతి కాకపోతే ఏమిటి..?చోళులు మనకి మరీ తెలియని వాళ్ళు ఏమీ కాదు.అటు కళింగం నుంచి కింద లంక దాకా జైత్ర యాత్ర చేసిన వాళ్ళే.ఇప్పటి రాష్ట్రాల సరిహద్దులు కావుగా అప్పటివి.
సినిమా లో పెద్దాయన సుందర చోళుడు (ప్రకాష్ రాజ్) అనారోగ్యం తో ఉంటాడు.ఇదే అదనుగా ఆయన సామంతులు ఆ రాజ్య ఆర్దికశాఖాధికారి పెరియ పళువెట్టరాయర్ సాయం తో రాజ్యాన్ని మధురాంత చోళునికి కట్టబెట్టాలని కుట్ర చేస్తుంటారు.సుందర చోళుని కుమారులు ఇద్దరు,ఒకరు ఆదిత్య కరికాళుడు (విక్రం) కాగా ,రెండవ వాడు అరుళ్ మొళి వర్మ (జయం రవి) ,అరుళ్ మొళి వర్మ నే ఆ తర్వాత ఒకటవ రాజరాజచోళునిగా ప్రసిద్ధి చెందాడు.
బృహదీశ్వర ఆలయాన్ని కట్టించి చిరస్మరణీయుడయ్యాడు. కుందవై పాత్ర చాలా సూక్ష్మరీతి లో సామంతుల మధ్య సోదరుని పెళ్ళి ని ప్రస్తావించి వాళ్ళలో విభేదాలు కల్పించడం లాంటివి మన తెలుగు వాళ్ళకి ఆనవు.పెద్ద పెద్ద డైలాగులు చెబుతూ సవాళ్ళు విసురుకుంటూ లౌడ్ గా చెప్తే తప్పా మన జనాలకి మజా అనిపించదు.కాని తమిళులు అలాంటి వాటిని కూడా బాగా ఆదరిస్తారు.అదే తేడా.పైగా వాళ్ళకి ఉండే ఎమోషనల్ బాండ్ చోళులతో మిగతా వాళ్ళకి ఉండదు అది కూడా ఓ కారణం.
చిత్ర0 లో ఆదిత్య కరికాళుడు,లంక లో అరుళ్ మొళి జైత్ర యాత్ర లపై ఉంటారు.ఇదంతా తంజావూర్ లో జరుగుతూంటుంది.నందిని పాత్ర చరిత్ర లో లేని పాత్ర అని కల్కి సృష్టించిందని అంటారు.కుటుంబం లోనూ,రాజ్యం లోని సామాంతుల మధ్యలోనూ అధికారం కోసం పెనుగులాట ఇంకా కుట్ర ల్లాంటివి సహజం.వాటినే ఈ సినిమా లో చూపించదలుచుకున్నారు.పైగా తమిళ చరిత్ర అనే ఎమోషనల్ టచ్ ఎలాగూ ఉంది.
బాహుబలి తో ఈ సినిమా ని పోల్చడం మతిలేనిపని.స్వకపోలజనితమైన కథని ఎటునుంచి ఎటైనా మలచవచ్చు.ఏదైనా చెప్పవచ్చు.కాని చరిత్ర ని సినిమా గా తీసేటప్పుడు ఇష్టం వచ్చిన మలుపులు తీసుకుంటా అంటే కుదరదు.అందుకే ఉన్నంతలో మణిరత్నం ఎక్కడ వీలుంటే అక్కడ అవసరం ఉన్నంతవరకు మాత్రమే లేవిష్నెస్ చూపించాడు తప్పా మరోలా వెళ్ళలేదు.అసలు పిచ్చి గాని కథ కి ఉపయోగపడని పటాటోపం ఎందుకు, షో పుటప్ తప్పా.
రెహమాన్ సంగీతం ఫర్వాలేదు.బహుశా తమిళ్ లో పాటలు బాగా వచ్చాఏమో గాని తెలుగు లో గుర్తున్న పాట గా ఏదీ మిగలదు. డైలాగ్స్ లో కొన్నిచోట్ల మెరుపులు ఉన్నాయి.సెట్స్ తో పాటుగా సహజ వాతావరణాన్ని కూడా చక్కగా వాడుకున్నారు.ఓడల్లో సన్నివేశాలు,పోరాటాలు బాగున్నాయి.నటీనటులందరూ ఎవరి పాత్రని వారు బాగా పోషించారు.
----- News Post Desk
No comments:
Post a Comment