Wednesday, 5 May 2021

మన తెలుగు పత్రికలు ఈ సాహితీ పుత్రుని మరణాన్ని పట్టించుకోలేదనే చెప్పాలి

 


గతనెల 27 వ తేదీన భారతీయ దిగ్గజ రచయిత అనదగ్గ మనోజ్ దాస్ గారు తన 87 వ యేట పరమపదించారు. మనకి స్వాతంత్రయం వచ్చిన తర్వాత మొదటి తరం ఇండో ఆంగ్లియన్ రచయితలు ఎవరయ్యా అంటే ఆర్.కె.నారాయణ్,ముల్క్ రాజ్ ఆనంద్ ఇంకా మనోజ్ దాస్ అని చెప్పాలి.ఇంకా కొంతమంది ఉండవచ్చు గాక కాని రాశి లోనూ,వాసి లోను ఎన్నదగిన వారి పేర్లు వచ్చినపుడు ఈ మూడు పేర్లు ముందు వరుస లో నిలుస్తాయి.


అటువంటి ప్రముఖ రచయిత మరణిస్తే మన తెలుగు దినపత్రికలు ఏవీ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.కనీసం ఆ న్యూస్ కూడా వచ్చినట్లు లేదు మరి ఎందుచేతనో అర్ధం కాలేదు. అయితే జాతీయ స్థాయి పత్రికలు అన్నీ బాగానే కవర్ చేశాయి.మనోజ్ దాస్ కి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఆయన మాతృభాష ఒరియా లో ఎంత విస్తృతం గా రాశారో,ఆంగ్లం లోనూ అంత విస్తృతం గానూ రాశారు.అటువంటి ద్విభాషా పాండిత్యం కలిగి రెండు భాషల్ని రెండు కళ్ళు గా భావించి సృజానాత్మక రచనలు చేసినవారు చాలా అరుదు.


రమారమి తొంభై దాకా పుస్తకాలు రెండు భాషల్లో రాశారు. ఒడియా ప్రజలు ఆయన్ని వ్యాస కవి అని గౌరవిస్తారు.కొన్ని వందల కథలు,వ్యాసాలు రాశారు.ట్రావెలోగ్స్ రాశారు.హిందూ,హిందూస్థాన్ టైంస్,టైంస్ ఆఫ్ ఇండియా వంటి ఇంగ్లీష్ దినపత్రికలకి కాలంస్ ని చివరి రోజుల దాకా రాస్తూనే ఉన్నారు.బాగా జ్ఞాపకం తెచ్చుకోగలిగినట్లయితే ఇంగ్లీష్ చందమామ లో కూడా ఆయన రాసిన బాలల కథలు వచ్చేవి.అవే తెలుగు లో కూడా అనువాదమయ్యేవి.


సాంఘిక,జానపద,పౌరాణిక అంశాల నుంచి నేటి ఆధునిక ధోరణుల్ని ఆయన తన రచనల్లో పొందుపరిచారు.ఇక అరవిందుని తాత్వికత పై ఎనలేని సాధికారత ఉండేది.1963 లో పాండిచేరి లోని ఆశ్రమం లో కి వచ్చి అక్కడే నివసించారు. ఆ సంస్థ కి సంబందించిన యూనివర్సిటీ లో ఇంగ్లీష్ సాహిత్యాన్ని,అరవింద తత్వాన్ని బోధించారు.కాలేజ్ రోజుల్లో వామపక్ష ఉద్యమనేత గా ఉండి ఒక ఏడాది జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత కొంత కాలానికి అరవిందుని ఫిలాసఫీ కి ఆకర్షింపబడి పాండిచేరి చేరుకున్నారు.


