Friday, 29 March 2024

మన దేశం లో నీటి లోపల నిర్మించబడిన అతి పెద్ద మెట్రో ఎక్కడ ఉంది ?

 మన దేశం లో నీటి లో కట్టబడిన అతి పెద్ద మెట్రో టన్నెల్ కోల్కతా లో ఉంది. హుగ్లీ నది లో దీన్ని నిర్మించారు.


దీన్ని నిర్మించి మొదలుపెట్టిన రెండురోజుల్లోనే 1,35,000 మంది జనాలు ఎక్కారు. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ వరకు ఈ మెట్రొ ప్రయాణిస్తుంది.


హుగ్లీ నది లో 32 మీటర్లు అడుగున ఈ టన్నెల్ ని నిర్మించారు.ఏప్రిల్ 2023 లో ప్రారంభమయింది. టికెట్ ఖరీదు యాభై రూపాయలు. 


దీన్ని 4,965 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు. టన్నెల్ పొడవు 4.8 కి.మీ. ఉంటుంది.




Tuesday, 12 March 2024

ఈ విషయాలు చదివితే ఏ సూపర్ కంప్యూటరూ మెదడు ముందు సరిపోవు అనిపించక మానదు.

 ఏ కంప్యూటర్ తోనూ మన మెదడు ను పోల్చలేము. జ్ఞానేంద్రియాల నుండి వచ్చే ఆజ్ఞల్ని క్షణం లో స్వీకరించి వెంటనే ప్రాసెస్ చేసి రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. వరద లా వచ్చే సమాచారాన్ని ఎంతో వేగం తో ప్రాసెస్ చేస్తుంది.

 

మన మెదడు 100 బిలియన్ల సూక్ష్మమైన సెల్స్ తో తయారయింది. ఈ సెల్స్ నే న్యురాన్లు అంటారు. వాటన్నిటిన్నిటిని కౌంట్ చేయాలంటే 3000 ఏళ్ళు పడుతుంది.


కలగన్నా, చూస్తున్నా, కదులుతున్నా, ఆలోచిస్తున్నా ... ఈ న్యూరాన్లు చలిస్తూ ఎలెక్ట్రికల్ సంకేతాలు పంపించుకుటూ బిలియన్ల సంఖ్యలో కదలాడుతుంటాయి.


మనిషి జీవించి ఉన్నంతదాకా ఈ పని ఆగడం అనేది ఉండదు. ప్రపంచం లో ఆగకుండా మెసేజ్ లు పంపించే ఏకైక స్మార్ట్ ఫోన్ మన మెదడే అనుకోవచ్చు.


శరీరం లో ఉన్న సెన్సరీ న్యూరాన్స్ సమాచారాన్ని వెన్నుముక కి , బ్రెయిన్ కి గంటకి 240 కి.మీ. వేగం తో పంపిస్తాయి.


ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండనట్లే , ఏ ఇద్దరి మెదడు యొక్క అనాటమీ ఒకేలా ఉండదు. 


--- NewsPost Desk  

Tuesday, 16 January 2024

ఆల్ జాజిర అంటే ద్వీప కల్పం అని అర్థం.

 ఖతర్ దేశం ఈ మధ్య బాగా వార్తల్లో వినబడుతోంది. ఇంచుమించు 29 లక్షల జనాభా ఉన్న ఈ దేశం ప్రపంచం లోని ధనిక దేశాల్లో ఒకటి.

ఎంతో ఖ్యాతి చెందిన ఆల్ జాజిర మీడియా నెట్ వర్క్ ఈ దేశం లోని దోహా నుంచి పనిచేస్తుంది. ఆల్ జాజిర అంటే ద్వీప కల్పం అని అర్థం.

నిజానికి ఈ అంతర్జాతీయ న్యూస్ నెట్వర్క్ ఖతర్ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ప్రపంచం లో 350 మిలియన్ కుటుంబాలకి ఇంకా 150 దేశాలకి ఈ వార్తాకదంబం అందుబాటు లో ఉంది.

వెబ్సైట్, యూ ట్యూబ్,టెలివిజన్, రేడియో ఇలాంటివి అన్నీ ఆల్ జాజిర నెట్ వర్క్ లో ఉన్నాయి. కేంద్ర స్థానం దోహా నగరం.

పర్ష్యన్ గల్ఫ్ లో ఉన్న ఈ బుల్లి దేశం లో చమురు,గ్యాస్ నిలవలు ఎక్కువ గా ఉండడం తో అత్యంత ధనిక దేశాల్లో ఒకటి గా మారింది.

1992 లో  మాస పత్రిక గా అరబిక్ భాష లో మొదలయి ఇంగ్లీష్ లో తన ప్రసారాల్ని 2006 లో మొదలుపెట్టింది.

ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యం లో భాగం గా ఉన్న ఖతర్, 1971 వరకు బ్రిటిష్ సమ్రక్షణ లో ఉన్నది. 90శాతం వరకు సున్నీ ముస్లింస్ ఉన్న ఈ దేశం లో 3,35,967 మంది హిందువులు కూడా ఉన్నారు.

