Sunday 13 November 2022

City of God - ఒక పోర్చుగీస్ సినిమా

 "సిటీ ఆఫ్ గాడ్ " పోర్చుగీస్ సినిమా. కాని ఆంగ్లం లో సబ్ టైటిల్స్ ఉండటం వల్ల హాయిగా చూడవచ్చు. నిజానికి ఇది భీభత్స రసం నింపుకున్న చిత్రం. ప్రపంచ సినీ చరిత్ర లో పేరెన్నిక గన్న సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. 2002 లో బ్రెజిల్ లోనూ,2003 లో ప్రపంచం అంతటా విడుదల అయింది. పోర్చుగీస్ భాష లో Cida de deus అనే పేరు తో రిలీజ్ అయింది.

1997 లో ఇదే పేరు తో Paulo lins అనే రచయిత రాసిన నవల ఆధారం గా నిర్మించారు.దానికి కొన్ని నిజమైన విషయాల్ని ఆ రోజుల్లో జరిగిన సంఘటన ల నుంచి తీసుకుని జోడించారు.రియో డి జనేరో నగరం లో ఉన్న ఓ శివారు ప్రాంతం ఫావెల దగ్గర దీన్ని ఎక్కువగా చిత్రించారు.డ్రగ్ మాఫియా అనేది యువకుల్ని ఇంకా చిన్న పిల్లల్ని ఎలా ఉపయోగించుకున్నదీ ,దానికి వాళ్ళు ఎలా బలి అయిందీ కళ్ళ కి కట్టినట్లు చూపించారు.

నటీ నటులు చాలామంది ని స్థానికంగా ఉన్నవారినుంచే తీసుకున్నారు.ఆ తర్వాత వారికి కొన్ని రోజులు తర్ఫీదు ఇచ్చారు.అందుకే సినిమా చాలా సహజం గా జరుగుతున్నట్లుగా ఉంటుంది.సినిమా మొదలు కావడమే ఓ కోడిని తరుముతూ మొదలు అవుతుంది.ఆ కాలనీలు,నల్ల వాళ్ళ స్థితిగతులు ,దారిద్ర్యం,పిస్తోళ్ళు సంతలో దొరికినట్లు అందుబాటు లోకి రావడం Alexandre Rodrigues  ఇంకా Knockout Ned గ్యాంగ్ ల మధ్య పోరాటాలు వళ్ళు గగుర్పాటు కలిగిస్తాయి.     

మరి దక్షిణ అమెరికా ఖండం లో ఉన్న బ్రెజిల్ దేశం లో తెల్లవాళ్ళు,పసుపు వర్ణం వారు,నల్ల జాతీయులు కూడా ఉంటారని మనకి తెలిసిందే.అక్కడ కి పోర్చుగీస్ వాళ్ళ తో నల్ల వారికి జరిగిన సాంకర్యం,వాళ్ళ సంతానం అదంతా ఇంకో పెద్ద కథ అనుకోండి.కాని ఆ నేపథ్యం తెలిసిన వారు ఈ సినిమా ని ఇంకో కోణం లో కూడా చూడగలరు.ఈ గ్యాంగ్ లో ఉన్న ఓ యువకుని కి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం.దాన్ని ఓ పత్రిక వారు ఉపయోగించుకుంటారు.దానితో తన జీవితం మారిపోతుంది. అతనే ఈ సినిమా నే మనకి చెబుతున్నట్లు తీశారు.

దర్శకత్వానికి,స్క్రీన్ ప్లే కి,ఫోటోగ్రఫీ కి ఇలా నాలుగు విభాగాల్లో అస్కార్ కి నామినేట్ చేయబడింది. ఏది ఏమైనా Fernando Meirilles దర్శకునిగా ఈ సినిమా ద్వారా గుర్తింపు పొందాడు.అలాగే డ్రగ్ మాఫియా కోణాన్ని రియో నగరం లో సరికొత్త గా జనానికి పరిచయం చేశారు.తుపాకి సౌండ్లు,డైలాగ్స్ తప్ప మామూలు సన్నివేశాల్లో ఎక్కడా బ్యాక్ డ్రాప్ సంగీతం పేరు మీద రొద పెద్దగా ఉండదు.అయితే ఒక "రా" అనుభవం కావాలంటే ఈ సినిమా చూసితీరవలసిందే.  

