Showing posts with label అంతర్జాతీయ వార్తలు. Show all posts
Showing posts with label అంతర్జాతీయ వార్తలు. Show all posts

Tuesday 16 January 2024

ఆల్ జాజిర అంటే ద్వీప కల్పం అని అర్థం.

 ఖతర్ దేశం ఈ మధ్య బాగా వార్తల్లో వినబడుతోంది. ఇంచుమించు 29 లక్షల జనాభా ఉన్న ఈ దేశం ప్రపంచం లోని ధనిక దేశాల్లో ఒకటి.

ఎంతో ఖ్యాతి చెందిన ఆల్ జాజిర మీడియా నెట్ వర్క్ ఈ దేశం లోని దోహా నుంచి పనిచేస్తుంది. ఆల్ జాజిర అంటే ద్వీప కల్పం అని అర్థం.

నిజానికి ఈ అంతర్జాతీయ న్యూస్ నెట్వర్క్ ఖతర్ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ప్రపంచం లో 350 మిలియన్ కుటుంబాలకి ఇంకా 150 దేశాలకి ఈ వార్తాకదంబం అందుబాటు లో ఉంది.

వెబ్సైట్, యూ ట్యూబ్,టెలివిజన్, రేడియో ఇలాంటివి అన్నీ ఆల్ జాజిర నెట్ వర్క్ లో ఉన్నాయి. కేంద్ర స్థానం దోహా నగరం.

పర్ష్యన్ గల్ఫ్ లో ఉన్న ఈ బుల్లి దేశం లో చమురు,గ్యాస్ నిలవలు ఎక్కువ గా ఉండడం తో అత్యంత ధనిక దేశాల్లో ఒకటి గా మారింది.

1992 లో  మాస పత్రిక గా అరబిక్ భాష లో మొదలయి ఇంగ్లీష్ లో తన ప్రసారాల్ని 2006 లో మొదలుపెట్టింది.

ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యం లో భాగం గా ఉన్న ఖతర్, 1971 వరకు బ్రిటిష్ సమ్రక్షణ లో ఉన్నది. 90శాతం వరకు సున్నీ ముస్లింస్ ఉన్న ఈ దేశం లో 3,35,967 మంది హిందువులు కూడా ఉన్నారు.

--- NewsPost Desk

   

Tuesday 31 October 2023

ఈ భూమి మొత్తం మీద ఎన్ని రకాల మొక్కలున్నాయో తెలుసా..?

 


ప్రపంచం లో ఇప్పటిదాకా మూడు లక్షల ఎనభై వేల రకాలైన మొక్కల్ని వృక్ష శాస్త్రజ్ఞులు గుర్తించారు.దీంట్లో రెండు లక్షల అరవై వేల మొక్కలు విత్తనాలు ఇస్తాయి. ఏక కణ మొక్కల నుంచి మహా వృక్షాల దాకా ఈ భూమి ఉన్నాయి. మన దేశం లో చెప్పాలంటే 45,000 రకాల మొక్కల్ని గుర్తించారు. రమారమి లక్ష రకాల మొక్కల్ని గుర్తించి వాటి గురించి ఇంకా రాయవలసి ఉంది.

ఎక్కువ గా పూవులు పూచే మొక్కలే ఉన్నాయి. ప్రపంచం లో నాలుగు లక్షల రకాలైన పుష్పించే మొక్కలున్నాయి.వీటి రంగు,సైజు అనేక రకాలుగా ఉంటాయి. బ్రెజిల్ దేశం లో ఈ వృక్ష వైవిధ్యం, జీవ వైవిధ్యం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. వివిధ రకాల మొక్కలు, క్షీరదాలు ,చేపలు 50,000 పై చిలుకు ఉన్నాయి. ఇక మన దేశం కి వస్తే మర్రి చెట్టు ఇంచు మించు అన్ని ప్రదేశాల్లోనూ కనిపిస్తుంది. అందుకే దీన్ని జాతీయ వృక్షం గా ప్రకటించారు.

అడవి విషయానికి వస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానం లో ఉండగా,అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఒరిస్సా ఆ స్థానాల్లో వరుసగా ఉన్నాయి. గుజరాత్ లోని గాంధీ నగర్ లో 32 లక్షల వృక్షాలు ఉన్నాయి.ఇది ఒక రికార్డు. మొత్తం ఇండియా లో 35 బిలియన్ చెట్లు ఉండగా ,భూమి మొత్తం మీద 3 ట్రిలియన్ల చెట్లు ఉన్నట్లు భోగట్టా..!  

--- NewsPost Desk

Saturday 13 May 2023

జపాన్, చైనా లాంటి సమాజాల్లో ఆర్దిక పరిస్థితి తో సంబంధం లేకుండా ఎందుకు నేల మీద పడుకుంటారు..?

 జపాన్ ప్రజలు నేటికి మంచం మీద కంటే నేల మీద పడుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. ఆ పద్ధతి కొన్ని తరాలుగా ఆ దేశం లో అమలు లో ఉంది. కింద పడుకోవడం వల్ల వెన్నుబాము కి ఇంకా ఇతర శరీర అవయవాలకి పూర్తి విశ్రాంతి లభించి రక్తప్రసరణ బాగుంటుందని వారి సాంప్రదాయిక వైద్యం చెబుతోంది. కింద తతామి అనే చాప పరుచుకుని,షిక్ఫుటన్ అనబడే మెత్తటి పరుపు వేసుకుంటారు. రాత్రి వేళ పడుకునేటప్పుడు యుకట , జింబే అనబడే పైజామ లు ధరిస్తారు.అవి కాటన్ సిల్క్ తో లూజు గా కుట్టించుకుంటారు.

భారత దేశం లో మాదిరి గానే బిడ్డ పుట్టినతర్వాత తల్లి ఆ బిడ్డ తో ఓ రూం లో పడుకుంటే ,తండ్రి మరో రూం లో పడుకుంటాడు. ఇదే పద్ధతి చైనా లో కూడా అనేక తరాలుగా ఉన్నది.పదేళ్ళు వచ్చేవరకు చిన్నపిల్లలు ఎవరో కుటుంబ సభ్యుల దగ్గర పడుకుంటారు.



