Sunday, 13 December 2020

ఒకే ఒక్కరి కోసం పోస్ట్ ఆఫీస్ తెరిచారక్కడ.

 


పట్టణం లో గాని గ్రామం లో గాని పోస్ట్ ఆఫీసు ఉండటం సహజమే గాని కొన్ని వాటి వెనుక మరిచి పోలేని విషయాలు ఉంటాయి.ఇప్పుడంటే సమాచార వ్యవస్థ ఎన్నో రకాలుగా విస్తరించింది గాని ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులు పోషించిన పాత్ర అమోఘం.


ఒకే ఒక వ్యక్తి కోసం పోస్ట్ ఆఫీసు ని తెరిచారు ఒరిస్సా లోని బరి కలామతియ అనే గ్రామం లో,అదీ 1960 ల్లో..!దాని కధాకమామీషు లోకి వెళదాం. కృపాసింధు మొహంతి అనే ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆ రోజుల్లో ఆంగ్లం బోధించేవారు. పర్యవేక్షణ కి వచ్చిన అధికారి విద్యార్థుల్లో సరిగ్గా ప్రగతి లేదని మందలించారట. దానితో కృపా సింధు ఈజీ గా ఆంగ్లం నేర్చుకోవడానికి పుస్తకాల గురించి వెతగ్గా అలాంటివి ఒడియా భాష లో కనిపించలేదు.


దానితో ఆయనే పూనుకుని The common knowledge in English అనే పుస్తకాన్ని అతి సరళ ఒడియా భాష లో రాశాడు.ఈ పుస్తకం ఆదరణ పొందడం తో మరిన్ని రాశాడు.ఇవి ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే రాష్ట్రం నలుమూలల నుంచి ఈయనకి వీటి గురించి ఉత్తరాలు రాసేవారు.కటక్ లోని పబ్లిషర్లని సంప్రదిస్తే ప్రచురించకపోవడం తో తన అయిదు ఎకరాల భూమిని అమ్మి ఈ పుస్తకాల్ని ప్రచురించారు ఆయన.


60 ల తర్వత కొన్ని జెనరేషన్ లు కృప మేస్టారి ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు చదివి ప్రభావితం అయ్యారు.నెలకి ఓ సారి "సమాజ్" అనే దినపత్రిక లో యాడ్ ఇచ్చేవారు.దానితో ఆర్డర్లు నెలకి 2500 దాకా వచ్చేవి.వి.పి.పి. లు పంపడం,మనియార్డర్లు రావడం ఎక్కువ అవడం తో ఆ బరి కలామతియ గ్రామం లో ఈయన అవసరాల నిమిత్తమే ఓ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ తెరిచారు. ఆ కార్యాలయం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కృప మేస్టారు 80 ఏళ్ళు జీవించి 2007 లో మరణించారు.ఇప్పటికీ ఆ మేస్టార్ గారి  ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాల గురించి గత తరాల వారు తలుచుకుంటూ ఉంటారు.     

No comments:

Post a Comment