Sunday, 3 March 2019

ఇక మాల్గుడి స్టేషన్ కి వెళ్ళి రావచ్చు...!


మాల్గుడి అనే కల్పిత పట్టణం గురించి అందరకీ తెలిసిందే.ఆర్.కె నారాయణ్ నవల ల పుణ్యమాని ఆ పేరు చిర పరిచితం కాగా ,శంకర్ నాగ్ తీసిన మాల్గుడి డేస్ టి.వి. ఎపిసోడ్ ల తో మరింత చేరువ అయింది.అయితే ఇప్పుడు అరసలు అనే కర్నాటక రాష్ట్రం లోని రైల్వెయ్ స్టేషన్ పేరు ని మాల్గుడి రైల్వెయ్ స్టేషన్ గా మార్చబోతున్నారు.ఇందు కోసం రైల్వెయ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.శివ మొగ్గ జిల్లా పరిధి లోని ఈ స్టేషన్ కి ఈ పేరు ని సూచించిన వారు అక్కడి ఎం.పి. రాఘవేంద్ర.రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా రాగానే ఈ అరసలు ని మాల్గుడి రైల్వెయ్ స్టేషన్ గా మారుస్తారు.దీని ముస్తాబు కి గాను 1.3 కోట్లు కేటాయించినట్లు వార్త.

ఇంతకీ ఈ అరసలు కి ఇంత ప్రాముఖ్యత ఏమిటంటే శంకర్ నాగ్ చాలా మాల్గుడి ఎపిసోడ్ లని ఈ ప్రాంతం లోనే తీశాడు.ఈ స్టేషన్ చిన్నది...రోజుకి రెండు రైళ్ళు మాత్రమే వచ్చేవి.ఆ సమయం లోనే కొన్ని సన్నివేశాలు తీసేవారు.ఈ ప్రాంతం అంతా బ్రిటిష్ రోజుల్లో ని ఊరు గా కనిపిస్తుందని దీన్ని ఎంచుకొని శంకర్ నాగ్ రచయిత ఆర్.కె. నారాయణ్ కి చూపించగా ఆయన కూడా ఆనందం గా ఓకె చేశాడు.మరి అంత ప్రత్యేకత ఉన్న ఈ అరసలు ని మాల్గుడి గా మార్చడం లో తప్పు ఏముంది..?ఇక ఎవరైనా ఎంచక్కా ఎవరైనా మాల్గుడి వెళ్ళి రావచ్చు.ఇక ఇది ఎంతమాత్రమూ కల్పిత ప్రదేశం కాదు గదా ..ఏమంటారూ..?

Monday, 11 February 2019

"దంతెవాడ" (కధలు) గురించి యండమూరి అన్న మాటలు నూటికి నూరు పాళ్ళు నిజం..!


విన్నూత్నమైన వస్తువు,దాన్ని చెప్పే పద్ధతి ఈ రెండు విషయాల్లోనూ "దంతెవాడ" కదాసంపుటి ఒక ప్రత్యేకత ని సంతరించుకున్నది.చత్తిస్ ఘడ్ లోని ఆ ఊరి పేరు అందరకీ సుపరిచితమే కాని అక్కడి పరిసరాల్లోని సంఘటనల్ని దీనిలో ఓ కధ లో చిత్రించిన తీరు హృదయాన్ని కదిలించితీరుతుంది.బ్రిటీష్ వారి అవశేషాలు ఉన్న ఒక ఊరి లో గల విశేషాలు స్మృతి కధ లో చక్కగా వర్ణించారు.ఒక కోతి ఏ విధంగా  పాఠశాల వాతావరణాన్ని మార్చినదీ మరో కధ లో  తెలుసుకుంటే అబ్బురపడక మానము.రోడ్డు మీద జంతుప్రాయులు గా సంచరించే ముసలామె కధ వళ్ళు జలదరింప చేస్తుంది.మొత్తం పదకొండు కధలు ఉన్న ఈ సంపుటి చదువరి ని ఎంతమాత్రం నిరాశ పరచదు.ఈ పుస్తకం గురించి కవర్ పేజీ  వెనుక మాట గా  ప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ చెప్పినట్లు నవ్యత ని ఆస్వాదించే ప్రతి ఒక్కరు దీన్ని చదవాలి.