--- NewsPost Desk

   

Saturday, 23 December 2023

ఎందుకు MBBS కి అంత ఫీజు మన దేశం లో ?

 


ఎందుకు MBBS కి అంత ఫీజు మన దేశం లో ? విదేశాల్లో అంత ఎందుకు ఉండదు. అక్కడ వైద్య విద్య అంత నాణ్యత ఉండదేమో అనుకుంటారు చాలామంది. 

కాని అది నిజం కాదు. కిర్గిస్తాన్, రష్యా, చైనా, ఫిలిప్పైన్స్, కజకస్థాన్ ఇలాంటి దేశాల్లో మెడిసిన్ చదువు మన దేశం లో అంత ఖరీదు కాకపోయినా విద్య నాణ్యత లో ఏ మాత్రం తేడా ఉండదు.

 ఆ దేశాల్లో వైద్య విద్య చదివిన వారిని చిన్న చూపు చూడల్సిన పని లేదు.

మన దేశం లో ఉన్న విపరీతమైన డిమాండ్ ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక్కో రాష్ట్రం లో ఫీజులు ఒక్కోలా ఉన్నాయి. 

వీటిని అదుపు చేసే వ్యవస్థ లేకపోవడం విచిత్రం. కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సంవత్సరానికి గాను మూడు కోట్ల రూపాయల పైన వసూలు చేస్తున్నాయి.

 ఇక మెడిసిన్ అయిపొయేసరికి ఎంత అవుతుందో తేలిగ్గా ఊహించవచ్చు.

మన దేశం లో ప్రైవేట్,ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నీ కలిపి 1,04,333 సీట్లని కలిగి ఉంటే ,మొన్న 2023 NEET లో పరీక్ష రాసిన అభ్యర్థులు ఇరవై లక్షల మంది పై మాటే. 

మరి ఈ లెక్కన ఎంత పోటీ ఉందో చూడండి,అందుకే డబ్బులున్న వాడు ఎంతకైనా కొనుక్కుంటున్నాడు.

టాప్ 4 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల్లో మూడు దక్షిణాది లోనే ఉన్నాయి. ఎక్కువ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు ఉన్న రాష్ట్రం కర్నాటక గా తేలింది. 

రమారమి 208 దాకా ఉన్నాయి. ప్రైవేట్ సీట్లలో తక్కువ ఫీజు తో దొరికే కాలేజ్ లు కర్నాటక,కేరళ,చత్తిస్ ఘడ్ లలో ఉన్నాయి. 

మెడిసిన్ మీద ఇష్టం లేకపోయినా, స్టేటస్ కోసం పెద్దల వత్తిడి తో మెడిసిన్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. మన సమాజం లో డాక్టర్ కి ఉన్న స్థానం అలాంటిది.

--- NewsPost Desk

Sunday, 19 November 2023

సంప్రదాయ మీడియా మోనోపలీ ని చావుదెబ్బ కొట్టిన సోషల్ మీడియా

 ఈ రోజు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భం గా కొన్ని విషయాలు చెప్పుకోవడం సముచితం గా ఉంటుంది. దూరదర్శన్ ప్రారంభమైన ఆ రోజుల్ని తలుచుకుంటే ఎంత దూరం ఈ డిజిటల్ యుగం లో ఎన్ని అనుభవాలతో ప్రయాణం చేశామో అర్థమవుతుంది. ఆశ్చర్యమూ కలుగుతుంది. ఆ చిత్రలహరి,వారానికి ఒకటో రెండో వచ్చే సినిమాలు వాటికోసం కాసుకుని కూర్చునే మనం...అదొక మరపురాని కాలం. ఆ తర్వాత ప్రైవేట్ చానళ్ళ వరద మనల్ని ముంచెత్తింది.

ఎన్ని పాటల,సినిమాల,వార్తల ప్రత్యేక చానెళ్ళు...ఏం కత. అన్నం తింటూ కూడా కళ్ళు అటు అప్పగించవలసిందే. వార్తల చానెళ్ళు అయితే చెప్పిందే చెప్పుకుంటూ ఇరవై నాలుగు గంటలూ అవే. ఇక మొబైల్స్ లో నెట్ రావడం ప్రారంభమైన తర్వాత ఇక చెప్పే పని లేదు.ప్రపంచ వార్తలు దగ్గర నుంచి పోర్న్ వరకు ప్రతి సైట్  ప్రతిఒక్కరి అర చేతి లోకీ వచ్చేసింది.చిన్నా పెద్దా లేకుండా ...అందుబాటు లోకి వచ్చిన ఈ అవకాశం ఎంత మంచి చేసిందో అంత మానసిక కాలుష్యానికి కూడా గురి చేసింది.