చైనా వాళ్ళు కూడా నేల మీద పడుకోవడానికే ప్రాధాన్యతనిస్తారు.ఒక చాప,దానిమీద మెత్తటి పరుపు,దిండు ఉంటుంది.కింద పడుకుంటే శరీరానికి ఆరోగ్యమని భావిస్తారు. ఫిలిప్పైన్స్,కొరియా ,వియాత్నం సమాజాలు కూడా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తారు.భోజనం చేయడానికి కూడా కింద చాప వేసుకుని చిన్న చెక్క బల్ల ని ముందు పెట్టుకుని చేస్తారు.   

  ఈ తూర్పు దేశాల మాదిరి గానే మన దేశం లోనూ ఈ అలవాట్లు ఉండేవి. అయితే క్రమేపి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పూర్తి గా మారిపోతున్నాయి. తమిళనాడు లో మటుకు ఇప్పటికీ కూడా ఎంత ధనవంతులైనా చాప, దాని మీద పరుపు వేసుకుని పడుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేల మీద పడుకోవడం అనేది పేదరికానికి గుర్తు అని మన దేశం లో భావిస్తుంటారు. అయితే ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ చాలా తూర్పు ప్రాంత దేశాలు నేల మీద పడకే శ్రేష్టమని భావిస్తున్నారు. 

  ----- NewsPost Desk

Tuesday 11 April 2023

కొన్ని హాట్ సీన్స్ ఉన్నప్పటికీ ఈ అమెరికన్ వెబ్ డ్రామా సిరీస్ బాగానే ఉంది

 Daisy Jones & The Six అనే అమెరికన్ మ్యూజిక్ డ్రామావెబ్ సీరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైం వీడియో లో ఉన్నది. రాక్ బ్యాండ్ కళా కారుల జీవితాల్ని చాలా చక్కగా చిత్రించిన ఈ గాథ Taylor Jenkins Reid యొక్క నవల ని ఆధారం గా చేసుకుని తీసినది.ఎన్నో తంటాలు పడి పైకి వచ్చి మళ్ళీ కిందపడి ఎన్నో అనుభవాలు చూసిన ఎన్నో బ్యాండ్ లని పరిశీలించి ఈ నవల రాసినట్లుగా అనిపిస్తుంది.ఇది ఫిక్షన్ అయినప్పటికీ, డాక్యుమెంటరీ నా అన్నంత సహజంగా ప్రతి పాత్రా తమ వేపు నుంచి కథ చెబుతూంటుంది.


Daisy పాత్ర వేసిన Riley Keoush మనో పథం లో నిలిచిపోతుంది. అలాగే Billy పాత్ర లో Sam Claffin కూడా.అతను బ్యాండ్ లీడర్ గా బాగా మెప్పించాడు.డన్ బ్రదర్స్ అనే పేరుతో బ్యాండ్ ని స్థాపించి తనదైన దారిలో పోతుండగా,వాళ్ళకి తారసపడిన మేనేజర్ దీన్ని మరో దారి లోకి నడుపుతాడు.తన సలహాలతో.లాస్ ఏంజిల్స్ కి వెళ్ళి ప్రొగ్రాంస్ ఇస్తూ పేరు తెచ్చుకునే క్రమం లో అనేక మలుపులు తిరుగుతుంది కథ. Camila పాత్ర కి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆ పాత్రలో యువతిగా, మెప్పించిన ఆమె తల్లిగా కూడా చక్కగా నటించింది. మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్నాయి. ఆసక్తిపరులు చూడవచ్చు.    

Thursday 26 January 2023

అమెరికా లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గడ్డుకాలమే..!

 Google, microsoft ఇంకా Amazon వంటి దిగ్గజ సంస్థలు లే ఆఫ్ ప్రకటించడం తో అమెరికా లో వేలాదిమంది భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. వీళ్ళందరూ తమ ఉద్యోగాలు పోగొట్టుకోవడమే కాకుండా వీలైనంత త్వరలో మళ్ళీ ఏదో ఇతర కంపెనీల్లో పని వెదుక్కోవలసిన స్థితి ఏర్పడింది.వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించిన దాని ప్రకారం దాదాపు రెండు లక్షల మంది ఐ.టి. ఉద్యోగులు గత నవంబర్ నుంచి ఇప్పటిదాకా రోడ్డున పడ్డారు.గూగూల్,మైక్రోసాఫ్ట్,ఫేస్ బుక్,అమెజాన్ కంపెనీల్లో ఐతే రికార్డ్ స్థాయిలో ఎప్పుడూ లేనంతమందిని తొలగించారు.


వీరిలో చాలామంది H-1B,L1 వీసాల మీద కొనసాగుతున్నారు. దీంట్లో H-1B వీసా అనేది అమెరికా లోని సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు గా కొనసాగడానికి పనికి వస్తుంది తప్పా ఇమ్మిగ్రేంట్ వీసా గా పరిగణించరు.అదీ ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగులు గా మాత్రమే H-1B వీసా పై రావచ్చును.చాలా సంస్థలు దీన్ని నెపం గా పెట్టుకుని వేలాదిమందిని ఇండియా,చైనా వంటి దేశాల నుంచి హైర్ చేసుకున్నాయి. ఇక L-1Bవీసా అనేది తాత్కాలిక ప్రాతిపదికన ఆయా సంస్థల మధ్య ట్రాన్స్ ఫర్ మీద వచ్చే మేనేజీరియల్ స్థాయి వారికి మాత్రమే సంబంధించినది. 

మన దేశానికి సంబందించిన ఐ.టి. నిపుణులు ఎక్కువగా ఈ రెండు వీసాల మీదనే ఆధారపడి అమెరికా లో పనిచేస్తున్నారు. వీరు ఎక్కువకాలం ఉండాలంటే సాధ్యమైనంత త్వరలో అంటే ఈ ఏప్రిల్ నెల లోగా వేరే కంపెనీల్లో ఉద్యోగం చూసుకోక తప్పదు. ఈ మార్చ్ నెల 20 తేదీ ఆఖరు పని దినం గా ఉన్న ఓ ఉద్యోగిని మాట్లాడుతూ హెచ్ వన్ బి వీసా ఉన్నవారు మరో అరవై రోజుల్లో ఇక్కడ జాబ్ చూసుకోకపోతే తిరిగి ఇండియా వెళ్ళడం తప్పా మరో దారి లేదని చెబుతున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ సంపాదించడం కూడా కష్టం గానే మారింది.  