----- NewsPost Desk

Saturday 29 October 2022

Titanic సినిమా - ఓ పరిశీలన


 Titanic అనే హాలీవుడ్ సినిమా ఎంత సంచలనం రేపి ప్రపంచం లోని అనేక దేశాల్లో సినిమా ప్రియుల్ని అలరించిందో మనకి అందరికి తెలుసు.ప్రేమ కథా చిత్రాలకి ఎప్పటికి ఎదురుండదు,కాకపోతే దాంట్లో పడే పాళ్ళు సరిగ్గా పడాలి అంతే. అప్పుడు ఆర్టిస్ట్లు ఏ దేశాం వాళ్ళు,ఏ భాషలో తీశారు అనేది కూడా ఆలోచించరు జనాలు.దానికి సరైన ఉదాహరణ ఈ టైటానిక్ సినిమా నే అని చెప్పాలి. 1997 లో రిలీజ్ అయిన ఈ ఇంగ్లీష్ సినిమా ఇప్పటికీ ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది. అమెరికా లోని నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ లో కూడా చోటు చేసుకుంది.

1912 వ సంవత్సరం లో సంభవించిన ఒక షిప్ రెక్, ఎంత పాపులర్ అంశమో అందరికీ తెలుసు. ఐస్ బెర్గ్ కి గుద్దుకుని మునిగిపోయిన టైటానిక్ ఓడ లోని ప్రయాణీకుల మనో భావాల్ని ఎంతో చక్కగా ఊహించి ఈ సినిమా దర్శకుడు జేంస్ కామెరున్ సినిమా గా రూపొందించడం ఒక గొప్ప అనుభూతిని అందించింది ప్రేక్షకులకి. ఒక రకంగా వాళ్ళ లోకి పరకాయ ప్రవేశం చేశాడు అని చెప్పాలి. ఓడ ప్రమాదం నుంచి బయటపడి,ముసలితనం లో ఉన్న కొందరిని ఈ దర్శకుడు కలిసి స్కెచ్ తయారుచేసుకున్నాడు.

దానికి మంచి ప్రేమ కథని జోడించాడు.అది కూడా చాలా సహజం గా ఓడ ప్రయాణం లో సాగిపోతూంటుంది. జాక్ డాసన్,రోస్ అనే ప్రధాన పాత్రలు అవి. అప్పటికే ఎంగేజ్మెంట్ ఐంది విలన్ తో,ఈ ప్రయాణం లో హీరో కలవడం.విలన్ ఊరకనే ఉంటాడా...అతని ప్రయత్నాలు అతనివి.టికెట్ కి లాటరి కొట్టి చివరి క్లాస్ లో ఉండే హీరో మరి హీరొయిన్ ని ఎలా ప్రేమ లో దించాడు..ఆ తర్వాత ఓడ ఐస్ బెర్గ్ కి గుద్దుకోవడం ...చావు అంచుల్లోకి నెట్టబడ్డ ప్రయాణీకుల వ్యథలు,గాథలు మనల్ని ఎక్కడికో తీసుకుపోతాయి.    

ముఖ్యంగా ఓడ లోని ఇంటీరియర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆనాటి రోజుల్లోకి మనల్ని తీసుకుపోతాయి.ఆ గ్రాండ్ స్టైర్ కేస్ చాలా ప్రత్యేకం గా నిలిచిపోతుంది.ఓడ ని తయారు చేయడం లో ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు.ఆ నైపుణ్యం అంతా సినిమా తెర పై కనిపిస్తుంది.సినిమా మొత్తాన్ని ,ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓ ముసలామె చెబుతూంటుంది.ఆ రోజుల్లో తను యవ్వనం లోని రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ సినిమా ని నడిపిస్తుంది. 200 మిలియన్ డాలర్ లతో తీసిన ఈ చిత్రం రెండువేల మిలియన్ డాలర్ల కి పైగా వసూలు చేసింది.11 అస్కార్ అవార్డ్ ల్ని పొందింది.

చిత్రం లోని సంగీతం అలరిస్తుంది.థీం మ్యూజిక్ ప్రతి చోటా వినిపించేది.ఈ ఓడ లోని ఇంటీరియర్స్ ని తయారు చేసిన మెక్సికో ,బ్రిటన్ కళాకారులు అభినందనీయులు.పీటర్ లేమంట్ వారి నాయకుడు.లియోనార్డో డీకాప్రియో కి,కేట్ విన్స్లెట్ కి గొప్ప పేరుని తెచ్చింది.అనేక భాషల్లోకి డబ్బింగ్ ఐ కనక వర్షం కురిపించింది.  

