Thursday, 7 September 2023

94 ఏళ్ళు జీవించిన ఆయన మృత్యువు ని ముందుగానే ఊహించారా


 జయంత మహాపాత్ర (94) గత నెల 27 వ తేదీన పరమపదించారు. అప్పుడు కొన్ని వాక్యాలు రాద్దామని , ఎందుకనో రాయలేకపోయాను. చాలామంది రాసేశారు. కాని నాకు తోచింది నేను రాస్తాను. భారతీయాంగ్ల సాహిత్యం లో ముఖ్యంగా కవిత్వం కి సంబంధించి ముగ్గుర్ని త్రిమూర్తులు గా భావిస్తారు. వారు ఏ.కె.రామానుజన్, ఆర్. పార్థసారథి ఇంకా ఇటీవల మరణించిన జయంత మహాపాత్ర. ఇంచుమించు రెండు తరాల కిందట నుంచి జయంత పేరు ఇంగ్లీష్ సాహిత్యం చదివేవారికి సుపరిచితం. దేశ విదేశాల్లో కూడా..!

బొంబాయ్ నుంచి ఆ రోజుల్లో నిస్సిం ఎజికెల్, అరుణ్ కొలత్కర్ లాంటి వాళ్ళు రాసే ఇంగ్లీష్ కవిత్వం పరిచిన దారిని కాదని తనదైన ,తమ దైనందిన జీవితానికి సంబంధించిన ఇతివృత్తాలతో కొత్త దారిని పరిచినవాడు జయంత. ఇంగ్లీష్ కవిత్వమే గాని ఒరియా జీవితాన్ని ఆలంబనగా చేసుకుని రాసినది. కవిత్వం మాత్రమే కాదు కథలు,వ్యాసాలు కూడా ఆయన రాశాడు. మొత్తం 27 పుస్తకాల్లో ఇరవై పుస్తకాల్ని ఇంగ్లీష్ లోనూ ఏడు పుస్తకాల్ని ఒరియా భాష లోనూ జయంత రాశాడు.

విదేశీ పత్రికలు గుర్తించి ప్రచురించిన తర్వాతనే భారతీయ ఆంగ్ల పత్రికలు ఆయన రచనల్ని ప్రచురించడం మొదలుపెట్టాయి. ద న్యూయార్కర్,న్యూ ఇంగ్లండ్,చికాగో రివ్యూ,జార్జియా రివ్యూ, ద న్యూ రిపబ్లిక్ ఇలాంటి పత్రికలు మొదట్లో ఆయన ఇంగ్లీష్ కవిత్వాన్ని బాగా ప్రోత్సహించాయి. కేంద్ర సాహిత్య అకాడెమీ వారు ప్రచురించే బై మంత్లీ ఇండియన్ లిటరేచర్ లో ఇంకా ఇతర దేశీ పత్రికల్లో బాగా ఆయన రచనలు వచ్చేవి.

ఇంగ్లీష్ సాహిత్యం లో మొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ ప్రదానం చేసినది ఈయనకే. అవార్డులు, గౌరవ డాక్టరేట్లు గురించి చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది. స్వతహాగా ఫిజిక్స్ ఆచార్యుడైనప్పటికీ ఇంగ్లీష్ కవిత్వం వల్ల ఆయనకి ప్రత్యేకత ఒనగూరింది. చాలా లేటుగా అంటే తన 60 వ ఏట నుంచి కవిత్వం రాయడం మొదలెట్టారు. కటక్ నుంచి ఈయన వెలువరించే చంద్రభాగ అనే సాహిత్య పత్రిక భారతీయ ఇంగ్లీష్ సాహిత్యసేవ విషయం లో చెప్పుకోదగిన మైలురాయి.

సచ్చిదానంద మొహంతి అనే అభిమాని (రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్) జయంత మహాపాత్ర గురించి రాస్తూ ఆయన బాల్యం రెండు ప్రపంచాల మధ్య బాధాకరం గా సాగిందని,దాని గురించి చివరి దశలో మిత్రుల వద్ద చెప్పేవారన్నారు. జయంత మహాపాత్ర యొక్క తాత గారు క్రైస్తవ మతం స్వీకరించడం తో ఇంట్లో ఆ పద్ధతులు పాటించడం ఉండేదని, అయితే బంధువులు అంతా సనాతన సంప్రదాయవాదులు కావడం తో హిందూ మతానికి దూరమయ్యానని...అటూ ఇటూ ఏ మతానికి చెందని వాడిగా నా బాల్యం గడిచిందని దానివల్ల మానసిక క్షోభ కి గురయ్యానని చెప్పేవారు.

