Tuesday, 27 September 2022

Seven Samurai ఎందుకని ఓ సినిమా కళాఖండమైంది..?


Seven Samurai సినిమా ని ఎప్పటినుంచో చూద్దామని ఉన్నా ఇన్నాళ్ళకి నెరవేరింది.1954 లో రిలీజ్ అయిన ఆ సినిమా ప్రపంచం లోని అతి గొప్ప సినిమాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అకిరా కురసోవ దర్శకత్వం మాత్రమే గాక,ఎడిటింగ్ ఇంకా సహాయ రచన కూడా చేశారు.రమారమి ఓ డబ్భై ఏళ్ళ క్రితం తీసిన సినిమా ఈరోజు కి కూడా ఎలాంటి బోర్ కొట్టలేదు.అంత గా లీనమై పోయాను. జపాన్ వాళ్ళ గ్రామీణ పరిస్థితులు,వాళ్ళ నమ్మకాలు,అక్కడి అందమైన దృశాలు మనల్ని మైమరిపిస్తాయి.అంతేకాదు,ఎన్నో విజయవంతమైన సినిమాల్ని మన భారతీయ దర్శకులు ఈ సినిమా ఇచ్చిన ప్రేరణ వల్లనే తీసి ఉంటారు అనిపిస్తుంది.ముఖ్యంగా షోలే సినిమా. కొన్ని పాత్రలు ప్రవర్తించే తీరు,గ్రామీణ నేపథ్యాన్ని హృద్యం గా చూపించిన తీరు ఇంకో లోకానికి తీసుకుపోతుంది.

సినిమా కథ 16 వ శతాబ్దం లో ఓ గ్రామం లో జరుగుతూంటుంది.40 మంది బందిపోట్లు ఈ గ్రామం మీద దాడి చేసి పండిన బార్లీ పంటని దోచుకోవాలని ప్రణాళిక వేస్తుంది.కాపాడుకోవాలంటే సమురాయ్ అనబడే యుద్ధవీరుల్ని కాపలా పెట్టుకోకతప్పదు.కాని వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈ పేద రైతులకి ఉండదు. ఎలా..అప్పుడు గిసాకు అనే పెద్దాయన ఆకలితో ఉన్న సమురాయ్ ల్ని వెతికి పట్టుకుందాం.వాళ్ళని ఉపయోగించుకుందాం ,ఎంతో కొంత వాళ్ళకి అన్నం పెట్టి మనం బార్లీ తో కాలం గడుపుదాం అంటాడు.మొత్తానికి రోనిన్ సమురాయ్ ని ఒప్పిస్తారు.అతను తన పాత మిత్రుల్ని కలుపుకొని గ్రామానికి వస్తాడు.వచ్చిన వెంటనే ఊరు మొత్తాన్ని పరిశీలించి ఎవరెవరు ఎక్కడ ఉండాలి,ఏ వైపు నుంచి తిప్పి కొట్టాలి అనేది ప్లాన్ గీస్తాడు.    

యుద్ధం అనేది సామూహికం గా జరిగేది,ఒక్కొకరికి కొంతమంది యువకుల్ని ఇంకా పోరాడగలిగే వ్యక్తుల్ని అప్పజెబుతాడు.వాళ్ళకి యుద్ధ విద్యల్లో తర్ఫీదు ఇస్తారు ఈ సమురాయ్ లు.మొదట జనాలు వీళ్ళని నమ్మకపోయినా ఆ తర్వాత ఈ సమురాయ్ ల చిత్తశుద్ధి కి అభిమానులయి వాళ్ళ మాట వింటారు.కందకాలు తవ్వడం,వాళ్ళకి అనుకూలంగా ఉండేలా ఊరిని తీర్చిదిద్దడం చాలా గొప్పగా ఉంటుంది.వ్యాహాలన్నీ నేల విడిచి సాము చేయవు.సహజం గా ఉంటాయి.ముఖ్యంగా లైటింగ్ ని,గాలిని,అగ్ని ని ఉపయోగించుకున్న తీరు అద్భుతం.రాత్రి పూట నెగళ్ళు వేసుకుని ఎదురుచూడటం,కొంతమంది సమురాయ్ లు చనిపోయినపుడు,గాలి మంద్రం గా దుమ్ము రేపుతూ అటు నించి ఇటు తిరగడం ఇలాంటి సింబాలిజం లు ఎంతో ఈస్థటిక్ సెన్స్ ఉన్న దర్శకులే చేయగలరు.యుద్ధ సన్నివేశాలు కూడా ఎక్కడా బోరు కొట్టవు.ఒక్కమాట చెప్పాలంటే ఆ గ్రామం లోకి మనమే వెళ్ళిపోయిన అనుభూతి కలుగుతుంది.

ఇంత యుద్ధ భీభత్సం నిండిన సినిమా లోనూ అంతర్లీనంగా అదీ ఎంతో కంపాక్ట్ గా ఓ ప్రేమ కథ నడుస్తుంది. యువ సమురాయ్ ని ప్రేమించిన ఆ షినో కి చివరకి నిరాశే మిగులుతుంది.రాత్రి పూట పడుకున్నప్పుడు గుడిసె పక్కన పారే కాలవ శబ్దం మనల్ని ఎక్కడికో తీసుకువెళుతుంది.డైలాగ్స్ కూడా చాలా అర్ధవంతం గా ఉండి,శృతి మించి లేవు. జపాన్ వాళ్ళ గ్రామీణ విశ్వాసాలు ఇంచుమించు మనలాగే ఉన్నాయి.షోలే సినిమా చూసినపుడు ఇంత నేటివిటి నిండిన గ్రామాన్ని ఎలా సృష్టించారబ్బా అనుకునేవాడిని.దానికి ఇన్స్పిరేషన్ ఈ సినిమా లోని గ్రామమే..!సంగీతం బాగుంది.క్యోజో కత్తి విద్య సమురాయ్ ల గౌరవాన్ని పెంచేదిలా ఉంది.కికుచియొ పాత్ర తిక్క తిక్క గా ప్రవర్తిస్తూనే తన దళం తో కలిసి పోరాడుతాడు.ప్రతి పాత్ర ఒక సైకలాజికల్ డెప్త్ ని కలిగిఉంటుంది.అది బాగా పరిశీలిస్తే అవగతమవుతుంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా చూడవలసిన సినిమా. 

--- News Post desk

No comments:

Post a Comment