----- NewsPost Desk

Tuesday 18 October 2022

"కాంతార" సినిమా - ఓ అభిప్రాయం


 కాంతార సినిమా చూసిన తర్వాత కొన్ని విషయాలు తప్పక రాయాలనిపించింది. అసలు ఈ సినిమా పేరేమిటి కన్నడం లా ఉంది అన్నవారూ ఉన్నారు. నిజానికి ఈ పదం సంస్కృత పదం. కాళిదాస మహాకవి అలనాడు అమ్మవారిని స్తుతిస్తూ కాంతార వాస ప్రియే అని గదా అనింది. అంటే అరణ్యం లో నివసించడాన్ని కాళీ మాత ఇష్టపడుతుందట. ఆహా ఎంత చక్కని వర్ణన.

మళ్ళీ అలాంటి చక్కని టైటిల్ తో ఒక చక్కని సినిమాని తీశారు కన్నడ సోదరులు. రిషబ్ శెట్టి రచన,దర్శకత్వం చేసి హీరో గా కూడా నటించి మొత్తం ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నాడు. తుళునాడు లో ఉన్న గ్రామ దేవత ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చాటాడు అని చెప్పాలి.లేకపోతే అంతకు ముందు మనలో ఎంతమందికి తెలుసు..? భూత కోల అనే ఓ నాట్యం ఉందని,వరాహ వదనం తో ఉన్న  తొడుగు ని మొహానికి ధరించి,ఇంకా రకరకాల వస్త్రాల్ని,భయానకమైన ఆహార్యం తో మేళవించి మరణించిన పెద్దల్ని ఆహ్వానించే తంతు ఒకటి ఉందని ,ఆ మనిషి లోకి ఆత్మ చొరబడి ఇవన్నీ చేస్తుందని...ఇలాంటి నమ్మకాలతో జీవించే కొన్ని కులాలు ఉన్నాని ఎంత మందికి తెలుసు..?

ఎన్నో అద్భుతమైన స్థానిక ఆచారాలు,వ్యవహారాలు భారతీయ సమాజం లో ఉన్నాయి.వీటికి నవీన ఆలోచనలు రంగరించి నేటి తరానికి అందించవచ్చు. మేజిక్ రియలిజం అనే సాహిత్య ప్రక్రియ లో ఇలా ఒక కాలం నుంచి మరో కాలం లోకి చదువరిని తీసుకెళ్ళే విధానం ఉన్నది.అది ఇతర దేశాల్లో విజయవంతం గా చేశారు.అయితే ఈ మధ్య కాలం లో ఎవరూ ఇలా మన దేశం లో చేయలేదు. అందుకే ఈ సినిమా లోకల్ గా తీసినప్పటికీ పేన్ ఇండియా సినిమా ఐంది.

జానపదుల దేవుణ్ణి,నమ్మకాల్ని,మానసిక స్థయిర్యాన్ని ఈ కాంతార సినిమా సరికొత్త గా చూపించింది. కథ ని రాసుకున్న విధానం బాగుంది.అడవి ని రక్షించడానికి అనే పేరు మీద అటవీ అధికారి కి,హీరో శివణ్ణ కి జరిగిన ఈగో క్లాష్ ఈ సినిమా. దానికి భూత కోల నేపథ్యాన్ని అద్ది కథ కి మరింత వన్నె తెచ్చాడు రిషబ్ శెట్టి. 

కొన్ని తరాల క్రితం కోల్పోయిన అటవీభూమిని వెనక్కి తీసుకోడానికి ఈ తరపు భూస్వామి ఆడే ఆట లో అక్కడి పేదప్రజలు సమిధలు అవబోతుండగా అడ్డుకొని ఆపినవాడే హీరో , ఆ హీరోయిజం  వెనక ఉన్న చోదకశక్తి మాత్రం ఆ గ్రామదేవత నే అంటే అతిశయోక్తి కాదు. అడవి లో అరుపులు వినబడటం,హీరో జైలు లో ఉన్నప్పుడు గురవా ఆత్మ మూలుగుతూ కనబడటం వళ్ళు జలదరింపజేస్తుంది. అంతే కాదు చివర లో హీరో భూత కోల నాట్యం చేయడం, అడవి లో కి వెళ్ళిపోవడం ఆ సన్నివేశాలన్నీ హృదయం లో తడి ఉన్న ప్రతి ప్రేక్షకుడిని కన్నీరు పెట్టిస్తాయి. అంత చక్కగా రసోన్మాదాన్ని కలిగించాడు రిషబ్ శెట్టి.

సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్, కెమెరా పనితనం తో అలరించిన అరవింద్ ఎస్ కాశ్యప్ ఎంతైన అభినందనీయులు. ఈ సినిమా నార్త్ లో కూడా బాగా ఆడుతోంది.వాళ్ళ గ్రామ దేవతల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఈ సినిమా ని పొగుడుతున్నారు.ఒక సినిమా ని మనసు పెట్టి ,స్థానిక వస్తువు తో తీసినా దానిలో గనక కదిలించే దమ్ముంటే ఎల్లలు దాటి ఎక్కడకో వెళ్ళి అందర్నీ అలరిస్తుంది.ఆటోమేటిక్ గా పేన్ ఇండియా అవుతుంది,దానికి మించి కూడా అవుతుంది.ఆ సత్యాన్ని నిరూపించింది ఈ కాంతార సినిమా. 

----- NewsPost Desk

Wednesday 5 October 2022

పొన్నియన్ సెల్వన్ సినిమా - ఓ అభిప్రాయం

పొన్నియన్ సెల్వన్ సినిమా సూపర్ హిట్ అంటున్నారు తమిళులు.మా చరిత్ర ని చక్కగా తెరకెక్కించాడు మణిరత్నం అని వాళ్ళ అభిప్రాయం.ఆ సినిమా చాలా గందరగోళం గా ఉంది,ఆ పాత్రల పేర్లు ఏవీ గుర్తుకి రావడం లేదు, పెద్ద లేవిష్ గా లేదు అంటున్నారు కొందరు తెలుగు వాళ్ళు.మీరు కల్కి కృష్ణమూర్తి నవల చదివితే ఆ మాట అనరు,కథ బాగా తెరకెక్కించాడు అంటున్నారు ఇంకొందరు.ఇంతకీ ఏది నిజం.అన్ని మాటల్లోనూ కొంత నిజం లేకపోలేదు.కొంత అతిశయోక్తీ లేకపోలేదు.

అసలు ఆ సినిమా టైటిల్ నే పక్కా తమిళ వాసన.అలా ఉండకూడదని ఏమీ లేదు.కాని మా చరిత్ర నే గొప్ప అనే మాట మాత్రం కూడనిది.పైగా వాళ్ళ నేటివిటీ ని మనం అందరం ఆమోదించాలి అనడం కొద్దిగా అతి కాకపోతే ఏమిటి..?చోళులు మనకి మరీ తెలియని వాళ్ళు ఏమీ కాదు.అటు కళింగం నుంచి కింద లంక దాకా జైత్ర యాత్ర చేసిన వాళ్ళే.ఇప్పటి రాష్ట్రాల సరిహద్దులు కావుగా అప్పటివి.

సినిమా లో పెద్దాయన సుందర చోళుడు (ప్రకాష్ రాజ్) అనారోగ్యం తో ఉంటాడు.ఇదే అదనుగా ఆయన సామంతులు ఆ రాజ్య ఆర్దికశాఖాధికారి పెరియ పళువెట్టరాయర్ సాయం తో రాజ్యాన్ని మధురాంత చోళునికి కట్టబెట్టాలని కుట్ర చేస్తుంటారు.సుందర చోళుని కుమారులు ఇద్దరు,ఒకరు ఆదిత్య కరికాళుడు (విక్రం) కాగా ,రెండవ వాడు అరుళ్ మొళి వర్మ (జయం రవి) ,అరుళ్ మొళి వర్మ నే ఆ తర్వాత ఒకటవ రాజరాజచోళునిగా ప్రసిద్ధి చెందాడు. 

