Sunday 13 November 2022

City of God - ఒక పోర్చుగీస్ సినిమా

 "సిటీ ఆఫ్ గాడ్ " పోర్చుగీస్ సినిమా. కాని ఆంగ్లం లో సబ్ టైటిల్స్ ఉండటం వల్ల హాయిగా చూడవచ్చు. నిజానికి ఇది భీభత్స రసం నింపుకున్న చిత్రం. ప్రపంచ సినీ చరిత్ర లో పేరెన్నిక గన్న సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. 2002 లో బ్రెజిల్ లోనూ,2003 లో ప్రపంచం అంతటా విడుదల అయింది. పోర్చుగీస్ భాష లో Cida de deus అనే పేరు తో రిలీజ్ అయింది.

1997 లో ఇదే పేరు తో Paulo lins అనే రచయిత రాసిన నవల ఆధారం గా నిర్మించారు.దానికి కొన్ని నిజమైన విషయాల్ని ఆ రోజుల్లో జరిగిన సంఘటన ల నుంచి తీసుకుని జోడించారు.రియో డి జనేరో నగరం లో ఉన్న ఓ శివారు ప్రాంతం ఫావెల దగ్గర దీన్ని ఎక్కువగా చిత్రించారు.డ్రగ్ మాఫియా అనేది యువకుల్ని ఇంకా చిన్న పిల్లల్ని ఎలా ఉపయోగించుకున్నదీ ,దానికి వాళ్ళు ఎలా బలి అయిందీ కళ్ళ కి కట్టినట్లు చూపించారు.

నటీ నటులు చాలామంది ని స్థానికంగా ఉన్నవారినుంచే తీసుకున్నారు.ఆ తర్వాత వారికి కొన్ని రోజులు తర్ఫీదు ఇచ్చారు.అందుకే సినిమా చాలా సహజం గా జరుగుతున్నట్లుగా ఉంటుంది.సినిమా మొదలు కావడమే ఓ కోడిని తరుముతూ మొదలు అవుతుంది.ఆ కాలనీలు,నల్ల వాళ్ళ స్థితిగతులు ,దారిద్ర్యం,పిస్తోళ్ళు సంతలో దొరికినట్లు అందుబాటు లోకి రావడం Alexandre Rodrigues  ఇంకా Knockout Ned గ్యాంగ్ ల మధ్య పోరాటాలు వళ్ళు గగుర్పాటు కలిగిస్తాయి.     

మరి దక్షిణ అమెరికా ఖండం లో ఉన్న బ్రెజిల్ దేశం లో తెల్లవాళ్ళు,పసుపు వర్ణం వారు,నల్ల జాతీయులు కూడా ఉంటారని మనకి తెలిసిందే.అక్కడ కి పోర్చుగీస్ వాళ్ళ తో నల్ల వారికి జరిగిన సాంకర్యం,వాళ్ళ సంతానం అదంతా ఇంకో పెద్ద కథ అనుకోండి.కాని ఆ నేపథ్యం తెలిసిన వారు ఈ సినిమా ని ఇంకో కోణం లో కూడా చూడగలరు.ఈ గ్యాంగ్ లో ఉన్న ఓ యువకుని కి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం.దాన్ని ఓ పత్రిక వారు ఉపయోగించుకుంటారు.దానితో తన జీవితం మారిపోతుంది. అతనే ఈ సినిమా నే మనకి చెబుతున్నట్లు తీశారు.

దర్శకత్వానికి,స్క్రీన్ ప్లే కి,ఫోటోగ్రఫీ కి ఇలా నాలుగు విభాగాల్లో అస్కార్ కి నామినేట్ చేయబడింది. ఏది ఏమైనా Fernando Meirilles దర్శకునిగా ఈ సినిమా ద్వారా గుర్తింపు పొందాడు.అలాగే డ్రగ్ మాఫియా కోణాన్ని రియో నగరం లో సరికొత్త గా జనానికి పరిచయం చేశారు.తుపాకి సౌండ్లు,డైలాగ్స్ తప్ప మామూలు సన్నివేశాల్లో ఎక్కడా బ్యాక్ డ్రాప్ సంగీతం పేరు మీద రొద పెద్దగా ఉండదు.అయితే ఒక "రా" అనుభవం కావాలంటే ఈ సినిమా చూసితీరవలసిందే.  

----- NewsPost Desk

No comments:

Post a Comment