Thursday, 8 December 2022

మధురై నుంచి చిత్తూరు వచ్చిన దేవదాసి కథ

 ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అంటే ఎవరో ఎవరికీ వివరించనవసరం లేదు. శాస్త్రీయ సంగీతం పెద్దగా తెలియనివారికి కూడా ఓహో ఆమె కదూ అంటారు. ఆ ఖంగు మనే గొంతు,మాధుర్యం కలబోసుకున్న త్యాగరాయాది మహామహుల కీర్తనలు గుర్తుకు వస్తాయి.అంతమాత్రమేనా ఐక్యరాజ్యసమితి లోనూ కచేరి ఇచ్చిన ఘనాపాటిగా గౌరవిస్తారు.అలాంటి ఆవిడ జీవితాన్ని గుర్తుకు తెచ్చేలా ఓ గొప్ప నవల ఇటీవల మన తెలుగు లో వచ్చింది. కాకపోతే ఆ పాత్ర పేరు నాగలక్ష్మి ఇంకా ఆమె భర్త పేరు విశ్వనాథన్. ఇంకా ఎన్నో పాత్రలు. ఆ పాత్రలన్నీ చెబుతూండగా ఆ విన్నూత్న తరహా నవల నాలుగువందల పైచిలుకు పేజీల్లో సాగిపోతుంది. "ఆటా " వారు నిర్వహించిన నవలల పోటీల్లో బహుమతిబహుమతి ని కూడా గెల్చుకున్నది.

వదాసీ వ్యవస్థ యొక్క నిజమైన స్వరూపాన్ని కళ్ళముందు చూపెడుతూ అనేక వందల ఏళ్ళ నుంచి వారు ఏ విధంగా సంగీత నృత్యాల్ని కాపాడుకుంటూ వచ్చినదీ ,కాలమహిమ వల్ల వారి వైభవం ఎలా అడుగంటిందీ ఎలా ఒడిదుడుకుల్ని అవమానాల్ని భరించి ముందుకు సాగినదీ ఈ నవల మనకి తెలియబరుస్తుంది. ఇంతకీ ఆ నవల పేరు "మనోధర్మపరాగం" , దీన్ని రాసినవారు మధురాంతకం నరేంద్ర.ఇప్పటికే ఆయన పేరెన్నిక రచయిత అయినప్పటికీ ఈ నవల ద్వారా ఆయన మరో కోణం ని పాఠకులు దర్శిస్తారు.కథ అంతా తమిళనాడు లోని మధురై ఇంకా చెన్నపట్నం లో సాగుతుంది.అలాగే మన చిత్తూరు లో కూడా కొంత భాగం నడుస్తుంది.

గతించిన చరిత్ర లో పేరున్న కులాలు తమ వైభవాన్ని తెలిపే ఎన్నో పుస్తకాలు రాసుకున్నారు.కాని దేవదాసి వ్యవస్థ లో వారికి ఏమాత్రం తీసిపోని ధనవంతులు అయిన స్త్రీలు ఏ విధంగా లలితకళల్ని పోషించారు ఇంకా ఏ విధంగా తమ మాట ని చెల్లించుకుని తమ జీవనాన్ని సాగించారు అనేది ఈ నవల విశదపరుస్తుంది.సమాజం లో వారికి గల హోదా ఏ విధంగా విచ్చిన్నమవుతూ దిగజారిపోయిందీ మనం తెలుసుకోవచ్చు.ఈ నవల లోని నాగలక్ష్మి పాత్ర ప్రఖ్యాత గాయని ఎం.ఎస్ సుబ్బులక్ష్మి ని పోలి ఉంది.ఒక రకంగా కాదు,అనేక రకాలుగా.సామాజిక మార్పులు ఎలా చరిత్ర ని మరుగుపరుస్తాయి అనేది కూడా మనం గమనించవచ్చు.అభిరుచి గల ప్రతి పఠిత తప్పక చదవవలసిన నవల ఈ మనోధర్మపరాగం.

(లభ్యస్థానం: అన్నీ ప్రముఖ పుస్తక కేంద్రాలు, అమెజాన్ తో పాటు.  వెల:రూ.375/-)  

----- NewsPost Desk

No comments:

Post a Comment