(దేవాలయాల వీడియో)
బాలి,సుమత్రా,జావా,ఇండోనేషియా అంటూ మనం చదువుకుని ఉంటాము. కాని ఆయా దీవుల్లోని పూర్తి విశేషాలు మనకు చాలా తక్కువ తెలుసు.ఇపుడు బాలి అనే దీవి గురించి తెలుసుకుందాం.ఇది ప్రస్తుతం ఇండోనేషియా దేశం లోని ఒక ప్రావిన్స్.జావా కి తూర్పు గా,లాంబొక్ అనే దీవి కి పడమర దిక్కు లో ఉంటుంది.
ఈ బాలి ద్వీపం లోని వారు ప్రస్తుతం మనకి విదేశీయులు గా అనిపించవచ్చు గానీ కొన్ని వందల ఏళ్ళ కిందకి వెళితే వారి లోనూ మనకి కొన్ని సారూప్యతలు కనపడతాయి.కాలక్రమం లో భాష,సంస్కృతి వంటివి కొన్ని మార్పులు కి గురవ వచ్చు గానీ మౌలిక స్వరూపం మటుకు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.ఆ పేర్లు విన్నా,ఆ ఆలయాల్ని చూసినా ఇవి మన లాగానే ఉన్నాయే అనిపించక మానదు.
బాలి ద్వీపం లోని మెజారిటీ మతస్థులు హిందువులే.శిల్పం,నృత్యం,చిత్రలేఖనం వంటి ఎన్నో కళలు ఇక్కడ వర్ధిల్లినవి.ఇప్పటికీ మనోహరం గా అవి చూపరులను కట్టిపడేస్తూనే ఉన్నాయి.2005 లో జరిపిన డిఎన్ ఏ పరీక్ష లో బాలి ప్రజల వై క్రోమోజోంస్ 12 శాతం భారతీయుల్ని పోలిఉన్నాయి.
కాలక్రమం లో తైవాన్,మలేషియా,చైనా నుంచి వలస వచ్చిన ప్రజల వల్ల వారి ప్రభావం వీరి సంస్కృతి పై పరుచుకుంది.ఇక్కడ రమారమి 2000 హిందూ ఆలయాలు ఉన్నాయి.పాశుపత,భైరవ,శివ సిద్ధాంత,వైష్ణవ,బోధ,బ్రహ్మ,రేసి,సోర,గాణాపత్య వంటి శాఖలు ఇక్కడ గత కాలం లో వర్ధిల్లినట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయి.వీరి అందరికీ ఎవరి ఇష్ట దైవం వారికి ఉండేది.అదే క్రమం లో బౌద్ధ మతం వంటివి కూడా ఆదరింపడ్డాయి.
2000 ఏళ్ళకి పూర్వం నుంచే ఇక్కడ మానవ సంచారం ఉన్నట్లు తెలుస్తున్నది.ఈ బాలి ద్వీపం లో శ్రీకేసరి వర్మదేవ నిర్మించిన ఆలయం లో దొరికిన ఆధారాల్ని బట్టి ఇంకా ఇతర నిర్మాణాల వల్ల 1293 నుంచి 1520 దాకా ఉన్న హైందవ రాజ్యాల తీరు తెన్నులు తెలుస్తున్నవి. ఈ బాలి ద్వీపం లో శక్తిమంతమైన పది వ్యాపార కుటుంబాలు ఉండేవని వారి మధ్య రేగిన స్పర్ధల వల్ల ఇంకా ఇండోనేషియా ప్రభుత్వ పోకడ వల్ల వీటి ప్రాభావం తగ్గినట్లు చరిత్ర చెబుతున్నది.
1906 లో ఇక్కడి Sanur ప్రాంతం లో వేలాది రాజవంశీకులు డచ్ వారి చేతి లో మరణించడం ఇష్టం లేక ఆత్మ హత్య చేసుకున్నారు,ఆ క్రతువు ని Puputan అని పిలుస్తారు.ప్రస్తుతం అది ఒక పర్యాటక ప్రాంతం గా మారింది. హిందూ దేవుళ్ళ పేర్లు కొన్నిసార్లు రూపం మార్చుకుని వినిపిస్తాయి ఉదాహరణకి గొవా గొజా ...అంటే గజాననుడి యొక్క పేరు అలా మారిందన్న మాట. విగ్రహం మాత్రం అదే వినాయకుడి దే ఉంటుంది...అక్కడ తేడా ఉండదు.1512 వరకు అంటే డచ్ వాళ్ళు వచ్చేంత వరకు హిందూ రాజులే పాలించినది.
హిందూ మతం లోని వర్ణ వ్యవస్థ ఇక్కడికీ పాకింది. అయితే నాలుగు వర్ణాలే ఉన్నాయి. వాటిని కొద్దిగా వేరేలా పిలుస్తారు..సోద్ర అంటే శూద్ర,వెసియా అంటే వైశ్య,సత్రియా అంటే క్షత్రియ,బ్రామణ అనగా బ్రాహ్మణ అని పిలుస్తారు. మన దేశం లో మాదిరిగా అంటరాని కులం అనేది లేదు.క్రాఫర్డ్,ఫ్రెడెరిక్ వంటి పరిశోధకులు ఈ వర్గీకరణ ఇక్కడి ప్రజల హిందూ మత మూలాల్ని తెలియజేస్తున్నదని అభిప్రాయపడ్డారు.
ఆ మధ్య కాలం లో పర్యాటకులే లక్ష్యం గా బాంబు పేలుళ్ళు జరగడం తో కొంత ఊపు తగ్గినా మళ్ళీ పర్యాటకులు బాగానే వస్తున్నారు.కారణం ఇక్కడి వాతావరణం,ప్రాచీన నిర్మాణాలు,అందమైన అడవులు,బీచ్ లు వంటివి.ట్రిప్ అడ్వైజర్ బాలి (2020 కి గాను) ని టాప్ డెస్టినేషన్ గా పేర్కొంది.ఈ దీవికి మూడు వైపులా చక్కని పగడాల దీవులు ఉంటాయి.అనేక దీవుల సముదాయం లో చాలావరకు నిర్మానుష్యం గా ఉంటాయి.
--- NP Desk
No comments:
Post a Comment