ఇక ఓటిటి ...ఇదో విప్లవం ఈ డిజిటల్ యుగం లో..! ఎన్ని భాషల సినిమాలు,వెబ్ సీరీస్ లు,ఇతర ప్రోగ్రాం లు చేతి మునివేళ్ళ దగ్గరకి వచ్చాశాయి.కపిల్ శర్మ ఇంటర్వ్యూలు,కాఫీ విత్ కరణ్,ఇంకా ఇలాంటి ఎన్నో డిమాండ్ ఉన్న కార్యక్రమాలన్ని ఓటిటి కి వచేశాయి.సెలబ్రిటీల పెళ్ళి కార్యక్రమాలు అవీ సరే సరి. ఒకదాని తర్వాత ఒకటి మార్పు వస్తూ ముందుకు పోతున్నదే తప్పా ఆగేదే లే అన్నట్లు గా ఉంది. యూ ట్యూబ్ లు,సోషల్ మీడియా లు వచ్చిన తర్వాత సంప్రదాయ మీడియా కి ఉన్న మోనోపలీ బద్దలైనందనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నో డిజిటల్ పత్రికలు విజయవంతం గా దూసుకుపోతున్నాయి.

గూగుల్ క్రోంకాస్ట్, అమెజాన్ స్టిక్ లాంట్ డిజిటల్ మెటీరియల్స్ తో టి.వి. అనుసంధానమై నూతన ఒరవడులు పోతున్నది. ఇప్పటికీ 82 శాతం మంది సగటు భారతీయులు వినోదప్రధాన కార్యక్రమాలకి టివి మీదనే ఆధారపడుతున్నారు. సమాజం లో విలువలు మారిపోవడం లో ఈ మాధ్యమాలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయి.కొన్ని అవాంఛనీయ పరిణామాలు కూడా ఏర్పడుతున్నాయి. సీరియల్స్ ప్రభావం మామూలుగా లేదు. కుటుంబ సంబంధాలు ఘోరం గా దెబ్బతింటున్నాయి.

ప్రస్తుతం గ్రామ సీమలు కూడా సోషల్ మీడియా వల్ల బాగా ప్రభావితం అవుతున్నాయి. ఏ మూలన జరిగేవీ వెంటవెంటనే తెలిసిపోతున్నాయి. ఒక మంచి ఏమిటంటే కొత్త టాలెంట్ బాగా బయటకి వస్తోంది. పాటగాళ్ళు గానీ, ఆటగాళ్ళు గానీ,మాటగాళ్ళు గానీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి తమకి నిజంగా సరుకు ఉంటే దానికి తగ్గా గుర్తింపు పొందుతున్నారు. ఎవరూ ఆపే ప్రసక్తే లేదు. ఏ అభిరుచి గలవాళ్ళకి ఆ అభిరుచి ఉన్న యూట్యూబర్లు దొరుకుతున్నారు. సాధ్యమైనంత వరకు మంచి విషయాలకి వాడుకుంటూ ముందుకి పోతే ఫర్వాలేదు. కానీ ఈ రెండంచుల కత్తిని ఇష్టం వచ్చినట్లు వాడితే నష్టబోయేదీ మనమే..!      

 --- NewsPost Desk

Tuesday, 31 October 2023

ఈ భూమి మొత్తం మీద ఎన్ని రకాల మొక్కలున్నాయో తెలుసా..?

 


ప్రపంచం లో ఇప్పటిదాకా మూడు లక్షల ఎనభై వేల రకాలైన మొక్కల్ని వృక్ష శాస్త్రజ్ఞులు గుర్తించారు.దీంట్లో రెండు లక్షల అరవై వేల మొక్కలు విత్తనాలు ఇస్తాయి. ఏక కణ మొక్కల నుంచి మహా వృక్షాల దాకా ఈ భూమి ఉన్నాయి. మన దేశం లో చెప్పాలంటే 45,000 రకాల మొక్కల్ని గుర్తించారు. రమారమి లక్ష రకాల మొక్కల్ని గుర్తించి వాటి గురించి ఇంకా రాయవలసి ఉంది.

ఎక్కువ గా పూవులు పూచే మొక్కలే ఉన్నాయి. ప్రపంచం లో నాలుగు లక్షల రకాలైన పుష్పించే మొక్కలున్నాయి.వీటి రంగు,సైజు అనేక రకాలుగా ఉంటాయి. బ్రెజిల్ దేశం లో ఈ వృక్ష వైవిధ్యం, జీవ వైవిధ్యం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. వివిధ రకాల మొక్కలు, క్షీరదాలు ,చేపలు 50,000 పై చిలుకు ఉన్నాయి. ఇక మన దేశం కి వస్తే మర్రి చెట్టు ఇంచు మించు అన్ని ప్రదేశాల్లోనూ కనిపిస్తుంది. అందుకే దీన్ని జాతీయ వృక్షం గా ప్రకటించారు.

అడవి విషయానికి వస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానం లో ఉండగా,అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఒరిస్సా ఆ స్థానాల్లో వరుసగా ఉన్నాయి. గుజరాత్ లోని గాంధీ నగర్ లో 32 లక్షల వృక్షాలు ఉన్నాయి.ఇది ఒక రికార్డు. మొత్తం ఇండియా లో 35 బిలియన్ చెట్లు ఉండగా ,భూమి మొత్తం మీద 3 ట్రిలియన్ల చెట్లు ఉన్నట్లు భోగట్టా..!  