గ్ర్రాండ్ ఫాదర్ అనే కవిత నిజంగా వాళ్ళ తాత గారిని ఉద్దేశించి రాసిందే. దానికి బాగా పేరు వచ్చింది. 1866 లో వచ్చిన భయంకరమైన కరువు నుంచి రక్షించుకోవడానికి ఆయన కన్వర్ట్ అయినట్లు దానిలోని సారాంశం. ఆ రోజుల్లో కరువు నుంచి ఆదుకునే క్యాంపు ల్లో క్రైస్తవ మతం లోకి మారినవాళ్ళకి మాత్రమే ఆహారం ఇచ్చేవారట. దాన్ని దయనీయంగా ఆ కవిత లో వర్ణించారు జయంత.

94 ఏళ్ళు జీవించిన ఆయన మృత్యువు ని ముందుగానే ఊహించారా అనిపిస్తుంది. బర్డ్స్ ఆఫ్ వాటర్ అనే మీ కవితా సంకలనాన్ని డిసెంబర్ 2023 లో ప్రచురిస్తాను అని ఓ పబ్లిషర్ చెప్పినప్పుడు , నేను అంత వరకు బతికి ఉంటాననే అనుకుంటున్నావా అని జోక్ చేశారట. అదే నిజమైంది. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిపింది.

--- మూర్తి కెవివిఎస్ 

Saturday, 12 August 2023

" కోరాపుట్ అండ్ అదర్ షార్ట్ స్టోరీస్" ఓ విశిష్టమైన కథా సంపుటి.

 "కోరాపుట్ అండ్ అదర్ షార్ట్ స్టోరీస్" అనే ఈ కథాసంపుటి 15 విశిష్టమైన కథల తో నిండి ఉన్న పుస్తకం. గౌరహరి దాస్ గారు వీటిని ఒరియా భాషలో రాయగా సరోజ్ మిశ్రా,గోపా నాయక్ లు ఇంగ్లీష్ లోకి అనువదించారు. గౌరహరి దాస్ గారు ఒరియా భాష లో పేరు ప్రఖ్యాతులున్న పత్రికా సంపాదకులు మరియు రచయిత కూడా. అంతేకాదు మంచి నాటకరచయిత గా తనదైన ముద్ర వేశారు ఒరియా సాహితీ లోకంలో..! అటువంటి రచయిత యొక్క కథల్ని ఇంగ్లీష్ లోకి అనువదించడం వల్ల మనం అందరం చదివే అవకాశం కలిగింది. గతం లో కూడా ద లిటిల్ మాంక్ అండ్ అదర్ స్టోరీస్ పేరుతో ఓ కథాసంపుటి వెలువడింది. అది గౌరహరి దాస్ కథలు అనే పేరు తో తెలుగు లోకి కూడా అనువాదమై మంచి ఆదరణ పొందింది.  

ఈ పుస్తకం లోని ఆంగ్ల భాష చాలా సులువుగా ఉండటం వల్ల చదువరులు పెద్దగా కష్టపడనవసరం లేదు. మూల రచయిత భావం స్పష్టం గా అర్థమై ముందుకు వెళతాడు చదువరి. ఈ పుస్తకం లోని మొదటి కథ కోరాపుట్ నేపథ్యం లో సాగుతుంది. ఒరిస్సా లోని కోరాపుట్ ని ఒక్కసారైనా సందర్శించాలని కోరిక పుడుతుంది ఇది చదివినతర్వాత..! నిజానికి ఈ కథ తీవ్రవాద నేపథ్యం ని నింపుకుని అక్కడి స్థితిగతుల్ని, సాంఘిక వ్యవస్థ ని మనముందు నిలుపుతుంది. కోరాపుట్ ఒడిలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.

Once the sky was blue ఏఅ కథ ఈనాటి మాల్ సంస్కృతిని కళ్ళకి కడుతుంది. ఏ విధంగా చిన్న చిన్న వ్యాపారులు బడా మాల్స్ వల్ల నలిగిపోతారు అనేది చూపిస్తుంది. తలవంచడానికి ఇష్టపడని చిన్న వ్యాపారుల్ని ఎలా తమ ఆర్ధిక,అంగ బలాలతో చిదిమివేస్తారో ఈ కథ లో చదవవచ్చు. Mirage అనే కథ లో పన్నా జెనా అనే ఆకురౌడి జీవితాన్ని రమ్యం గా చిత్రించారు. ఏ బలాలకి లొంగని పొగరుబోతు ని ఏ విధంగా స్త్రీ ని ఉపయోగించి మట్టి గరిపించారో ఈ కథలో చదవవచ్చు. 