బృహదీశ్వర ఆలయాన్ని కట్టించి చిరస్మరణీయుడయ్యాడు. కుందవై పాత్ర చాలా సూక్ష్మరీతి లో సామంతుల మధ్య సోదరుని పెళ్ళి ని ప్రస్తావించి వాళ్ళలో విభేదాలు కల్పించడం లాంటివి మన తెలుగు వాళ్ళకి ఆనవు.పెద్ద పెద్ద డైలాగులు చెబుతూ సవాళ్ళు విసురుకుంటూ లౌడ్ గా చెప్తే తప్పా మన జనాలకి మజా అనిపించదు.కాని తమిళులు అలాంటి వాటిని కూడా బాగా ఆదరిస్తారు.అదే తేడా.పైగా వాళ్ళకి ఉండే ఎమోషనల్ బాండ్ చోళులతో మిగతా వాళ్ళకి ఉండదు అది కూడా ఓ కారణం.

చిత్ర0 లో ఆదిత్య కరికాళుడు,లంక లో అరుళ్ మొళి జైత్ర యాత్ర లపై ఉంటారు.ఇదంతా తంజావూర్ లో జరుగుతూంటుంది.నందిని పాత్ర చరిత్ర లో లేని పాత్ర అని కల్కి సృష్టించిందని అంటారు.కుటుంబం లోనూ,రాజ్యం లోని సామాంతుల మధ్యలోనూ అధికారం కోసం పెనుగులాట ఇంకా కుట్ర ల్లాంటివి సహజం.వాటినే ఈ సినిమా లో చూపించదలుచుకున్నారు.పైగా తమిళ చరిత్ర అనే ఎమోషనల్ టచ్ ఎలాగూ ఉంది.

బాహుబలి తో ఈ సినిమా ని పోల్చడం మతిలేనిపని.స్వకపోలజనితమైన కథని ఎటునుంచి ఎటైనా మలచవచ్చు.ఏదైనా చెప్పవచ్చు.కాని చరిత్ర ని సినిమా గా తీసేటప్పుడు ఇష్టం వచ్చిన మలుపులు తీసుకుంటా అంటే కుదరదు.అందుకే ఉన్నంతలో మణిరత్నం ఎక్కడ వీలుంటే అక్కడ అవసరం ఉన్నంతవరకు మాత్రమే లేవిష్నెస్ చూపించాడు తప్పా మరోలా వెళ్ళలేదు.అసలు పిచ్చి గాని కథ కి ఉపయోగపడని పటాటోపం ఎందుకు, షో పుటప్ తప్పా.

రెహమాన్ సంగీతం ఫర్వాలేదు.బహుశా తమిళ్ లో పాటలు బాగా వచ్చాఏమో గాని తెలుగు లో గుర్తున్న పాట గా ఏదీ మిగలదు. డైలాగ్స్ లో కొన్నిచోట్ల మెరుపులు ఉన్నాయి.సెట్స్ తో పాటుగా సహజ వాతావరణాన్ని కూడా చక్కగా వాడుకున్నారు.ఓడల్లో సన్నివేశాలు,పోరాటాలు బాగున్నాయి.నటీనటులందరూ ఎవరి పాత్రని వారు బాగా పోషించారు.   

----- News Post Desk


Tuesday 27 September 2022

Seven Samurai ఎందుకని ఓ సినిమా కళాఖండమైంది..?


Seven Samurai సినిమా ని ఎప్పటినుంచో చూద్దామని ఉన్నా ఇన్నాళ్ళకి నెరవేరింది.1954 లో రిలీజ్ అయిన ఆ సినిమా ప్రపంచం లోని అతి గొప్ప సినిమాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అకిరా కురసోవ దర్శకత్వం మాత్రమే గాక,ఎడిటింగ్ ఇంకా సహాయ రచన కూడా చేశారు.రమారమి ఓ డబ్భై ఏళ్ళ క్రితం తీసిన సినిమా ఈరోజు కి కూడా ఎలాంటి బోర్ కొట్టలేదు.అంత గా లీనమై పోయాను. జపాన్ వాళ్ళ గ్రామీణ పరిస్థితులు,వాళ్ళ నమ్మకాలు,అక్కడి అందమైన దృశాలు మనల్ని మైమరిపిస్తాయి.అంతేకాదు,ఎన్నో విజయవంతమైన సినిమాల్ని మన భారతీయ దర్శకులు ఈ సినిమా ఇచ్చిన ప్రేరణ వల్లనే తీసి ఉంటారు అనిపిస్తుంది.ముఖ్యంగా షోలే సినిమా. కొన్ని పాత్రలు ప్రవర్తించే తీరు,గ్రామీణ నేపథ్యాన్ని హృద్యం గా చూపించిన తీరు ఇంకో లోకానికి తీసుకుపోతుంది.

