Friday, 17 September 2021

యూట్యూబర్ గా దుమ్ము దులుపుతున్న గిరిజనుడు

 
యూట్యూబర్ గా దుమ్మురేపుతున్న గిరిజనుడు ఇసాక్ ముండా. ఈయన ఒడిశా రాష్ట్రం లోని సంబల్ పూర్ జిల్లా కి చెందిన అతి సాధారణ వ్యక్తి. అయితేనేం,తనదైన శైలి లో తన రోజువారీ జీవితాన్ని యూట్యూబ్ లో పెడుతూ పేరు కి పేరు డబ్బు కి డబ్బు సంపాదిస్తున్నాడు.అసలు ఈ వీడియోలు చేయడం అలాంటివి ఏవీ మొదట్లో తనకి తెలియవు.


ఒకసారి వాళ్ళ ఇంట్లో పిల్లలు జియో ఫోన్ లో ఏదో యూట్యూబ్ కార్యక్రమం చూస్తూ ఉండగా మనోజ్ డే అనే సీనియర్, యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బులు సంపాదించవచ్చని చెబుతూ వివరాలు చెప్పసాగాడు.వీటిని బాగా విన్న ఇసాక్ ముండా తాను కూడా వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలని సంకల్పించాడు.


మంచి స్మార్ట్ ఫోన్ కావాలనే ఉద్దేశ్యం తో ఇన్స్టాల్ మెంట్ లో మూడువేల రూపాయల ఫోన్ ని కొనుగోలు చేశాడు.తన పాత ఫోన్ ని అమ్మేశాడు.నిరుపేద గా ఉన్న తను ఏవో లేనిపోని గొప్పలకి పోదలుచుకోలేదు. తన రోజువారీ గ్రామీణ గిరిజన జీవితాన్నే వీడియోలు గా తీశాడు.తాను ప్రతి రోజు తినే తిండి,ఆహార పానియాలు,చుట్టుపక్కల ఉండే వాటినే షూట్ చేసి అప్లోడ్ చేసే వాడు. 

ఒక్కో రోజు కూర కూడా వేసుకోకుండా అన్నం తినేవాడు.దాన్ని కూడా వీడియో తీశాడు.వంటలు,భోజనాలు,వాటికి సంబందించిన పోటీలు ఇలాంటివి అన్నీ షూట్ చేసి అప్లోడ్ చేసే వాడు.క్రమేపి అతని యూట్యూబ్ చానెల్ కి దేశీయం గా,అంతర్జాతీయం గా బాగా సబ్ స్క్రైబర్లు పెరిగారు. తన మొదటి వీడియో కి 34000 రూపాయలు వచ్చాయి.ప్రస్తుతం అతను నెలకి లక్ష రూపాయల కి పైగా సంపాదిస్తున్నాడు.


ఒకసారి మన్ కి బాత్ లో ప్రధాని ఈయన గూర్చి ప్రస్తావించారు.దానితో తన కీర్తి మరింత పెరిగింది. ఇతని కి ఓ అభిమాని ఇల్లు కూడా కట్టించాడు.విదేశాల నుంచి కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.మరి ఇది సామాన్యుడు సాధించిన ఘన విజయం కాక మరేమిటి..? ఈ ముప్ఫై ఏళ్ళ యువకుని చదువు కేవలం ఏడవ తరగతి మాత్రమే.రెక్కాడితే గాని డొక్క నిండని కుటుంబం.భార్య,నలుగురు పిల్లలు. అదండీ విషయం.

No comments:

Post a Comment