ఇక మీడియా రంగం లో వస్తోన్న మార్పులు గురించి ఓ కథ లో వివరించారు. విదేశీ పెట్టుబడులు పత్రికారంగం లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో చాలా విపులంగా తెలుసుకోవచ్చు.ఇలాంటి ఇతివృత్తాలతో కథ రాయడానికి చాలా ధైర్యం కావాలి.అంతేగాక బంగ్లాదేశ్ నుంచి బతకడానికి వచ్చిన కుటుంబం గురించి ఓ కథ లో చదవవచ్చు.విన్నూత్న అంశాలు ఈ సంపుటి లో గోచరిస్తాయి. కావలసినవారు అమెజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. 

Thursday, 20 July 2023

సింగపూర్ పాస్ పోర్ట్ ర్యాంకింగ్ ప్రపంచం లోనే నంబర్ వన్..! మరి మన దేశం ర్యాంక్ ఎంతో తెలుసా..?


 సింగపూర్ పాస్ పోర్ట్ కి ప్రపంచ స్థాయి ర్యాంకింగ్ లో మొదటి స్థానం వచ్చింది. గతం లో ఈ స్థానం లో ఉన్న జపాన్ ని పక్కకి తోసి సింగపూర్ మొదటి స్థానం లోకి వచ్చింది. సింగపూర్ పాస్ పోర్ట్ కలిగి ఉన్నవాళ్ళు ఇకమీదట ఎలాంటి వీసా లేకుండా 192 దేశాల్ని సందర్శించవచ్చు.2021 లో కూడా సింగపూర్ టాప్ స్థానం లోకి వచ్చింది.అయితే తర్వాత జపాన్ ఆ స్థానాన్ని ఆక్రమించింది.

ఇకపోతే జర్మనీ,ఇటలీ,స్పెయిన్ దేశాలు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.ఈ దేశాల పాస్పోర్ట్ లు ఉన్నవారు వీసా లేకుండా 190 దేశాల్ని సందర్శించవచ్చు. 189 దేశాల డెస్టినేషన్స్ తో ఫ్రాన్స్,ఆస్ట్రియా,ఫిన్ లాండ్,స్వీడన్,లక్జం బర్గ్,దక్షిణ కొరియా దేశాలు మూడో స్థానం లో నిలిచాయి.కాగా అమెరికా మాత్రం 8 వ స్థానం లో నిలిచింది. వీసా రెసిప్రోసిటి తక్కువ ఉండటం వల్ల అమెరికా ర్యాంక్ దిగజారుతూ వస్తోంది.

1 నుంచి 10 ర్యాంక్ ల మధ్యలో ఉన్న 34 దేశాలు గత పదేళ్ళలో తక్కువ పెరుగుదల ని నమోదు చేశాయి.మన భారత్ ర్యాంక్ 80 వ స్థానం లో ఉంది.2022 తో పోల్చితే అయిదు స్థానాలు పైకి వెళ్ళింది. మన దేశం పాస్ పోర్ట్ ఉన్నవాళ్ళు 57 దేశాల్ని వీసా లేకుండా చుట్టి రావచ్చు. ప్రస్తుతం మన దేశం ర్యాంక్ టోగో,సెనెగల్ దేశాలతో సమానం గా ఉంది.

ఇక ఆఫ్ఘనిస్తాన్ ర్యాంక్ అన్నిటికన్నా తక్కువ గా ఉంది.వారి పాస్ పోర్ట్ తో యెమెన్,పాకిస్తాన్,సిరియా, ఇరాక్ లాంటి 27 దేశాల్ని వీసా లేకుండా వెళ్ళవచ్చు. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే లండన్ కి చెందిన సంస్థ ఈ ర్యాంక్ ల్ని ప్రకటించింది. కాగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ వారి డేటా ని పరిగణన లోనికి తీసుకోవడం జరిగింది.   