సినిమా కథ 16 వ శతాబ్దం లో ఓ గ్రామం లో జరుగుతూంటుంది.40 మంది బందిపోట్లు ఈ గ్రామం మీద దాడి చేసి పండిన బార్లీ పంటని దోచుకోవాలని ప్రణాళిక వేస్తుంది.కాపాడుకోవాలంటే సమురాయ్ అనబడే యుద్ధవీరుల్ని కాపలా పెట్టుకోకతప్పదు.కాని వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈ పేద రైతులకి ఉండదు. ఎలా..అప్పుడు గిసాకు అనే పెద్దాయన ఆకలితో ఉన్న సమురాయ్ ల్ని వెతికి పట్టుకుందాం.వాళ్ళని ఉపయోగించుకుందాం ,ఎంతో కొంత వాళ్ళకి అన్నం పెట్టి మనం బార్లీ తో కాలం గడుపుదాం అంటాడు.మొత్తానికి రోనిన్ సమురాయ్ ని ఒప్పిస్తారు.అతను తన పాత మిత్రుల్ని కలుపుకొని గ్రామానికి వస్తాడు.వచ్చిన వెంటనే ఊరు మొత్తాన్ని పరిశీలించి ఎవరెవరు ఎక్కడ ఉండాలి,ఏ వైపు నుంచి తిప్పి కొట్టాలి అనేది ప్లాన్ గీస్తాడు.    

యుద్ధం అనేది సామూహికం గా జరిగేది,ఒక్కొకరికి కొంతమంది యువకుల్ని ఇంకా పోరాడగలిగే వ్యక్తుల్ని అప్పజెబుతాడు.వాళ్ళకి యుద్ధ విద్యల్లో తర్ఫీదు ఇస్తారు ఈ సమురాయ్ లు.మొదట జనాలు వీళ్ళని నమ్మకపోయినా ఆ తర్వాత ఈ సమురాయ్ ల చిత్తశుద్ధి కి అభిమానులయి వాళ్ళ మాట వింటారు.కందకాలు తవ్వడం,వాళ్ళకి అనుకూలంగా ఉండేలా ఊరిని తీర్చిదిద్దడం చాలా గొప్పగా ఉంటుంది.వ్యాహాలన్నీ నేల విడిచి సాము చేయవు.సహజం గా ఉంటాయి.ముఖ్యంగా లైటింగ్ ని,గాలిని,అగ్ని ని ఉపయోగించుకున్న తీరు అద్భుతం.రాత్రి పూట నెగళ్ళు వేసుకుని ఎదురుచూడటం,కొంతమంది సమురాయ్ లు చనిపోయినపుడు,గాలి మంద్రం గా దుమ్ము రేపుతూ అటు నించి ఇటు తిరగడం ఇలాంటి సింబాలిజం లు ఎంతో ఈస్థటిక్ సెన్స్ ఉన్న దర్శకులే చేయగలరు.యుద్ధ సన్నివేశాలు కూడా ఎక్కడా బోరు కొట్టవు.ఒక్కమాట చెప్పాలంటే ఆ గ్రామం లోకి మనమే వెళ్ళిపోయిన అనుభూతి కలుగుతుంది.

ఇంత యుద్ధ భీభత్సం నిండిన సినిమా లోనూ అంతర్లీనంగా అదీ ఎంతో కంపాక్ట్ గా ఓ ప్రేమ కథ నడుస్తుంది. యువ సమురాయ్ ని ప్రేమించిన ఆ షినో కి చివరకి నిరాశే మిగులుతుంది.రాత్రి పూట పడుకున్నప్పుడు గుడిసె పక్కన పారే కాలవ శబ్దం మనల్ని ఎక్కడికో తీసుకువెళుతుంది.డైలాగ్స్ కూడా చాలా అర్ధవంతం గా ఉండి,శృతి మించి లేవు. జపాన్ వాళ్ళ గ్రామీణ విశ్వాసాలు ఇంచుమించు మనలాగే ఉన్నాయి.షోలే సినిమా చూసినపుడు ఇంత నేటివిటి నిండిన గ్రామాన్ని ఎలా సృష్టించారబ్బా అనుకునేవాడిని.దానికి ఇన్స్పిరేషన్ ఈ సినిమా లోని గ్రామమే..!సంగీతం బాగుంది.క్యోజో కత్తి విద్య సమురాయ్ ల గౌరవాన్ని పెంచేదిలా ఉంది.కికుచియొ పాత్ర తిక్క తిక్క గా ప్రవర్తిస్తూనే తన దళం తో కలిసి పోరాడుతాడు.ప్రతి పాత్ర ఒక సైకలాజికల్ డెప్త్ ని కలిగిఉంటుంది.అది బాగా పరిశీలిస్తే అవగతమవుతుంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా చూడవలసిన సినిమా. 