--- NewsPost Desk

Thursday, 7 September 2023

94 ఏళ్ళు జీవించిన ఆయన మృత్యువు ని ముందుగానే ఊహించారా


 జయంత మహాపాత్ర (94) గత నెల 27 వ తేదీన పరమపదించారు. అప్పుడు కొన్ని వాక్యాలు రాద్దామని , ఎందుకనో రాయలేకపోయాను. చాలామంది రాసేశారు. కాని నాకు తోచింది నేను రాస్తాను. భారతీయాంగ్ల సాహిత్యం లో ముఖ్యంగా కవిత్వం కి సంబంధించి ముగ్గుర్ని త్రిమూర్తులు గా భావిస్తారు. వారు ఏ.కె.రామానుజన్, ఆర్. పార్థసారథి ఇంకా ఇటీవల మరణించిన జయంత మహాపాత్ర. ఇంచుమించు రెండు తరాల కిందట నుంచి జయంత పేరు ఇంగ్లీష్ సాహిత్యం చదివేవారికి సుపరిచితం. దేశ విదేశాల్లో కూడా..!

బొంబాయ్ నుంచి ఆ రోజుల్లో నిస్సిం ఎజికెల్, అరుణ్ కొలత్కర్ లాంటి వాళ్ళు రాసే ఇంగ్లీష్ కవిత్వం పరిచిన దారిని కాదని తనదైన ,తమ దైనందిన జీవితానికి సంబంధించిన ఇతివృత్తాలతో కొత్త దారిని పరిచినవాడు జయంత. ఇంగ్లీష్ కవిత్వమే గాని ఒరియా జీవితాన్ని ఆలంబనగా చేసుకుని రాసినది. కవిత్వం మాత్రమే కాదు కథలు,వ్యాసాలు కూడా ఆయన రాశాడు. మొత్తం 27 పుస్తకాల్లో ఇరవై పుస్తకాల్ని ఇంగ్లీష్ లోనూ ఏడు పుస్తకాల్ని ఒరియా భాష లోనూ జయంత రాశాడు.

విదేశీ పత్రికలు గుర్తించి ప్రచురించిన తర్వాతనే భారతీయ ఆంగ్ల పత్రికలు ఆయన రచనల్ని ప్రచురించడం మొదలుపెట్టాయి. ద న్యూయార్కర్,న్యూ ఇంగ్లండ్,చికాగో రివ్యూ,జార్జియా రివ్యూ, ద న్యూ రిపబ్లిక్ ఇలాంటి పత్రికలు మొదట్లో ఆయన ఇంగ్లీష్ కవిత్వాన్ని బాగా ప్రోత్సహించాయి. కేంద్ర సాహిత్య అకాడెమీ వారు ప్రచురించే బై మంత్లీ ఇండియన్ లిటరేచర్ లో ఇంకా ఇతర దేశీ పత్రికల్లో బాగా ఆయన రచనలు వచ్చేవి.

ఇంగ్లీష్ సాహిత్యం లో మొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ ప్రదానం చేసినది ఈయనకే. అవార్డులు, గౌరవ డాక్టరేట్లు గురించి చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది. స్వతహాగా ఫిజిక్స్ ఆచార్యుడైనప్పటికీ ఇంగ్లీష్ కవిత్వం వల్ల ఆయనకి ప్రత్యేకత ఒనగూరింది. చాలా లేటుగా అంటే తన 60 వ ఏట నుంచి కవిత్వం రాయడం మొదలెట్టారు. కటక్ నుంచి ఈయన వెలువరించే చంద్రభాగ అనే సాహిత్య పత్రిక భారతీయ ఇంగ్లీష్ సాహిత్యసేవ విషయం లో చెప్పుకోదగిన మైలురాయి.

సచ్చిదానంద మొహంతి అనే అభిమాని (రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్) జయంత మహాపాత్ర గురించి రాస్తూ ఆయన బాల్యం రెండు ప్రపంచాల మధ్య బాధాకరం గా సాగిందని,దాని గురించి చివరి దశలో మిత్రుల వద్ద చెప్పేవారన్నారు. జయంత మహాపాత్ర యొక్క తాత గారు క్రైస్తవ మతం స్వీకరించడం తో ఇంట్లో ఆ పద్ధతులు పాటించడం ఉండేదని, అయితే బంధువులు అంతా సనాతన సంప్రదాయవాదులు కావడం తో హిందూ మతానికి దూరమయ్యానని...అటూ ఇటూ ఏ మతానికి చెందని వాడిగా నా బాల్యం గడిచిందని దానివల్ల మానసిక క్షోభ కి గురయ్యానని చెప్పేవారు.

గ్ర్రాండ్ ఫాదర్ అనే కవిత నిజంగా వాళ్ళ తాత గారిని ఉద్దేశించి రాసిందే. దానికి బాగా పేరు వచ్చింది. 1866 లో వచ్చిన భయంకరమైన కరువు నుంచి రక్షించుకోవడానికి ఆయన కన్వర్ట్ అయినట్లు దానిలోని సారాంశం. ఆ రోజుల్లో కరువు నుంచి ఆదుకునే క్యాంపు ల్లో క్రైస్తవ మతం లోకి మారినవాళ్ళకి మాత్రమే ఆహారం ఇచ్చేవారట. దాన్ని దయనీయంగా ఆ కవిత లో వర్ణించారు జయంత.

