రస్కిన్ బాండ్..! ఈ పేరు వినగానే చిన్న పిల్లలు ,పెద్ద వాళ్ళు అనే భేదం లేకుండా చదవడం హాబీ గా ఉన్న వారి హృదయాలు ఆహ్లాదం తో పరవశిస్తాయి.ఈయనని ముస్సోరి గ్రాండ్ మేన్ అని పిలుస్తారు.ఎందుకంటే ఈ రచయిత హిమాలయ సానువుల్లోని లాండోర్ అనే ప్రాంతం లో నివసిస్తూంటారు.ఇది ముస్సోరి లో ఓ భాగమే.ప్రతి శుక్రవారం అక్కడ ఉన్న ఓ బుక్ షాప్ లో తన అభిమానుల్ని కలుసుకుంటూంటారు.
87 ఏళ్ళ రస్కిన్ బాండ్ దాదాపుగా 80 కి పైగా పుస్తకాలు రాశారు.కొన్ని వందల కథలు రాశారు.ఆయన రచనల నేపథ్యం అంతా ముస్సోరి దాపుల్లోని గుట్టలు,అడవులు,ప్రకృతి శోభ మీద ఆధారపడిఉంటాయి.అంతే గాక తన అనుభవాల్లోకి వచ్చిన ఇతర విషయాలని కూడా ఆధారభూతంగా తీసుకుంటారు. ఆయన రచనలు ఎన్నో పాఠ్య గ్రంథాల్లో ప్రచురింపబడ్డాయి.
దూర దర్శన్ టి.వి.సీరియల్స్ గా వచ్చాయి.కొన్ని సినిమాలు గానూ రూపొందాయి.ఆయన తల్లిదండ్రులు బ్రిటీష్ జాతీయులు. తండ్రి నాటి బ్రిటీష్ రాజ్ లో చిరు ఉద్యోగి.ఆ తర్వాత రాయల్ నేవీ చేరారు.రస్కిన్ బాండ్ సింలా లోని బిషప్ కాటన్ విద్యాలయం లో చదివారు.కొంత కాలం లండన్ వెళ్ళి చిన్నా చితకా పనులు చేశారు.ఆ తర్వాత భారత్ కి వచ్చి రచనల్నే వృత్తిగా చేసుకొని చేసుకొని జీవించడం మొదలెట్టారు.
పద్మశ్రీ,పద్మభూషణ్ పురస్కారాల్ని పొందారు.ఎంతో సరళమైన ఆంగ్లం లో అందరకీ అర్ధమయ్యే రీతి లో ఉండే ఆయన పుస్తకాలు అమెజాన్ లోనూ ఇంకా ఇతర ప్లాట్ ఫాం ల్లోనూ అందుబాటు లో ఉన్నాయి.ఈ లాక్ డవున్ సమయం లో చిన్నలూ,పెద్దలూ చదవడానికి ప్రయత్నించడి.
No comments:
Post a Comment