--- News Post desk

Sunday 28 August 2022

హ్యాకర్ల విషయం లో చైనా యే దిట్ట.

                                           (Google Pic)

 తెల్లారి లేచింది మొదలు మన జీవితాలు ఇంటర్ నెట్ తో ముడిపడిఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రతి రోజు ఏదో సైబర్ నేరం గురించి చదవడం మనకి నిత్యకృత్యమై పోయింది. కాని అసలు నేరస్థులు దొరకడం ఇప్పటికీ గగనం గానే ఉంది.చాలా కేసుల్లో ఆనూపానూ దొరకడం లేదు.దానికి కారణం సైబర్ నేరస్థులు లేదా హ్యాకర్లు అందాం,ఇతర దేశాల్లో ఉండటం వల్ల అంతర్జాతీయ వ్యవస్థల సహకారం లేనిదే దొరకడం కష్టమైపోతున్నదని మనం చదువుతున్నాం.

ప్రపంచం లోనే ఎక్కువ హ్యాకర్లు ఉన్న దేశం చైనా అని సర్వే వివరాలు తెలుపుతున్నాయి.అంతేకాదు,సైబర్ నిఘా పెట్టడం లో కూడా చైనా ముందు వరుస లో ఉన్నది.ఆ తర్వాత రష్యా,అమెరికా లు ఉన్నాయి.అలాగే సైబర్ నేరగాళ్ళ వల్ల ఎక్కువ మొత్తం లో నష్టపోతున్న దేశం కూడా చైనా దేశమే.ఏడాదికి 66.3 బిలియన్ డాలర్లని కోల్పోతున్నదట.ఆ తర్వాత స్థానాల్లో బ్రెజిల్,అమెరికా,ఇండియా ఉన్నాయి.

సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా పెద్ద ఎత్తున ధనాన్ని సులభం గా సంపాదించడానికి ఈ మార్గం ఎన్నుకుంటారు.బ్యాంక్ లు,కేసినోలు,ఆర్ధిక వాణిజ్య సంస్థలు ఇంకా వ్యక్తుల్ని కూడా తమ టార్గెట్ గా పెట్టుకుంటారు.మనదేశం లో ఆన్ లైన్ నేరాలు చేయడం లో జాంతార అనే జిల్లా లోని కర్మ తండ్ అనే చిన్న పట్టణం ముందు వరుస లో ఉంది.ఇంకా వింతైన విషయం ఏమిటంటే ఎంతో వెనుకబడిన రాష్ట్రం గా చెప్పుకునే జార్ఖండ్ లో ఈ జిల్లా ఉంది.  

19 వ శతాబ్దం లో,సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఈ ప్రాంతం లోని వెనుకబడిన వర్గాల బాలికల విద్య కోసం ఎంతో కృషిచేశాడు. ఈ జార్ఖండ్ లోని సైబర్ గ్యాంగ్ లు ఓటిపి ఫ్రాడ్ లు చేయడం లో ఇంకా డెబిట్,క్రెడిట్ కార్డులతో మోసం చేయడం,ఇంకా అమాయక జనాల్ని నమ్మించి మోసం చేయడం లో సిద్ధహస్తులు.2020 లో ఎక్కువ గా సైబర్ నేరస్థుల బారినపడింది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం.11 వేల కేసులు నమోదు అయ్యాయి.ఆ తర్వాత బెంగుళూరు,హైదరా బాద్,ముంబాయి,ఘజియా బాద్ లలో నమోదు అయ్యాయి.