--- NewsPostNetwork      

Sunday 28 August 2022

హ్యాకర్ల విషయం లో చైనా యే దిట్ట.

                                           (Google Pic)

 తెల్లారి లేచింది మొదలు మన జీవితాలు ఇంటర్ నెట్ తో ముడిపడిఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రతి రోజు ఏదో సైబర్ నేరం గురించి చదవడం మనకి నిత్యకృత్యమై పోయింది. కాని అసలు నేరస్థులు దొరకడం ఇప్పటికీ గగనం గానే ఉంది.చాలా కేసుల్లో ఆనూపానూ దొరకడం లేదు.దానికి కారణం సైబర్ నేరస్థులు లేదా హ్యాకర్లు అందాం,ఇతర దేశాల్లో ఉండటం వల్ల అంతర్జాతీయ వ్యవస్థల సహకారం లేనిదే దొరకడం కష్టమైపోతున్నదని మనం చదువుతున్నాం.

ప్రపంచం లోనే ఎక్కువ హ్యాకర్లు ఉన్న దేశం చైనా అని సర్వే వివరాలు తెలుపుతున్నాయి.అంతేకాదు,సైబర్ నిఘా పెట్టడం లో కూడా చైనా ముందు వరుస లో ఉన్నది.ఆ తర్వాత రష్యా,అమెరికా లు ఉన్నాయి.అలాగే సైబర్ నేరగాళ్ళ వల్ల ఎక్కువ మొత్తం లో నష్టపోతున్న దేశం కూడా చైనా దేశమే.ఏడాదికి 66.3 బిలియన్ డాలర్లని కోల్పోతున్నదట.ఆ తర్వాత స్థానాల్లో బ్రెజిల్,అమెరికా,ఇండియా ఉన్నాయి.

సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా పెద్ద ఎత్తున ధనాన్ని సులభం గా సంపాదించడానికి ఈ మార్గం ఎన్నుకుంటారు.బ్యాంక్ లు,కేసినోలు,ఆర్ధిక వాణిజ్య సంస్థలు ఇంకా వ్యక్తుల్ని కూడా తమ టార్గెట్ గా పెట్టుకుంటారు.మనదేశం లో ఆన్ లైన్ నేరాలు చేయడం లో జాంతార అనే జిల్లా లోని కర్మ తండ్ అనే చిన్న పట్టణం ముందు వరుస లో ఉంది.ఇంకా వింతైన విషయం ఏమిటంటే ఎంతో వెనుకబడిన రాష్ట్రం గా చెప్పుకునే జార్ఖండ్ లో ఈ జిల్లా ఉంది.  

19 వ శతాబ్దం లో,సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఈ ప్రాంతం లోని వెనుకబడిన వర్గాల బాలికల విద్య కోసం ఎంతో కృషిచేశాడు. ఈ జార్ఖండ్ లోని సైబర్ గ్యాంగ్ లు ఓటిపి ఫ్రాడ్ లు చేయడం లో ఇంకా డెబిట్,క్రెడిట్ కార్డులతో మోసం చేయడం,ఇంకా అమాయక జనాల్ని నమ్మించి మోసం చేయడం లో సిద్ధహస్తులు.2020 లో ఎక్కువ గా సైబర్ నేరస్థుల బారినపడింది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం.11 వేల కేసులు నమోదు అయ్యాయి.ఆ తర్వాత బెంగుళూరు,హైదరా బాద్,ముంబాయి,ఘజియా బాద్ లలో నమోదు అయ్యాయి.

2021 లో మొట్టమొదటి సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ బెంగుళూరు లో స్థాపించారు.అయితే సైబర్ పోలీస్ స్టేషన్ ని ప్రతి జిల్లా లోనూ పెట్టి,ఒక ప్రత్యేక శాఖ గా పరిగణించిన రాష్ట్రం గా మహారాష్ట్ర ని చెప్పాలి.మొట్టమొదటి సైబర్ క్రైం మన దేశం లో 1992 లో నమోదయింది. అతగాడి పేరు ఆకాష్ అరోరా ,అతను పోలీ మర్ఫిక్ అనే వైరస్ ని ప్రవేశపెట్టాడు. ఇప్పటిదాకా మన దేశం లో 6,74,021 సైబర్ అటాక్స్ జరిగాయి.అంటే ప్రతిరోజు 3,700 అటాక్ లు జరుగుతున్నాయి.

సైబర్ సెక్యూరిటీ విషయం లో అగ్ర స్థానం లో ఉన్న దేశం డెన్మార్క్ అని తేల్చారు.సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పోస్యూర్ ఇండెక్స్ లో 8.91 స్కోర్  తెచ్చుకొని నంబర్ వన్ గా నిలిచింది.సాధ్యమైనంతవరకు బలమైన పాస్ వర్డ్ లు వాడటం,బయట ప్రదేశాల్లో నెట్ ని వాడకుండా ఉండటం,ఫిషింగ్ మాల్ వేర్ ని పంపే లింక్ ల్ని ఓపెన్ చేయకుండా ఉండటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చేయడం మంచిది.         

---- NewsPost Network

    

Wednesday 3 August 2022

ఇంత పురాతన శిల్ప సంపద అంతర్జాతీయ మార్కెట్ లోకి వెళుతోందా..?

భారత దేశం పురాతన శిల్పాలకి,కళా రూపాలకి పెట్టింది పేరు. ఇత్తడి తోనూ,రాతి తోనూ ఇంకా ఇతర లోహాల తోనూ చేసిన అనేక శిల్పాలు అంతర్జాతీయ విపణి వీధి లోకి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ కాబడుతున్నాయి.1950 నుంచి ఇప్పటి దాకా10,000 ల నుంచి 20,000 ల పురాతన శిల్పాలు దేశం దాటించబడ్డాయని ఒక పరిశోధన తేల్చింది. 2010 నుంచి 2012 మధ్య కాలం లొనే రమారమి 15000 పురావస్తువులు స్మగ్లర్లు బారిన పడి దేశాన్ని దాటాయి.