The Submerged valley,Tiger at the twillight,Chasing the rainbow,Bulldozers,Mystery of the missing cap ఇలాంటి కొన్ని నవలలు,కథా సంపుటాలు నేను చదివిన వాటిలో కొన్ని.ఇంకా ఆయన రాసే కాలంస్ ని కూడా ఆంగ్ల దినపత్రికల్లో ఫాలో అయ్యేవాణ్ణి.గంభీరత,వ్యంగ్యము,హాస్యము ,విషయ విశ్లేషణ వారి లో బాగా ఎన్నదగిన విషయాలు.సమకాలీన రాజకీయాలు,బ్రిటీష్ రాజ్ కాలం లోని అంశాలని భూమిక గా చేసుకొని చాలా కథలు రాశారు.బరంపురం కి చెందిన ఉపద్రష్ట అనురాధ గారు మనోజ్ దాస్ గారి కథల్ని కొన్ని తెలుగు లోకి అనువదించి పుస్తకం గా తెచ్చారని తెలిసింది.వాకబు చేస్తే ఆ కాపీలు ఇప్పుడు లభ్యం కావడం లేదని తెలిసింది.అనురాధ గారు జీవించి ఉన్నకాలం లో ఆమె తో ఫోన్ లో మాట్లాడాలని ప్రయత్నించాను.అయితే ఆమె అనారోగ్యం తో ఉన్నారని మిత్రులు విజయచంద్ర గారు చెప్పారు.ఆ కొన్నాళ్ళకే ఆమె పరమపదించడం జరిగింది.   


మనోజ్ దాస్ గారికి సరస్వతి సమ్మాన్,కేంద్ర సాహిత్య అకాడెమీ వారి ఫెలోషిప్ లాంటివి ఎన్నో గౌరవాలు వరించాయి. ఈ మధ్య కాలం లోనే పద్మభూషణ్ కూడా పొందారు.నిజానికి జ్ఞాన్ పీఠ్ అవార్డ్ కి ఆయన నూటికి నూరు పాళ్ళు అర్హుడు.కాని ఎందుచేతనో రాలేదు.ఆయన తో సన్నిహితం గా ఉండే ఒక ఒరియా మిత్రుని తో ఇదే మాట అన్నప్పుడు ఆయన చెప్పిందేమిటంటే రాయడం వరకే తప్పా అవార్డ్ ల కోసం పైరవీ లు చేయడం అనేది మనోజ్ దాస్ గారికి అసలు ఇష్టం ఉండదట.


బహుశా ఏడాది కి పై కాలం లోనే ఆయన భార్య మరణించారు.వాళ్ళకి పిల్లలు లేరు.నేను ఆయన్ని కలిసినపుడు ఆ వృద్ధాప్య భారం తో ఒంటరి గానే ఉన్నట్లు అనిపించింది.పనిమనిషి ఒకరు ఉన్నట్లు జ్ఞాపకం.అయితే ఆయన్ని కలవడానికి రచయితలు,పాత్రికేయులు,అభిమానులు ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు.చేతనైనంత వరకు దేశ విదేశాల్లో ఉపన్యాసాలు అవీ ఇస్తుండేవారు.గత నాలుగు నెలల నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. సోషల్ మీడియా లో ఆ వార్తలు బాగా వచ్చేవి.ఎట్టకేలకు మొన్న ఏప్రిల్ లో 27 న ఆయన తన దేహ యాత్ర చాలించారు.

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దివంగత మనోజ్ దాస్ పేరు మీద అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.ఒరియా,ఇంగ్లీష్ భాషల్లో వచ్చే ఉత్తమ సాహిత్యానికి పది లక్షల నగదు ప్రతి కేటాయిస్తారు.సొంత గ్రామమైన శాంఖరి లో మన్మధ్ మనోజ్ మెమోరియల్ లైబ్రరి ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.  

------ Murthy Kvvs (gitika232@gmail.com)

1 comment:

  1. మన తెలుగు వారికి వినోదమూ రాజకీయాలూ తప్ప మరేమీ పట్టవు. ఈవిషయం తెలిసీ వాపోతున్నారే!

    ReplyDelete