(Rs.80/-   :ప్రతులకు: నవోదయ బుక్ హౌస్,ఆర్య సమాజ్ ముందు వీధి ,కాచి గూడ ,హైదరా బాద్-500027. మొబైల్: 9000413413)

Kinige edition here http://kinige.com/kbook.php?id=9297

Saturday, 29 December 2018

ఆంధ్రా ప్రభుదేవా...ఒడిశా లో...!టి.కృష్ణ మోహన్ రెడ్డి ఒడిశా లోని బరంపురం కుర్రాడు.ఇతను తన ప్రిన్స్ డాన్స్ అకాడమీ ద్వారా ఒక విప్లవమే రేపాడు.తెలుగు వారికి కొదువ ఏముంది అక్కడ.ఒకప్పుడు తెలుగు ప్రాంతమే,కాల మహిమ వల్ల ఆ పట్టణం ఒరిస్సా లో కలిసిపోయింది.ఆ ప్రాంత వాసుల్ని ప్రవాసాంధ్రులు అంటే విజయచంద్ర వంటి కవులు ఒప్పుకోరు గాక ఒప్పుకోరు.ఎప్పుడో మా తాత తండ్రులనుంచి ఇక్కడే ఉన్నాం,పెరిగాం ,ఎక్కడ నుంచీ మేము వలస రాలేదు ..కాకపోతే మా ప్రాంతాన్ని ఒరిస్సా లో కలిపివేయడం వల్ల మేము అలా పిలువబడుతున్నాం..అంతే అంటారు.నేను బరంపురం వెళ్ళి ఆ నేల లో తిరిగిన తర్వాత అది నూటికి నూరు పాళ్ళు నిజమని అనిపించింది.

సరే..ఈ కృష్ణారెడ్డి గా పిలువబడే బరంపురం కుర్రాడి గురించి భుబనేశ్వర్ నుంచి వెలువడే ఓ పత్రిక "మై సిటీ లింక్స్" ఇటీవల రాసింది చదివాక ఇది రాయాలనిపించింది.ఇతను తన జీవిత కధ ని సినిమా గా తీశాడు.అది ఇప్పుడు ఒరిస్సా లో రిలీజ్ అవడానికి తయారు గా ఉంది.ఇంతకీ ఈ యువకుని గొప్పదనం ఏమిటంటే 2009 లో ఓ హిందీ చానల్ లోని " India's Got Talent"  అనే డాన్స్ కాంపిటేషన్ లో పాల్గొని విజేత గా నిలిచి 50లక్షల నగదు,ఆడీ కార్ ని గెలుచుకున్నాడు.ఇతను ట్రూప్ లో 20 మంది ఉంటారు.ప్రిన్స్ డాన్స్ అకాడమీ అనే పేరు తో ఈయన చేసే కృషికి అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందించి 2కోట్ల నగదు సాయం ని,భూరి విరాళం ని ఇచ్చి ప్రోత్సహించాడు.

దానితో కృష్ణా రెడ్డి తన కార్యక్రమాల్ని విస్తరించి ఇతర రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ వంటి చోట్ల కూడా పోటీలో ఫాల్గొని గెలిచాడు.ఇప్పుడు తాను తన కధనే సినిమా గా తీశాడు.ఎన్ని అవాంతరాల్ని ఎదుర్కొని తను సక్సస్ గా నిలిచింది దీనిలో వివరించాడు.దీని కధ, స్క్రీన్ ప్లేయ్,డైరెక్షన్ అన్నీ ఆయనే.ఈ సినిమా పేరు "కృష్ణా ,ద డాన్సర్".రెండున్నర గంటల ఈ సినిమా ఒరిస్సా లో బాగా ఆడి తనకి పేరు ఇంకా ఇనుమడింప చేసందని ఆశిస్తున్నాడు.  

Sunday, 2 December 2018

ఇది ఒక కొత్త అనుభవంగా అభివర్ణిస్తున్నారు.

ఒరిస్సా లోని రఘురాజ్ పూర్ హస్త కళలకు,శిల్ప కళలకు పెట్టింది పేరు.అంతర్జాతీయం గా ఇపుడు అనేకమంది ఈ చిన్న పట్టణానికి వచ్చి ఇక్కడి పట చిత్ర కళ ని ఇంకా ఇతర వాటిని అభ్యసిస్తున్నారు.ఎమ్మా గార్డ్నర్ ఆస్ట్రేలియా కి చెందిన కళాకారిణి.వస్త్రాల మీద వేసే బొమ్మలకి సంబందించిన కళ,పటచిత్ర కళ,తాళపత్ర కళ తనని ఆకర్షించినవని కనుక ఇక్కడకి వచ్చి నేర్చుకుంటున్నట్లు తెలిపారు.ఇటలీ నుంచి గిలియ వయొలంటి వచ్చి ఓ వారం నుంచి కొబ్బరి కాయల మీద,పేపర్ మీద వేసే కొన్ని స్థానిక డిజైన్లను నేర్చుకుంటున్నారు. ఇవి పురాణాలకి సంబందించిన చిత్రాలు ఇంకా ఇతర వాటికి చెందినవి.వివిధ రాళ్ళ నుంచి,ఆకులనుంచి ఇక్కడి కళాకారులు తయారు చేసే సహజ రంగుల మిశ్రమాల గురించి తెలుసుకుంటున్నారు.ఎలియనోరా పేసి ఒక లా స్టూడెంట్ ఇటలీ దేశం లో.ఇక్కడి కళాకారుల జీవన విధానం గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తి గా ఉందని చెపుతున్నారు.ఇది ఒక కొత్త అనుభవంగా అభివర్ణిస్తున్నారు. 