ఒక్క తమిళనాడు నుంచే 12000 ల శిల్పాలు ఈ లిస్టు లో చేరాయి.కఠినమైన చట్టాలు కూడా లేకపోవడం కూడా స్మగ్లర్లకి కలిసివస్తున్నది.హెరిటేజ్ తెఫ్ట్ IPC370 అనే ఒక్క చట్టమే ఈ విలువైన వస్తువుల్ని బయటకి పంపించేవారిపై ప్రయోగిస్తున్నారు.అమెరికా ఇలాంటి వస్తువుల్ని సేకరించడం లో,మార్కెటింగ్ లో ముందు వరుసలో ఉండగా ఆ తర్వాత యు.కె. రెండవ స్థానం లో ఉంది.ప్రస్తుతం ఆస్ట్రేలియా కూడా పెద్ద మార్కెట్ గా ఉన్నది.

పోయిన పురాతన శిల్ప సంపదని సమ్రక్షించుకోవడం లో ఇటలీ ముందు స్థానం లో నిలుస్తున్నది. 6,78,000 వస్తువుల్ని వెనక్కి రప్పించగలిగింది.అదే ఇండియా విషయానికి వస్తే 2012 నుంచి ఇప్పటిదాకా 127 వస్తువుల్ని వెనక్కి తీసుకురాగలిగింది.సుభాష్ కపూర్ అనే బడా స్మగ్లర్ కి చెందిన గోదాముల్లో 100 మిలియన్ డాలర్ల విలువైన పురాతన వస్తు సంచయాన్ని అమెరికా పొలీసులు ఆ దేశం లో సీజ్ చేశారు.ఇంకా దురదృష్టం ఏమిటంటే మనదేశం లోని పద్మ అవార్డులు పొందిన వారు సైతం ఇలాంటి విలువైన వస్తువుల్ని విదేశాలకి పంపించడం లో కీలకపాత్ర పోషించడం.సింగపూర్ కి చెందిన ఎస్.విజయ కుమార్ అనే పరిశోధకుడు ఐడల్ తెఫ్ట్ అనే తన గ్రంధం లో ఇలాంటి ఎన్నో సంగతులు తెలిపారు. 

Wednesday 1 June 2022

ఆ శిల్పాల సౌందర్యం భయమూ,ఆశ్చర్యమూ కలిగిస్తాయి.


ప్రపంచం లోనే అత్యంత పెద్దదైన హిందూ దేవాలయం ఎక్కడ ఉంది అంటే కాంబోడియా లోని అంగోర్ వాట్ లో ఉంది అని చెబుతారు. అయితే అదే దేశం లో ఉన్న ఇంకొక అద్భుతమైన ఆలయం గురించి చాలా తక్కువమంది కి తెలుసు. దానిపేరు బేయన్ టెంపుల్. ఏడవ జయవర్మ 12 లేదా 13 వశతాబ్దం ప్రారంభ కాలం లో దీనిని నిర్మించారు.ఈ ఆలయం లో ఉన్న అన్ని గోపురాల మీద నాలుగు ముఖాల తో ఉన్న ఒక మనిషి మర్మగర్భం గా నవ్వుతున్నట్లుగా ఉంటుంది. ఆ ముఖాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి.మొత్తం మీద ఈ ఆలయం 216 ముఖాలు అలాంటివి ఉన్నాయి.

ఉన్నట్లుండి ఏమరుపాటు గా చూస్తే ఒక్కక్షణం భయం,ఆశ్చర్యం ఒకేసారి కలుగుతాయి.ఈ దేవాలయానికి వచ్చే గుమ్మం మొదట్లో దేవతలు,రాక్షసులు చెరోవేపున ఉన్నట్లు పాలసముద్రాన్ని చిలికే ఘట్టాన్ని శిల్పాల్లో చెక్కారు అప్పటి శిల్పులు.ప్రవీణ్ గారు చేసిన ఈ వీడియో లో చూడండి,చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ మార్మిక వదనం మొదట్లో బోధిసత్వుని ది అనుకున్నారు. కాని బుద్ధుని కి సంబందించిన ఏ శిల్పాల్లోనూ నాలుగు ముఖాలతో ఉన్నట్లు గాని,మూడు నేత్రాల తో ఉన్నట్లుగాని ఏ బౌద్ధ గ్రంథాల్లోనూ లేదు.అది బ్రహ్మ యొక్క ముఖమని ఆ విధం గా నిర్మించడం లో అంతరార్ధాన్ని ఈ వీడియో లో చెప్పారు.

ఆసియా ఖండం లో తూర్పు వేపున మనకి చేరువ లోనే ఉన్న ఈ కాంబోడియా దేశానికి ఎంతమంది వెళ్ళిఉంటారు..? భారతీయ మూలాలు ఎంతో స్పష్టం గా ఉన్న పక్కదేశాలకి వెళ్ళి అక్కడి విషయాల్ని కూడా మనం పరిశీలించాలి.లేకపోతే ఎలాంటి అవగాహన లేని వారి మాటల్నే నిజమైన చరిత్ర గా లోకం తీసుకుంటుంది.1945 నుంచి జపాన్ దేశం ఈ బేయన్ టెంపుల్ ని సమ్‌రక్షించడానికి తీసుకుంది.ఖ్మేర్ రాజుల కాలం లో కొన్ని బౌద్ధ శిల్పాలు దీనిలో చొప్పించినప్పటికి మౌలికంగా హైందవ ఆలయమని తెలిసిపోతూనే ఉంటుంది.  
     
------ News Post Desk

Saturday 13 November 2021

వైన్ ని ఆ కలప తో చేసిన బ్యారల్స్ లోనే ఎందుకు పులియబెడతారో తెలుసా..?


 వైన్ ని పులియబెట్టడానికి చెక్క తో చేసిన బ్యారల్స్ ని ఉపయోగిస్తారని అందరికీ తెలిసిన విషయమే. కాని ఆ బ్యారల్స్ ని కేవలం ఫ్రెంచ్ ఓక్ కలప తో చేస్తారు. అయితే ఈ మధ్య కాలం లో అమెరికన్ ఓక్ చెట్లు కూడా పోటీ పడుతున్నాయి.అసలు ఆ కలప తో మాత్రమే చేసిన బ్యారల్స్ నే ఎందుకు వాడుతుంటారు..? స్టీల్ తో చేసిన వాటిని వాడవచ్చుగా అనుకుంటున్నారా..?ఈ ఓక్ చెట్ల కలప తో చేసిన బ్యారల్స్ లో పులియబెడితేనే వైన్ కి ఆ చక్కటి సువాసన,రుచి లాంటివి వస్తాయి.