--- NewsPost Desk

Tuesday, 4 July 2023

గంజాయి కి, భంగు కి, చరస్ కి మద్య గల తేడా ఏమిటి

 

నిజానికి గంజాయి,భంగు,చరస్ ఈ మూడు ఒకే మొక్క నుంచి వస్తాయి. తయారు చేసిన విధానాన్ని బట్టి పేర్లు మారతాయి. భంగు ని ఉత్తర భారత దేశం లో హోలీ లాంటి పండగలప్పుడు సేవించడం ఏ నాటినుంచో వస్తున్నదే.గంజాయి మొక్కల ఆకుల్ని నలిపి ఆహారం లోనో,తాగే పానీయం లోనో కలుపుతారు.ఆ మొక్క కి పూసే పూవులు కూడా మంచి నిషాని కలిగిస్తాయి.వాటిని కూడా నలిపి మిశ్రమం గా చేసి వాడతారు.మన దేశం లో భంగు ని కొన్ని పూజల్లో వాడే సంప్రదాయం ఉన్నందున ఉత్తర భారతం లోని కొన్ని రాష్ట్రాల్లో కొంత మేరకు అనుమతి ఉంది.

భంగు బ్రెయిన్ మీద,నెర్వస్ సిస్టం మీద ప్రభావాన్ని చూపుతుంది. సైకోయాక్టివ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది.ఎక్కువ సేవిస్తే మతిమరుపు,బలహీనత కలిగిస్తుంది. ఇక గంజాయి మొక్కల ఆకుల్ని,పూలని మరీ ముదరని దశ లో కోసి మిశ్రమం చేస్తారు. దీన్ని సిగెరెట్ లలో చుట్టుకొని పీలుస్తుంటారు.చిలుం పీల్చడానికి కూడా ఉపయోగిస్తారు. టీ లో కూడా కలిపి తాగుతుంటారు. ఇదొక పద్ధతి. గంజాయి దమ్ము అన్నమాట.

గంజాయి మొక్క ఇంకా దాని ఆకుల్లోని రసాన్ని తీసి తయారుచేసేది చరస్ లేదా హషిష్. చాలా ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండేలా చూస్తారు. హషిష్ ని రోల్స్ గా చుట్టి పొగ తాగడం ఉన్నది. కొద్దిగా జిడ్డుగా ఉంటుంది.అలా గంజాయి మొక్కలో ఏదీ వేస్ట్ కాదు.ఆకులు,పూవులు,మొక్క రసం అన్నీ రకరకాలుగా ఉపయోగిస్తారు.     

Wednesday, 14 June 2023

"కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు..." అనే జీవిత చక్రం లోని పాట ఎవరు మరిచిపోగలరు..?


 మధుర గాయని,విలక్షణమైన స్వరం తో ఎంతో మంది సంగీతాభిమానులను ఆకట్టుకున్న పాతతరం గాయని శారద నిన్న తన 86 వ యేట మృతి చెందారు. ముఖ్యంగా తెలుగు వారికి జీవిత చక్రం సినిమా లో పాడిన మధుర గాయని గా గుర్తు. "కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు...,మధురాతి మధురం మన ప్రేమ మధువు " లాంటి పాటలు ఎన్ని ఏళ్ళు మారినా మరిచిపోలేని పాటలు.శారద గొంతు లో ఒక గమ్మత్తు ఉండేది. ఓ చిన్నపిల్ల,అల్లరిపిల్ల పాడుతున్నట్లుగా ఉండేది.

తమిళనాడు లో జన్మించిన ఈమె పూర్తి పేరు శారదా రాజన్ అయ్యంగార్. హిందీ చిత్రసీమ లో తనదైన ముద్ర వేశారామె. Titli Udi అనే పాటతో (సూరజ్ చిత్రం,1966) ఆమె పేరు మారుమోగింది.రాజ్ కపూర్ ఈమె ని సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ కి పరిచయం చేశారు. హేమామాలిని,షర్మిలా ఠాగూర్,సైరాబాను,రాజశ్రీ లాంటి హీరోయిన్ల కి పాడారు. ఫిల్ ఫేర్ అవార్డ్ పొందారు.

హిందీ మాత్రమే కాకుండా తెలుగు,తమిళ్,గుజరాతీ వంటి భాషల్లో సైతం పాడారు.ఆమె చివరిసారిగా సినిమాల్లో కాంచ్ కి దీవార్ కి పని చేశారు.గాలీబ్ గీతాల్ని ఆల్బం గా పాడారు.హిందీ సినీ పరిశ్రమ లో గల రాజకీయాల వల్ల శారద ఎక్కువ కాలం అక్కడ నిలబడలేకపోయారని అంటారు.ఏది ఏమైనా ఒక విలక్షణ గాయని గా సగీత అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిందామె.   