Tuesday, 7 August 2018

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కధలు (పుస్తక పరిచయం)


పెద్దిభొట్ల సుబ్బరామయ్య పేరెన్నిక గన్న తెలుగు కధకులు.నిత్య జీవిత సత్యాలను ఎంతో హృద్యంగా చిత్రించి తనదైన శైలి లో తెలుగు పాఠకులకు అందించారు.ఆయన కధలను ఏరి అరసం సాహిత్య సంస్థ ప్రచురించిన పుస్తకం ఈ పెద్దిభొట్ల సుబ్బరామయ్య కధలు.దీనిలో 12 కధలు ఉన్నాయి.కళ్ళజోడు,అలజడి,దగ్ధ గీతం,సతీ సావిత్రి,కొళందవేలు బొమ్మ,చుక్కమ్మ కధ,ఇంగువ ఇంకా తదితర కధలు.మాన జీవితం లోని విషాద సన్నివేశాలను ఇంకా సమస్యలను అతి సామాన్య శైలి లో మనోరంజకంగా వెలయించారు.సాహిత్య అకాడెమీ గ్రహీత అయిన సుబ్బరామయ్య కధలను ప్రతి అభిరుచి కలిగిన పాఠకుడూ చదవాలి.

పేజీలు:112 ,వెల: రూ.50/-

ప్రతులకు: అభ్యుదయ రచయితల సంఘం,గుంటూరు జిల్లా శాఖ.
101,బృందావన్ పార్క్ రెసిడెన్సి,7వ లేన్,ఎస్.వి.ఎన్.కాలని,గుంటూరు-522006,సెల్:92915 30714  

Sunday, 22 July 2018

బోర్డు తిప్పేసిన మరో సంస్థ...ద హేపీ ఫ్యూచర్ మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ పేరు తో తమిళనాడు ,ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాల్లో బ్రాంచీలు తెరిచిన సంస్థ  తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల బోర్డ్ తిప్పేసినట్లుగా ఈ రోజు పత్రిక ల్లో వెలుగు చూసింది.స్థానిక ప్రముఖుల తో ఓపెనింగ్ లు చేయించి కొన్ని నెలల పాటు ఆఫీస్ లు నడిపిన ఈ సంస్థ తమిళనాడు లోని కోయంబత్తూర్ లో ప్రధాన కార్యాలయాన్ని కలిగిఉంది.నిరుద్యోగులు కూడా ఈ సంస్థ లో ఉద్యోగాలు పొందడానికి పెద్ద మొత్తాలు చెల్లించినట్లు తెలుస్తున్నది.

తమ వెబ్ సైట్ లో అనేక సేవలు అందిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నది.ఎలక్ట్రానిక్స్,సూపర్ మార్కెట్,ఆర్గానిక్ ఉత్పత్తులు ఇంకా ఇతర రంగాల్లో సేవలు అందిస్తున్నట్లు ప్రకటనలు చేసింది. కొత్తగూడెం,ఖమ్మం ఇంకా అనేక చోట్ల ఫిర్యాదులు నమోదు అయినట్లు తెలుస్తున్నది. 

Saturday, 16 June 2018

గాడిదల కి ముప్పు గా మారిన చైనా


ఆఫ్రికా ఖండం లోని 14 దేశాలు ఈ మధ్య తమ దేశాల నుంచి గాడిదలు కనుమరుగయ్యే ప్రమాదాన్ని గుర్తించి వాటి సం రక్షణకి చర్యలు చేపడుతున్నాయి.కెన్యా,బుర్కినా ఫాసో ,ఈజిప్ట్,నైజీరియ వంటి దేశాల నుంచి ఏడాదికి వెయ్యి గాడిదల చొప్పున వాటి చర్మాల నిమిత్తం చంపబడుతున్నాయి.దానికి కారణం ఏమిటో తెలుసా ..! చైనా దేశం లో ఈ గాడిదల చర్మానికి విపరీతమైన డిమాండ్ ఉన్నది.ఈ చర్మం నుంచి తీసిన గెలాటిన్ ని చైనా సంప్రదాయ వైద్యం లో బాగా వాడతారు.దానితో ఆ దేశం లో గాడిదలు చివరకి తక్కువై పోయి ఇతర దేశాల పై ఆధారపడుతున్నారు.ఆఫ్రికా లోని దేశాల్లో ఈ వ్యాపారం ఊపందుకుంది.దానితో వారికి గాడిదలు కరువై వాటి సం రక్షణ కోసం చర్యలు ప్రారంభించారు.Tunza punda wako (నీ గాడిదను దక్షించుకో) అనే స్వాహిలీ భాష లోని స్లోగన్ తో ప్రస్తుతం అక్కడ ఉద్యమం నడుస్తున్నది.