వైన్ కి మంచి క్వాలిటీ రావాలంటే మంచి ద్రాక్ష జాతులు ఉండాలి దానిమీదట వైన్ ని తయారు చేయడం లో నిపుణత ఉండాలి. లోపల బ్యారల్స్ లో వైన్ ని పెట్టి దాచినప్పుడు కూడా తగిన మోతాదు లో ఆక్సిజన్ రావాలి.దానికోసం ఓక్ కలప తో బ్యారల్స్ చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.ఆపిల్,చెర్రీ వంటి చెట్ల కలప తో ప్రయత్నించినా ఓక్ కలప తో వచ్చే నాణ్యత రాలేదు.అమెరికా లో లభించే తెల్ల ఓక్ కలప కి ఈ మధ్య గిరాకీ పెరిగింది.వర్జీనియా,కెంటకీ,ఒరెగాన్,ఓహియా ప్రాంతాల్లో ఓక్ చెట్ల ని బాగా పెంచుతున్నారు.అందులోనూ ఎర్రని,నలుపు రంగుల్లో ఉండే కలప కంటే తెల్ల ఓక్ కే గిరాకీ ఉన్నది.

ఫ్రాన్స్ దేశం లో లిమోసన్,అలైర్స్,వోస్గెస్,ట్రాన్స్ కాయిస్ వంటి ప్రాంతాల్లో వీటి నిమిత్తం ఓక్ చెట్ల ని బాగా పెంచుతున్నారు.ఒక్క బ్యారల్ 200 డాలర్ల నుండి 500 డాలర్ల దాకా పలుకుతుంది.అమెరికన్ బ్యారల్స్ యొక్క ధర కాసింత ఎక్కువ నే అని చెప్పాలి.రోబస్ట్ రెడ్ వైన్స్ గా పిలువబడే  జిన్ ఫాండెల్,కొబర్నెట్,సవిగ్నాన్,మెర్లట్ వంటి వాటికి అమెరికా ఓక్ బ్యారల్స్ ని వాడుతుంటారు. 

----- NewsPost Desk

Tuesday 17 August 2021

బాలి ద్వీపం లోనూ కుల వ్యవస్థ ఉందా..?

 

(దేవాలయాల వీడియో) 

బాలి,సుమత్రా,జావా,ఇండోనేషియా అంటూ మనం చదువుకుని ఉంటాము. కాని ఆయా దీవుల్లోని పూర్తి విశేషాలు మనకు చాలా తక్కువ తెలుసు.ఇపుడు బాలి అనే దీవి గురించి తెలుసుకుందాం.ఇది ప్రస్తుతం ఇండోనేషియా దేశం లోని ఒక ప్రావిన్స్.జావా కి తూర్పు గా,లాంబొక్ అనే దీవి కి పడమర దిక్కు లో ఉంటుంది.

ఈ బాలి ద్వీపం లోని వారు ప్రస్తుతం మనకి విదేశీయులు గా అనిపించవచ్చు గానీ కొన్ని వందల ఏళ్ళ కిందకి వెళితే వారి లోనూ మనకి కొన్ని సారూప్యతలు కనపడతాయి.కాలక్రమం లో భాష,సంస్కృతి వంటివి కొన్ని మార్పులు కి గురవ వచ్చు గానీ మౌలిక స్వరూపం మటుకు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.ఆ పేర్లు విన్నా,ఆ ఆలయాల్ని చూసినా ఇవి మన లాగానే ఉన్నాయే అనిపించక మానదు.

బాలి ద్వీపం లోని మెజారిటీ మతస్థులు హిందువులే.శిల్పం,నృత్యం,చిత్రలేఖనం వంటి ఎన్నో కళలు ఇక్కడ వర్ధిల్లినవి.ఇప్పటికీ మనోహరం గా అవి చూపరులను కట్టిపడేస్తూనే ఉన్నాయి.2005 లో జరిపిన డిఎన్ ఏ పరీక్ష లో బాలి ప్రజల వై క్రోమోజోంస్ 12 శాతం భారతీయుల్ని పోలిఉన్నాయి.   

కాలక్రమం లో తైవాన్,మలేషియా,చైనా నుంచి వలస వచ్చిన ప్రజల వల్ల వారి ప్రభావం వీరి సంస్కృతి పై పరుచుకుంది.ఇక్కడ రమారమి 2000 హిందూ ఆలయాలు ఉన్నాయి.పాశుపత,భైరవ,శివ సిద్ధాంత,వైష్ణవ,బోధ,బ్రహ్మ,రేసి,సోర,గాణాపత్య వంటి శాఖలు ఇక్కడ గత కాలం లో వర్ధిల్లినట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయి.వీరి అందరికీ ఎవరి ఇష్ట దైవం వారికి ఉండేది.అదే క్రమం లో బౌద్ధ మతం వంటివి కూడా ఆదరింపడ్డాయి.

2000 ఏళ్ళకి పూర్వం నుంచే ఇక్కడ మానవ సంచారం ఉన్నట్లు తెలుస్తున్నది.ఈ బాలి ద్వీపం లో శ్రీకేసరి వర్మదేవ నిర్మించిన ఆలయం లో దొరికిన ఆధారాల్ని బట్టి ఇంకా ఇతర నిర్మాణాల వల్ల  1293 నుంచి 1520 దాకా ఉన్న హైందవ రాజ్యాల తీరు తెన్నులు తెలుస్తున్నవి. ఈ బాలి ద్వీపం లో శక్తిమంతమైన పది వ్యాపార కుటుంబాలు ఉండేవని వారి మధ్య రేగిన స్పర్ధల వల్ల ఇంకా ఇండోనేషియా ప్రభుత్వ పోకడ వల్ల  వీటి ప్రాభావం తగ్గినట్లు చరిత్ర చెబుతున్నది.
       