94 ఏళ్ళు జీవించిన ఆయన మృత్యువు ని ముందుగానే ఊహించారా అనిపిస్తుంది. బర్డ్స్ ఆఫ్ వాటర్ అనే మీ కవితా సంకలనాన్ని డిసెంబర్ 2023 లో ప్రచురిస్తాను అని ఓ పబ్లిషర్ చెప్పినప్పుడు , నేను అంత వరకు బతికి ఉంటాననే అనుకుంటున్నావా అని జోక్ చేశారట. అదే నిజమైంది. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిపింది.

--- మూర్తి కెవివిఎస్ 

Saturday, 12 August 2023

" కోరాపుట్ అండ్ అదర్ షార్ట్ స్టోరీస్" ఓ విశిష్టమైన కథా సంపుటి.

 "కోరాపుట్ అండ్ అదర్ షార్ట్ స్టోరీస్" అనే ఈ కథాసంపుటి 15 విశిష్టమైన కథల తో నిండి ఉన్న పుస్తకం. గౌరహరి దాస్ గారు వీటిని ఒరియా భాషలో రాయగా సరోజ్ మిశ్రా,గోపా నాయక్ లు ఇంగ్లీష్ లోకి అనువదించారు. గౌరహరి దాస్ గారు ఒరియా భాష లో పేరు ప్రఖ్యాతులున్న పత్రికా సంపాదకులు మరియు రచయిత కూడా. అంతేకాదు మంచి నాటకరచయిత గా తనదైన ముద్ర వేశారు ఒరియా సాహితీ లోకంలో..! అటువంటి రచయిత యొక్క కథల్ని ఇంగ్లీష్ లోకి అనువదించడం వల్ల మనం అందరం చదివే అవకాశం కలిగింది. గతం లో కూడా ద లిటిల్ మాంక్ అండ్ అదర్ స్టోరీస్ పేరుతో ఓ కథాసంపుటి వెలువడింది. అది గౌరహరి దాస్ కథలు అనే పేరు తో తెలుగు లోకి కూడా అనువాదమై మంచి ఆదరణ పొందింది.  

ఈ పుస్తకం లోని ఆంగ్ల భాష చాలా సులువుగా ఉండటం వల్ల చదువరులు పెద్దగా కష్టపడనవసరం లేదు. మూల రచయిత భావం స్పష్టం గా అర్థమై ముందుకు వెళతాడు చదువరి. ఈ పుస్తకం లోని మొదటి కథ కోరాపుట్ నేపథ్యం లో సాగుతుంది. ఒరిస్సా లోని కోరాపుట్ ని ఒక్కసారైనా సందర్శించాలని కోరిక పుడుతుంది ఇది చదివినతర్వాత..! నిజానికి ఈ కథ తీవ్రవాద నేపథ్యం ని నింపుకుని అక్కడి స్థితిగతుల్ని, సాంఘిక వ్యవస్థ ని మనముందు నిలుపుతుంది. కోరాపుట్ ఒడిలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.

Once the sky was blue ఏఅ కథ ఈనాటి మాల్ సంస్కృతిని కళ్ళకి కడుతుంది. ఏ విధంగా చిన్న చిన్న వ్యాపారులు బడా మాల్స్ వల్ల నలిగిపోతారు అనేది చూపిస్తుంది. తలవంచడానికి ఇష్టపడని చిన్న వ్యాపారుల్ని ఎలా తమ ఆర్ధిక,అంగ బలాలతో చిదిమివేస్తారో ఈ కథ లో చదవవచ్చు. Mirage అనే కథ లో పన్నా జెనా అనే ఆకురౌడి జీవితాన్ని రమ్యం గా చిత్రించారు. ఏ బలాలకి లొంగని పొగరుబోతు ని ఏ విధంగా స్త్రీ ని ఉపయోగించి మట్టి గరిపించారో ఈ కథలో చదవవచ్చు. 

ఇక మీడియా రంగం లో వస్తోన్న మార్పులు గురించి ఓ కథ లో వివరించారు. విదేశీ పెట్టుబడులు పత్రికారంగం లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో చాలా విపులంగా తెలుసుకోవచ్చు.ఇలాంటి ఇతివృత్తాలతో కథ రాయడానికి చాలా ధైర్యం కావాలి.అంతేగాక బంగ్లాదేశ్ నుంచి బతకడానికి వచ్చిన కుటుంబం గురించి ఓ కథ లో చదవవచ్చు.విన్నూత్న అంశాలు ఈ సంపుటి లో గోచరిస్తాయి. కావలసినవారు అమెజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. 

Thursday, 20 July 2023

సింగపూర్ పాస్ పోర్ట్ ర్యాంకింగ్ ప్రపంచం లోనే నంబర్ వన్..! మరి మన దేశం ర్యాంక్ ఎంతో తెలుసా..?