Friday, 2 June 2023

ఈ మొక్కలంటే పాములకి ఇష్టం

మంచి సువాసన వెదజల్లే  నైట్ జాస్మిన్ మొక్కలన్నా, అలాగే గంధపు చెట్లు అన్నా పాములకి ఇష్టం అని పరిశోధకులు సెలవిస్తున్నారు. మన గ్రామాల్లో మొగలి పొదల వద్ద త్రాచుపాములు ఉంటాయని పెద్దలు అనేదాంట్లో కూడా కొంత నిజం ఉంది. ఎందుకంటే హాయిగా చక్కని సువాసన ని ఆస్వాదించే తత్వం కదా..!

మేరీ గోల్డ్, ఉల్లి,వెల్లుల్లి మొక్కల వాసన అంటే మాత్రం పాములకి పడదుట. అంతేకాదు లవంగాలు,దాల్చిన చెక్క రసాల్ని తీసి మిక్స్ చేసి పాములు చేరగూడదు అనుకున్న చోట స్ప్రే చేస్తే ఆ దాపుల్లోకి రావు. అలాగే తెల్ల వెనిగర్ ని చల్లినా దాని వాసన కూడా పడదు.

పాము కరిచిన వెంటనే ప్రాథమిక చికిత్స చేసి సాధ్యమైనంత త్వరగా డాక్టర్ వద్ద కి తీసుకు వెళ్ళాలి. స్నేక్ వెనం ఏంటి సిరం ఇంజెక్షన్ ని వాళ్ళు చేస్తారు. సొంతగా ఆ ఇంజెక్షన్ చేయవద్దు. పాము కరిచిన వెంటనే ఒంటి మీద టైట్ గా ఉండే రింగ్ ని గాని,బ్రాసిలెట్ వంటివాటిని తొలగించాలి.      

  

Saturday, 13 May 2023

జపాన్, చైనా లాంటి సమాజాల్లో ఆర్దిక పరిస్థితి తో సంబంధం లేకుండా ఎందుకు నేల మీద పడుకుంటారు..?

 జపాన్ ప్రజలు నేటికి మంచం మీద కంటే నేల మీద పడుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. ఆ పద్ధతి కొన్ని తరాలుగా ఆ దేశం లో అమలు లో ఉంది. కింద పడుకోవడం వల్ల వెన్నుబాము కి ఇంకా ఇతర శరీర అవయవాలకి పూర్తి విశ్రాంతి లభించి రక్తప్రసరణ బాగుంటుందని వారి సాంప్రదాయిక వైద్యం చెబుతోంది. కింద తతామి అనే చాప పరుచుకుని,షిక్ఫుటన్ అనబడే మెత్తటి పరుపు వేసుకుంటారు. రాత్రి వేళ పడుకునేటప్పుడు యుకట , జింబే అనబడే పైజామ లు ధరిస్తారు.అవి కాటన్ సిల్క్ తో లూజు గా కుట్టించుకుంటారు.

భారత దేశం లో మాదిరి గానే బిడ్డ పుట్టినతర్వాత తల్లి ఆ బిడ్డ తో ఓ రూం లో పడుకుంటే ,తండ్రి మరో రూం లో పడుకుంటాడు. ఇదే పద్ధతి చైనా లో కూడా అనేక తరాలుగా ఉన్నది.పదేళ్ళు వచ్చేవరకు చిన్నపిల్లలు ఎవరో కుటుంబ సభ్యుల దగ్గర పడుకుంటారు.చైనా వాళ్ళు కూడా నేల మీద పడుకోవడానికే ప్రాధాన్యతనిస్తారు.ఒక చాప,దానిమీద మెత్తటి పరుపు,దిండు ఉంటుంది.కింద పడుకుంటే శరీరానికి ఆరోగ్యమని భావిస్తారు. ఫిలిప్పైన్స్,కొరియా ,వియాత్నం సమాజాలు కూడా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తారు.భోజనం చేయడానికి కూడా కింద చాప వేసుకుని చిన్న చెక్క బల్ల ని ముందు పెట్టుకుని చేస్తారు.   

  ఈ తూర్పు దేశాల మాదిరి గానే మన దేశం లోనూ ఈ అలవాట్లు ఉండేవి. అయితే క్రమేపి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పూర్తి గా మారిపోతున్నాయి. తమిళనాడు లో మటుకు ఇప్పటికీ కూడా ఎంత ధనవంతులైనా చాప, దాని మీద పరుపు వేసుకుని పడుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేల మీద పడుకోవడం అనేది పేదరికానికి గుర్తు అని మన దేశం లో భావిస్తుంటారు. అయితే ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ చాలా తూర్పు ప్రాంత దేశాలు నేల మీద పడకే శ్రేష్టమని భావిస్తున్నారు. 

  ----- NewsPost Desk