2021 లో మొట్టమొదటి సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ బెంగుళూరు లో స్థాపించారు.అయితే సైబర్ పోలీస్ స్టేషన్ ని ప్రతి జిల్లా లోనూ పెట్టి,ఒక ప్రత్యేక శాఖ గా పరిగణించిన రాష్ట్రం గా మహారాష్ట్ర ని చెప్పాలి.మొట్టమొదటి సైబర్ క్రైం మన దేశం లో 1992 లో నమోదయింది. అతగాడి పేరు ఆకాష్ అరోరా ,అతను పోలీ మర్ఫిక్ అనే వైరస్ ని ప్రవేశపెట్టాడు. ఇప్పటిదాకా మన దేశం లో 6,74,021 సైబర్ అటాక్స్ జరిగాయి.అంటే ప్రతిరోజు 3,700 అటాక్ లు జరుగుతున్నాయి.

సైబర్ సెక్యూరిటీ విషయం లో అగ్ర స్థానం లో ఉన్న దేశం డెన్మార్క్ అని తేల్చారు.సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పోస్యూర్ ఇండెక్స్ లో 8.91 స్కోర్  తెచ్చుకొని నంబర్ వన్ గా నిలిచింది.సాధ్యమైనంతవరకు బలమైన పాస్ వర్డ్ లు వాడటం,బయట ప్రదేశాల్లో నెట్ ని వాడకుండా ఉండటం,ఫిషింగ్ మాల్ వేర్ ని పంపే లింక్ ల్ని ఓపెన్ చేయకుండా ఉండటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చేయడం మంచిది.         

---- NewsPost Network

    

Wednesday 3 August 2022

ఇంత పురాతన శిల్ప సంపద అంతర్జాతీయ మార్కెట్ లోకి వెళుతోందా..?

భారత దేశం పురాతన శిల్పాలకి,కళా రూపాలకి పెట్టింది పేరు. ఇత్తడి తోనూ,రాతి తోనూ ఇంకా ఇతర లోహాల తోనూ చేసిన అనేక శిల్పాలు అంతర్జాతీయ విపణి వీధి లోకి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ కాబడుతున్నాయి.1950 నుంచి ఇప్పటి దాకా10,000 ల నుంచి 20,000 ల పురాతన శిల్పాలు దేశం దాటించబడ్డాయని ఒక పరిశోధన తేల్చింది. 2010 నుంచి 2012 మధ్య కాలం లొనే రమారమి 15000 పురావస్తువులు స్మగ్లర్లు బారిన పడి దేశాన్ని దాటాయి.

ఒక్క తమిళనాడు నుంచే 12000 ల శిల్పాలు ఈ లిస్టు లో చేరాయి.కఠినమైన చట్టాలు కూడా లేకపోవడం కూడా స్మగ్లర్లకి కలిసివస్తున్నది.హెరిటేజ్ తెఫ్ట్ IPC370 అనే ఒక్క చట్టమే ఈ విలువైన వస్తువుల్ని బయటకి పంపించేవారిపై ప్రయోగిస్తున్నారు.అమెరికా ఇలాంటి వస్తువుల్ని సేకరించడం లో,మార్కెటింగ్ లో ముందు వరుసలో ఉండగా ఆ తర్వాత యు.కె. రెండవ స్థానం లో ఉంది.ప్రస్తుతం ఆస్ట్రేలియా కూడా పెద్ద మార్కెట్ గా ఉన్నది.

పోయిన పురాతన శిల్ప సంపదని సమ్రక్షించుకోవడం లో ఇటలీ ముందు స్థానం లో నిలుస్తున్నది. 6,78,000 వస్తువుల్ని వెనక్కి రప్పించగలిగింది.అదే ఇండియా విషయానికి వస్తే 2012 నుంచి ఇప్పటిదాకా 127 వస్తువుల్ని వెనక్కి తీసుకురాగలిగింది.సుభాష్ కపూర్ అనే బడా స్మగ్లర్ కి చెందిన గోదాముల్లో 100 మిలియన్ డాలర్ల విలువైన పురాతన వస్తు సంచయాన్ని అమెరికా పొలీసులు ఆ దేశం లో సీజ్ చేశారు.ఇంకా దురదృష్టం ఏమిటంటే మనదేశం లోని పద్మ అవార్డులు పొందిన వారు సైతం ఇలాంటి విలువైన వస్తువుల్ని విదేశాలకి పంపించడం లో కీలకపాత్ర పోషించడం.సింగపూర్ కి చెందిన ఎస్.విజయ కుమార్ అనే పరిశోధకుడు ఐడల్ తెఫ్ట్ అనే తన గ్రంధం లో ఇలాంటి ఎన్నో సంగతులు తెలిపారు.