 సింగపూర్ పాస్ పోర్ట్ కి ప్రపంచ స్థాయి ర్యాంకింగ్ లో మొదటి స్థానం వచ్చింది. గతం లో ఈ స్థానం లో ఉన్న జపాన్ ని పక్కకి తోసి సింగపూర్ మొదటి స్థానం లోకి వచ్చింది. సింగపూర్ పాస్ పోర్ట్ కలిగి ఉన్నవాళ్ళు ఇకమీదట ఎలాంటి వీసా లేకుండా 192 దేశాల్ని సందర్శించవచ్చు.2021 లో కూడా సింగపూర్ టాప్ స్థానం లోకి వచ్చింది.అయితే తర్వాత జపాన్ ఆ స్థానాన్ని ఆక్రమించింది.

ఇకపోతే జర్మనీ,ఇటలీ,స్పెయిన్ దేశాలు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.ఈ దేశాల పాస్పోర్ట్ లు ఉన్నవారు వీసా లేకుండా 190 దేశాల్ని సందర్శించవచ్చు. 189 దేశాల డెస్టినేషన్స్ తో ఫ్రాన్స్,ఆస్ట్రియా,ఫిన్ లాండ్,స్వీడన్,లక్జం బర్గ్,దక్షిణ కొరియా దేశాలు మూడో స్థానం లో నిలిచాయి.కాగా అమెరికా మాత్రం 8 వ స్థానం లో నిలిచింది. వీసా రెసిప్రోసిటి తక్కువ ఉండటం వల్ల అమెరికా ర్యాంక్ దిగజారుతూ వస్తోంది.

1 నుంచి 10 ర్యాంక్ ల మధ్యలో ఉన్న 34 దేశాలు గత పదేళ్ళలో తక్కువ పెరుగుదల ని నమోదు చేశాయి.మన భారత్ ర్యాంక్ 80 వ స్థానం లో ఉంది.2022 తో పోల్చితే అయిదు స్థానాలు పైకి వెళ్ళింది. మన దేశం పాస్ పోర్ట్ ఉన్నవాళ్ళు 57 దేశాల్ని వీసా లేకుండా చుట్టి రావచ్చు. ప్రస్తుతం మన దేశం ర్యాంక్ టోగో,సెనెగల్ దేశాలతో సమానం గా ఉంది.

ఇక ఆఫ్ఘనిస్తాన్ ర్యాంక్ అన్నిటికన్నా తక్కువ గా ఉంది.వారి పాస్ పోర్ట్ తో యెమెన్,పాకిస్తాన్,సిరియా, ఇరాక్ లాంటి 27 దేశాల్ని వీసా లేకుండా వెళ్ళవచ్చు. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే లండన్ కి చెందిన సంస్థ ఈ ర్యాంక్ ల్ని ప్రకటించింది. కాగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ వారి డేటా ని పరిగణన లోనికి తీసుకోవడం జరిగింది.   

--- NewsPost Desk

Tuesday, 4 July 2023

గంజాయి కి, భంగు కి, చరస్ కి మద్య గల తేడా ఏమిటి

 

నిజానికి గంజాయి,భంగు,చరస్ ఈ మూడు ఒకే మొక్క నుంచి వస్తాయి. తయారు చేసిన విధానాన్ని బట్టి పేర్లు మారతాయి. భంగు ని ఉత్తర భారత దేశం లో హోలీ లాంటి పండగలప్పుడు సేవించడం ఏ నాటినుంచో వస్తున్నదే.గంజాయి మొక్కల ఆకుల్ని నలిపి ఆహారం లోనో,తాగే పానీయం లోనో కలుపుతారు.ఆ మొక్క కి పూసే పూవులు కూడా మంచి నిషాని కలిగిస్తాయి.వాటిని కూడా నలిపి మిశ్రమం గా చేసి వాడతారు.మన దేశం లో భంగు ని కొన్ని పూజల్లో వాడే సంప్రదాయం ఉన్నందున ఉత్తర భారతం లోని కొన్ని రాష్ట్రాల్లో కొంత మేరకు అనుమతి ఉంది.

భంగు బ్రెయిన్ మీద,నెర్వస్ సిస్టం మీద ప్రభావాన్ని చూపుతుంది. సైకోయాక్టివ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది.ఎక్కువ సేవిస్తే మతిమరుపు,బలహీనత కలిగిస్తుంది. ఇక గంజాయి మొక్కల ఆకుల్ని,పూలని మరీ ముదరని దశ లో కోసి మిశ్రమం చేస్తారు. దీన్ని సిగెరెట్ లలో చుట్టుకొని పీలుస్తుంటారు.చిలుం పీల్చడానికి కూడా ఉపయోగిస్తారు. టీ లో కూడా కలిపి తాగుతుంటారు. ఇదొక పద్ధతి. గంజాయి దమ్ము అన్నమాట.

గంజాయి మొక్క ఇంకా దాని ఆకుల్లోని రసాన్ని తీసి తయారుచేసేది చరస్ లేదా హషిష్. చాలా ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండేలా చూస్తారు. హషిష్ ని రోల్స్ గా చుట్టి పొగ తాగడం ఉన్నది. కొద్దిగా జిడ్డుగా ఉంటుంది.అలా గంజాయి మొక్కలో ఏదీ వేస్ట్ కాదు.ఆకులు,పూవులు,మొక్క రసం అన్నీ రకరకాలుగా ఉపయోగిస్తారు.     