    1906 లో ఇక్కడి Sanur ప్రాంతం లో వేలాది రాజవంశీకులు డచ్ వారి చేతి లో మరణించడం ఇష్టం లేక ఆత్మ హత్య చేసుకున్నారు,ఆ క్రతువు ని Puputan అని పిలుస్తారు.ప్రస్తుతం అది ఒక పర్యాటక ప్రాంతం గా మారింది. హిందూ దేవుళ్ళ పేర్లు కొన్నిసార్లు రూపం మార్చుకుని వినిపిస్తాయి ఉదాహరణకి గొవా గొజా ...అంటే గజాననుడి యొక్క పేరు అలా మారిందన్న మాట. విగ్రహం మాత్రం అదే వినాయకుడి దే ఉంటుంది...అక్కడ తేడా ఉండదు.1512 వరకు అంటే డచ్ వాళ్ళు వచ్చేంత వరకు హిందూ రాజులే పాలించినది.

హిందూ మతం లోని వర్ణ వ్యవస్థ ఇక్కడికీ పాకింది. అయితే నాలుగు వర్ణాలే ఉన్నాయి. వాటిని కొద్దిగా వేరేలా పిలుస్తారు..సోద్ర అంటే శూద్ర,వెసియా అంటే వైశ్య,సత్రియా అంటే క్షత్రియ,బ్రామణ అనగా బ్రాహ్మణ అని పిలుస్తారు. మన దేశం లో మాదిరిగా అంటరాని కులం అనేది లేదు.క్రాఫర్డ్,ఫ్రెడెరిక్ వంటి పరిశోధకులు ఈ వర్గీకరణ ఇక్కడి ప్రజల హిందూ మత మూలాల్ని తెలియజేస్తున్నదని అభిప్రాయపడ్డారు.

ఆ మధ్య కాలం లో పర్యాటకులే లక్ష్యం గా బాంబు పేలుళ్ళు జరగడం తో కొంత ఊపు తగ్గినా మళ్ళీ పర్యాటకులు బాగానే వస్తున్నారు.కారణం ఇక్కడి వాతావరణం,ప్రాచీన నిర్మాణాలు,అందమైన అడవులు,బీచ్ లు వంటివి.ట్రిప్ అడ్వైజర్ బాలి (2020 కి గాను) ని టాప్ డెస్టినేషన్ గా పేర్కొంది.ఈ దీవికి మూడు వైపులా చక్కని పగడాల దీవులు ఉంటాయి.అనేక దీవుల సముదాయం లో చాలావరకు నిర్మానుష్యం గా ఉంటాయి.  

--- NP Desk

Sunday 2 December 2018

ఇది ఒక కొత్త అనుభవంగా అభివర్ణిస్తున్నారు.

ఒరిస్సా లోని రఘురాజ్ పూర్ హస్త కళలకు,శిల్ప కళలకు పెట్టింది పేరు.అంతర్జాతీయం గా ఇపుడు అనేకమంది ఈ చిన్న పట్టణానికి వచ్చి ఇక్కడి పట చిత్ర కళ ని ఇంకా ఇతర వాటిని అభ్యసిస్తున్నారు.ఎమ్మా గార్డ్నర్ ఆస్ట్రేలియా కి చెందిన కళాకారిణి.వస్త్రాల మీద వేసే బొమ్మలకి సంబందించిన కళ,పటచిత్ర కళ,తాళపత్ర కళ తనని ఆకర్షించినవని కనుక ఇక్కడకి వచ్చి నేర్చుకుంటున్నట్లు తెలిపారు.ఇటలీ నుంచి గిలియ వయొలంటి వచ్చి ఓ వారం నుంచి కొబ్బరి కాయల మీద,పేపర్ మీద వేసే కొన్ని స్థానిక డిజైన్లను నేర్చుకుంటున్నారు. ఇవి పురాణాలకి సంబందించిన చిత్రాలు ఇంకా ఇతర వాటికి చెందినవి.



వివిధ రాళ్ళ నుంచి,ఆకులనుంచి ఇక్కడి కళాకారులు తయారు చేసే సహజ రంగుల మిశ్రమాల గురించి తెలుసుకుంటున్నారు.ఎలియనోరా పేసి ఒక లా స్టూడెంట్ ఇటలీ దేశం లో.ఇక్కడి కళాకారుల జీవన విధానం గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తి గా ఉందని చెపుతున్నారు.ఇది ఒక కొత్త అనుభవంగా అభివర్ణిస్తున్నారు. 

Saturday 16 June 2018

గాడిదల కి ముప్పు గా మారిన చైనా


ఆఫ్రికా ఖండం లోని 14 దేశాలు ఈ మధ్య తమ దేశాల నుంచి గాడిదలు కనుమరుగయ్యే ప్రమాదాన్ని గుర్తించి వాటి సం రక్షణకి చర్యలు చేపడుతున్నాయి.కెన్యా,బుర్కినా ఫాసో ,ఈజిప్ట్,నైజీరియ వంటి దేశాల నుంచి ఏడాదికి వెయ్యి గాడిదల చొప్పున వాటి చర్మాల నిమిత్తం చంపబడుతున్నాయి.దానికి కారణం ఏమిటో తెలుసా ..! చైనా దేశం లో ఈ గాడిదల చర్మానికి విపరీతమైన డిమాండ్ ఉన్నది.ఈ చర్మం నుంచి తీసిన గెలాటిన్ ని చైనా సంప్రదాయ వైద్యం లో బాగా వాడతారు.దానితో ఆ దేశం లో గాడిదలు చివరకి తక్కువై పోయి ఇతర దేశాల పై ఆధారపడుతున్నారు.ఆఫ్రికా లోని దేశాల్లో ఈ వ్యాపారం ఊపందుకుంది.దానితో వారికి గాడిదలు కరువై వాటి సం రక్షణ కోసం చర్యలు ప్రారంభించారు.Tunza punda wako (నీ గాడిదను దక్షించుకో) అనే స్వాహిలీ భాష లోని స్లోగన్ తో ప్రస్తుతం అక్కడ ఉద్యమం నడుస్తున్నది.  

Sunday 6 August 2017

భారతీయ సంతతి కి చెందిన డాక్టర్ అమ్మాయి ని నిద్ర లేపబోయినందుకు అరెస్ట్ అయ్యాడు.



