Sunday, 9 April 2023

ఈ హిల్ స్టేషన్ ప్రత్యేకతే వేరు - కానీ మనవాళ్ళు వెళ్ళేది తక్కువే


ఎంతసేపూ అందరూ వెళ్ళే పర్యాటక ప్రదేశాలేనా,మన దేశం లో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ వాటికి పెద్దగా ప్రాచుర్యం లభించదు. కారణాలు ఏవైనా కావచ్చు.మరి ఇప్పుడు అలాంటి ఓ ప్రదేశం గురించి తెలుసుకుందాం.అది కోరాపుట్ పట్టణం ,దాని పరిసర ప్రదేశాలు.ఒరిస్సా రాష్ట్రం లో ఉన్నది. అయితే విశాఖపట్టణానికి దగ్గర,రైలు ప్రయాణం అయితే అక్కడ నుంచి అయిదు గంటలు పడుతుంది.


సముద్రమట్టానికి రమారమి 3000 అడుగుల పైన ఉన్న ఈ ప్రదేశం మరో కాశ్మీరు మాదిరిగా ఉంటుంది.గొప్ప పర్వత దృశ్యాలు,అడవులు,జలపాతాలు,నదీ ప్రవాహాలు,అటవీ జంతువులు,ఎంతో పురాతమైన ఆదివాసీ తెగలు ఇవన్నీ కలిసి ఓ ప్రత్యేక తరగతి కి చెందిన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాయి.కళ్ళకి విందు చేసే పచ్చదనం,ఎత్తైన గుట్టలు మనోరంజకం గా ఉంటాయి.అంతేకాదు ఇక్కడ కాఫీ పంట కి మంచి గిరాకీ ఉంది.నూరుశాతం అరబిక రకానికి చెందినది.1930 ప్రాంతం లో అప్పటి స్థానిక పాలకుడు రాజా బహదూర్ రామచంద్ర దేవ్   కాఫీ మొక్కల్ని మొట్టమొదటిగా ఇక్కడ నాటారు.

ఇక్కడికి 20 కి.మీ. దూరం లో హిందూస్థాన్ ఏరొనాటిక్స్ లిమిటెడ్ వారి విమానాల ఇంజన్లు తయారుచేసే కర్మాగారం ఉంది. ఇప్పటికీ కోరాపుట్ యొక్క ప్రకృతి దృశ్యాలు నాగరికత కోరలకి బలికాకుండా ఉన్నాయి. మంచి హిల్ స్టేషన్ గా పిలువబడే ఈ ప్రదేశం తన ప్రత్యేక అస్థిత్వాన్ని నిలుపుకొంటున్నది. ఈ చుట్టు పక్కల ఉన్న గుప్తేశ్వర్ ఆలయం,శబర శ్రీక్షేత్రం,కోరాపుట్ మ్యూజియం,కొలాబ డ్యాం, జైన మందిరం వంటి వాటిని తప్పక దర్శించుకోవాలి.     

No comments:

Post a Comment