Wednesday, 14 June 2023

"కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు..." అనే జీవిత చక్రం లోని పాట ఎవరు మరిచిపోగలరు..?


 మధుర గాయని,విలక్షణమైన స్వరం తో ఎంతో మంది సంగీతాభిమానులను ఆకట్టుకున్న పాతతరం గాయని శారద నిన్న తన 86 వ యేట మృతి చెందారు. ముఖ్యంగా తెలుగు వారికి జీవిత చక్రం సినిమా లో పాడిన మధుర గాయని గా గుర్తు. "కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు...,మధురాతి మధురం మన ప్రేమ మధువు " లాంటి పాటలు ఎన్ని ఏళ్ళు మారినా మరిచిపోలేని పాటలు.శారద గొంతు లో ఒక గమ్మత్తు ఉండేది. ఓ చిన్నపిల్ల,అల్లరిపిల్ల పాడుతున్నట్లుగా ఉండేది.

తమిళనాడు లో జన్మించిన ఈమె పూర్తి పేరు శారదా రాజన్ అయ్యంగార్. హిందీ చిత్రసీమ లో తనదైన ముద్ర వేశారామె. Titli Udi అనే పాటతో (సూరజ్ చిత్రం,1966) ఆమె పేరు మారుమోగింది.రాజ్ కపూర్ ఈమె ని సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ కి పరిచయం చేశారు. హేమామాలిని,షర్మిలా ఠాగూర్,సైరాబాను,రాజశ్రీ లాంటి హీరోయిన్ల కి పాడారు. ఫిల్ ఫేర్ అవార్డ్ పొందారు.

హిందీ మాత్రమే కాకుండా తెలుగు,తమిళ్,గుజరాతీ వంటి భాషల్లో సైతం పాడారు.ఆమె చివరిసారిగా సినిమాల్లో కాంచ్ కి దీవార్ కి పని చేశారు.గాలీబ్ గీతాల్ని ఆల్బం గా పాడారు.హిందీ సినీ పరిశ్రమ లో గల రాజకీయాల వల్ల శారద ఎక్కువ కాలం అక్కడ నిలబడలేకపోయారని అంటారు.ఏది ఏమైనా ఒక విలక్షణ గాయని గా సగీత అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిందామె.   

Friday, 2 June 2023

ఈ మొక్కలంటే పాములకి ఇష్టం

మంచి సువాసన వెదజల్లే  నైట్ జాస్మిన్ మొక్కలన్నా, అలాగే గంధపు చెట్లు అన్నా పాములకి ఇష్టం అని పరిశోధకులు సెలవిస్తున్నారు. మన గ్రామాల్లో మొగలి పొదల వద్ద త్రాచుపాములు ఉంటాయని పెద్దలు అనేదాంట్లో కూడా కొంత నిజం ఉంది. ఎందుకంటే హాయిగా చక్కని సువాసన ని ఆస్వాదించే తత్వం కదా..!

మేరీ గోల్డ్, ఉల్లి,వెల్లుల్లి మొక్కల వాసన అంటే మాత్రం పాములకి పడదుట. అంతేకాదు లవంగాలు,దాల్చిన చెక్క రసాల్ని తీసి మిక్స్ చేసి పాములు చేరగూడదు అనుకున్న చోట స్ప్రే చేస్తే ఆ దాపుల్లోకి రావు. అలాగే తెల్ల వెనిగర్ ని చల్లినా దాని వాసన కూడా పడదు.

పాము కరిచిన వెంటనే ప్రాథమిక చికిత్స చేసి సాధ్యమైనంత త్వరగా డాక్టర్ వద్ద కి తీసుకు వెళ్ళాలి. స్నేక్ వెనం ఏంటి సిరం ఇంజెక్షన్ ని వాళ్ళు చేస్తారు. సొంతగా ఆ ఇంజెక్షన్ చేయవద్దు. పాము కరిచిన వెంటనే ఒంటి మీద టైట్ గా ఉండే రింగ్ ని గాని,బ్రాసిలెట్ వంటివాటిని తొలగించాలి.      

  

Saturday, 13 May 2023

జపాన్, చైనా లాంటి సమాజాల్లో ఆర్దిక పరిస్థితి తో సంబంధం లేకుండా ఎందుకు నేల మీద పడుకుంటారు..?

 జపాన్ ప్రజలు నేటికి మంచం మీద కంటే నేల మీద పడుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. ఆ పద్ధతి కొన్ని తరాలుగా ఆ దేశం లో అమలు లో ఉంది. కింద పడుకోవడం వల్ల వెన్నుబాము కి ఇంకా ఇతర శరీర అవయవాలకి పూర్తి విశ్రాంతి లభించి రక్తప్రసరణ బాగుంటుందని వారి సాంప్రదాయిక వైద్యం చెబుతోంది. కింద తతామి అనే చాప పరుచుకుని,షిక్ఫుటన్ అనబడే మెత్తటి పరుపు వేసుకుంటారు. రాత్రి వేళ పడుకునేటప్పుడు యుకట , జింబే అనబడే పైజామ లు ధరిస్తారు.అవి కాటన్ సిల్క్ తో లూజు గా కుట్టించుకుంటారు.