28 ఏళ్ళు గల  విజయకుమార్ కృష్ణప్ప అనే డాక్టర్ అమెరికా లోని నెవార్క్  ఇంటర్నేషనల్ విమానాశ్రయం లో దిగుతూ విమానం లో తన సీటు పక్కనే ఉన్న మరో సీటు లో నిద్రపోతున్న ఒక టీనేజ్ ప్రయాణీకురాల్ని లేపుదామని ఆమె మీద చేయి వేసి తట్టాడు.దానితో ఆ అమ్మాయి తన పేరెంట్స్ తో ఈ విషయం చెప్పి తన తొడ పై చెయ్యి వేసి  లేపినట్లుగా ఆరోపిస్తూ అక్కడి పోలీస్ లకి ఫిర్యాదు చేశారు. ఇది గత జూలై 23 న జరిగింది.కాగా రికార్డ్ అయిన సిసిటివి ఫుటేజ్ ల సాయం తో ఆ డాక్టర్ ని గుర్తుపట్టి అరెస్ట్ చేశారు.ఆపై బాండ్ మీద బెయిల్ ఇచ్చినట్లు సమాచారం.  

Wednesday 29 March 2017

అతనికి డబ్బంటే చేదా ..?



ఈ సారి సాహిత్యానికి ఇచ్చే నోబెల్ బహుమతిబాబ్ డైలాన్ అనే అమెరికన్ వాగ్గేయకారుడి కి ప్రకటించడం జరిగింది అయితే దాన్ని అతను తీసుకుంటాడా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.జూన్ 10 వ తేదీ లోగా ఆనవాయితీ ప్రకారం బాబ్, స్వీడిష్ అకాడెమి లో తన ప్రసంగం ని వినిపించాలి.అది పెద్ద గా ఉండొచ్చు,చిన్న గా ఉండొచ్చు వేరే విషయం.అలా అయితేనే నోబెల్ బహుమతి తో పాటు ఇచ్చే తొమ్మిది లక్షల పది వేల డాలర్లు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది.ఈ విషయాన్ని కమిటీ ఇప్పటికే తెలియజేసినా బాబ్ డైలాన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు ఇంతదాకా..మరి అతని అంతరంగం ఏమిటో..!  

Monday 14 November 2016

"బలియాత్ర" పండుగ సంబరాలు ఈ రోజునుంచే ...



ఈ రోజు బలియాత్ర పండుగ సంబరాలు ఒరిస్సా లోని కటక్ పట్టణం లో మహానది తీరాన మొదలవుతున్నాయి. కళింగ ప్రాంతానికి చెందిన జాలరులు తమ నౌకలపై అనేక శతాబ్దాల క్రితం ఇండోనేషియా వద్ద గల దీవులను చేరుకొని విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ పండుగని కొన్ని వందల ఏళ్ళ నుంచి జరుపుతున్నారు.వారం పాటు సాగే ఇక్కడి తిరునాళ్ళ లో ఈ రాష్ట్రం లోని వారే గాక,ఇతర రాష్ట్రాలనుంచి తమ కళాకృతులను తెచ్చి అమ్ముతుంటారు.ఏటా రమారమి 80 నుంచి వంద కోట్ల వ్యాపారం సాగుతుంది.దీనిని పల్లె శ్రీ మేళా అంటారు.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర్నుంచి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి పర్యావరణం నిమిత్తం అనుమతులు తీసుకు రావలసి వచ్చింది.


ఒరిస్సా లోని కేంద్రపడా నుంచి రసాబలి,పూరి నుంచి మాల్ పూవా,ధెంకనాల్ నుంచి బారా,కకేరా,..బారిపడా నుంచి మటం ముధి లు వంటి సంప్రదాయ వంటకాలు నోరు ఊరించనున్నాయి.మొత్తం మీద 1700 స్టాళ్ళు ఏర్పాటు అవుతాయని వార్త. దేశం లోని 28 రాష్ట్రాలనుంచి తమ ఉత్పత్తుల్ని అమ్మడానికి రానున్నారు.ట్రాన్స్ జెండర్స్ కి,అంగవికలాంగులకి సైతం ఈ సారి కొన్ని స్టాళ్ళు రిజర్వ్ చేశారు.



ఒరియా సాన్స్కృతిక వాతావరణానికి ప్రతిబింబం లా సాగే ఈ ఉత్సవాలలో అనేక కళా ప్రదర్శనలు సైతం ఉంటాయి. ఈ  నెల 22 దాక బలియాత్ర ఉత్సవాలు కొనసాగుతాయి. 

Thursday 10 November 2016

ఇండోనేషియా లోని కొన్ని అద్భుత ప్రదేశాలు


ఇండోనేషియా రమారమి 18,000 పై చిలుకు ద్వీపాల తో కూడిఉన్న దేశం.అయితే వాటిల్లో జనాలు ఉండేది కేవలం ఆరు వేల దీవుల్లోనే అని చెప్పాలి.24 కోట్ల జనాభా తో 300 విభిన్న తెగలతో 250 భాషలతో అలరారుతున్న ఆ దేశం లో ఎన్నో చూడదగిన  ప్రదేశాలు ఉన్నాయి.బాలి,సుమత్రా దీవులు పర్యావరణ టూరిజం కి పేరెన్నిక గన్నవి.

ఈ కింద కనిపిస్తున్న ది లేక్ తోబా.వంద కి.మీ పొడవు,30 కి.మీ. వెడల్పు ఉండే చెరువు డబ్భై వేల ఏళ్ళ క్రితం అగ్నిపర్వతం పేలినప్పుడు ఏర్పడినది.నీళ్ళు వెచ్చగా ఉంటాయి.ఇక్కడికి పర్యాటకులు తరచూ వస్తుంటారు.


ఈ కింది చిత్రం బొరోబుడుర్ ,ఒక బోఉధ దేవాలయం. 8 వ లేదా 9 వశతాబ్దం లో శైలేంద్ర అనే రాజు కట్టించినవి.ఇది జావా ద్వీపం లో ఉన్నది.అయితే 14 వ శతాబ్దం లో ఈ నిర్మాణాన్ని గుర్తు దొరకని కారణాల తో అప్పటి పాలకులు వదిలి వేయగా ఒక అరణ్యం మధ్య లో కనుగొని పర్యాటకుల కోసం దీని తెరిచి ఉంచుతున్నారు.

Wednesday 12 October 2016

వియాత్నాం యుద్ధం గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?



క్రి.శ.938 వరకు వియాత్నాం దేశం చైనా యొక్క ఆధీనం లో ఉండేది.రమారమి 1000 ఏళ్ళ పాటు ఇలా ఉన్నది.

ఆ తర్వాత ఫ్రెంచ్ వారి పాలన లోకి వచ్చి 19 వ శతాబ్దం మధ్య వరకు కొనసాగింది. 1954 లో ఫ్రెంచ్ వారు వైదొలగారు.

అమెరికన్ కాంగ్రెస్ దృష్టి లో వియాత్నం వార్ అనేదాన్ని Conflict గానే తప్ప యుద్ధం గా గుర్తించలేదు.

ఆ సమయం లో యుద్ధం లో ఫాల్గొన్న అమెరికన్ సైనికుల్లో మూడింట రెండు వంతులు స్వచ్చందగానే చేరారు.

రెండవ ప్రపంచ యుద్ధం 4 ఏళ్ళు జరిగింది.దాని లో 40 రోజులు Combat days గా గుర్తించారు.అయితే వియాత్నాం యుద్ధం లో 1 ఏడాది లో 240 Combat days గా తేల్చారు.

విజయావకాశాలు సన్నగిల్లడం తో అమెరికా యుద్ధం నుంచి విరమించింది తప్ప ఓటమి తో కాదు.

ఈ యుద్ధం తర్వాత ఇండోనేషియా,థాయ్ లాండ్ ,సింగ పూర్,మలేషియా ల్లో కమ్మ్యూనిజం ప్రభావాన్ని గణనీయం గా తగ్గించగలిగారు.

Monday 26 September 2016

భారతీయులపై పరుష పదజాలం వాడిన పాక్ నటుడిని టీవి షో నుంచి తప్పించిన బ్రిటన్ టివి



పాక్ జాతీయుడై ఉండి  ఒక బ్రిటిష్ టీవి సోప్ లో నటిస్తున్న అన్వర్ ని అతను నటిస్తున్న సీరియల్ నుంచి తప్పించారు.కారణం అతను ట్విట్టర్ లో భారతీయుల్ని ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలే." B...s"  అని p...s drinking  c..ts అని ట్విట్టర్ లో దూషించాడు.జమ్మూ కాశ్మీర్ లో మా సోదరీ సోదరుల్ని చంపుతున్న దుర్మార్గులు భారతీయులని,వారి దగ్గర పాక్ కి చెందిన ఆర్టిస్ట్ లు ఎందుకు పనిచేస్తున్నారు..డబ్బులు ఇంకా సంపాయించడానికా..అంటూ పలు వ్యాఖ్యలు చేశాడు.దానితో ప్రస్తుతం నటిస్తున్న కోరోనేషన్ స్ట్రీట్ అనే సీరియల్ నుంచి నిర్వాహకులు తప్పించారు.ఈ అన్వర్ రెండు హాలివుడ్ సినిమాల్లో చిన్న పాత్ర లు పోషించాడు. 

Tuesday 6 September 2016

ఆ పుస్తకాలే నన్ను తీర్చిదిద్దాయి అంటున్నదామె



Arya fell through the fault ఈ ఏడాది ఓం ప్రచురణకర్తలు పబ్లిష్ చేసిన ఈ బుక్ ని రాసినది మరెవరో కాదు ముంబాయి కి చెందిన రీనిత మల్ హోత్ర హోర అనే ఆమె,ప్రస్తుతం హాంగ్ కాంగ్ లో ఒక రేడియో లో పనిచేస్తున్నారు.ఈ కధ మొత్తం శాన్ ఫ్రాన్సిస్కో లో వలస వెళ్ళిన భారతీయ కుటుంబం నేపధ్యం లో సాగుతుంది.దీని లో ని ఆర్య అనే కుర్రవాని పాత్ర ప్రధానమైనది.ఒకవేపు భారతీయ ఇతిహాసం రామాయణం  ని తీసుకొని దానికి సమకాలీనతని జోడించారు.రీనిత ఆయుర్వేదం,ఆర్దిక సంబంధ విషయాలపై గతం లో కొన్ని పుస్తకాలు రాశారు.చిన్నప్పటినుంచి జేన్ ఆస్టిన్ రచనలు ఆసక్తి గా చదివేదాన్నని ఆ నవలల పఠనమే తనని రచయిత్రి గా తీర్చిదిద్దిందని చెబుతున్నారు.

Friday 29 July 2016

తుపాకులు అక్కడ చాక్లెట్ ల లా దొరుకుతాయి...!


 పాకిస్తాన్ లోని పెషావర్ కి 35 కి.మి. దూరం లో ఉన్న డర్రా అడాంఖేల్ అనే ఊరు తుపాకుల తయారీకి పెట్టింది పేరు.చిన్న సైజు కుటీర పరిశ్రమల్లా ఇక్కడ ఆయుధాల్ని తయారు చేస్తుంటారు.స్క్రాప్ మెటల్ ని ఉపయోగించి కలాశ్నికోవ్ ల్ని తయారు చేసే నైపుణ్యం వీరి సొంతం.వీటి తో పాటు ఇతర ఆయుధాల్ని కూడా సరసమైన ధరలకి అందజేస్తుంటారు.కొన్ని దశాబ్దాలు గా ఆయుధాల స్మగ్లర్లకి  ,డ్రగ్ డీలర్లకి ఆటపట్టు ఈ ప్రదేశం.దొంగిలించిన కార్ల నుంచి యూనివర్సిటి ఫేక్ సర్టిఫికెట్ ల దాకా ఇక్కడ తగు ధరలకి లభ్యం అవుతాయి.80 దశకం లో ముజాహిదిన్ లు సోవియట్ పై యుద్ధం ప్రారంభం చేసినప్పుడు ఇక్కడి ఆయుధాలకి మంచి గిరాకి ఉండేది. 2009 లో ఒక పోలెండ్ కి చెందిన ఇంజనీర్ ని పీక తెగ్గోసినపుడు   దీని పేరు మారుమోగింది.MP5  రకం తుపాకులు 67 డాలర్లకి లేదా ఏడువేల రూపాయలకి లభ్యం అవుతాయి.అసలు వాటికి ఇవి ఏ మాత్రం తీసిపోవు.నవాజ్ షరీఫ్ ప్రభుత్వం వచ్చిన తరువాత పరిస్థితి కొంత మెరుగుపడినా ,ఆయుధాల వ్యాపారం మాత్రం అలాగే జరిగిపోతున్నదని భోగట్టా.