భారత దేశం లో మాదిరి గానే బిడ్డ పుట్టినతర్వాత తల్లి ఆ బిడ్డ తో ఓ రూం లో పడుకుంటే ,తండ్రి మరో రూం లో పడుకుంటాడు. ఇదే పద్ధతి చైనా లో కూడా అనేక తరాలుగా ఉన్నది.పదేళ్ళు వచ్చేవరకు చిన్నపిల్లలు ఎవరో కుటుంబ సభ్యుల దగ్గర పడుకుంటారు.



చైనా వాళ్ళు కూడా నేల మీద పడుకోవడానికే ప్రాధాన్యతనిస్తారు.ఒక చాప,దానిమీద మెత్తటి పరుపు,దిండు ఉంటుంది.కింద పడుకుంటే శరీరానికి ఆరోగ్యమని భావిస్తారు. ఫిలిప్పైన్స్,కొరియా ,వియాత్నం సమాజాలు కూడా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తారు.భోజనం చేయడానికి కూడా కింద చాప వేసుకుని చిన్న చెక్క బల్ల ని ముందు పెట్టుకుని చేస్తారు.   

  ఈ తూర్పు దేశాల మాదిరి గానే మన దేశం లోనూ ఈ అలవాట్లు ఉండేవి. అయితే క్రమేపి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పూర్తి గా మారిపోతున్నాయి. తమిళనాడు లో మటుకు ఇప్పటికీ కూడా ఎంత ధనవంతులైనా చాప, దాని మీద పరుపు వేసుకుని పడుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేల మీద పడుకోవడం అనేది పేదరికానికి గుర్తు అని మన దేశం లో భావిస్తుంటారు. అయితే ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ చాలా తూర్పు ప్రాంత దేశాలు నేల మీద పడకే శ్రేష్టమని భావిస్తున్నారు. 

  ----- NewsPost Desk

Monday, 8 May 2023

కుకీ ప్రజల గురించి కొన్ని కొత్త సంగతులు

 మణిపూర్ లో చెలరేగిన హింసాత్మక ఘటనలు దేశం మొత్తాన్ని కలవరపరిచాయి. కుకీ ఇంకా మైటే తెగల మధ్య జరుగుతున్న ఘర్షణ అందరినీ మరోసారి ఈశాన్య రాష్ట్రాల వైపు చూసేలా చేశాయి. అసలు ఈ కుకీ తెగ ప్రజలు ఎవరు అని ప్రశ్నించుకుంటే వీరు ఒక్క మణిపూర్ లోనే కాక నాగాలాండ్,మిజోరాం,అస్సాం వంటి రాష్ట్రలతో బాటు మైన్మార్, బంగ్లాదేశ్ లలో కూడా ఉన్నారు.మళ్ళీ వీరిలో కొన్ని ఉప తెగలు ఉన్నాయి.లుషాయ్,డార్లంగ్,రోఖంస్,సరిహద్దు ప్రాంతాల్లో ఉండే చిన్ ఇలా చెప్పవచ్చు.

                                                                     (Kuki women)

వీరు టిబెటొ బర్మన్ మంగోలాఇడ్ జూయిష్ ఎత్నిక్ కమ్యూనిటికి చెందినవారని శాస్త్రవేత్తలు అంటారు. ఖు అంటే గుహ అని అర్థం.దాన్నుంచి కుకి అనే మాట వచ్చింది.అత్యంత్  పురాతన తెగల్లో ఇది ఒకటి.జంతువులు,చెట్లు,పర్వతాలు ఇలాంటి వాటిని ఒకప్పుడు పూజించేవారు.ప్రస్తుతం అనేకమంది క్రైస్తవ మతం లోకి మారడం తో పాత పద్ధతులు అడుగంటాయని చెప్పాలి. విలియం పెట్టి గ్రు అనే బ్రిటీష్ మిషనరీ 1890 ప్రాంతం లో ఇక్కడికి ప్రవేశించి క్రైస్తవ మతాన్ని వ్యాపింప జేశాడు.క్రైస్తవ మతం రాకతో కుకీ సమాజం లో అనేక సాంఘిక పరమైన మార్పులు చోటుచేసుకున్నాయి.  

మణిపూర్ రాష్ట్రం లో కుకీ లు ముప్ఫై శాతం దాకా ఉంటారు. ముఖ్యంగా రాష్ట్రం నలుమూలలా ఉన్న పర్వతాల మధ్య వీరు జీవిస్తుంటారు. మైటే తెగ వారు అధికార కేంద్రానికి దగ్గరగా ఇంఫాల్ పరిసర ప్రాంతం లో ఎక్కువ ఉన్నారు.కుకీ తెగ ప్రజలు క్రైస్తవ మతం లోకి మారినప్పటికీ వారి గిరిజన తెగ హోదా అలాగే ఉంటుంది.ఈశాన్య రాష్ట్రాల కి దానికి సంబందించి కొన్ని ప్రత్యేక చట్టాలు ఉండటం వల్ల అలా కొనసాగుతోంది. కుకీ ప్రజలు సెప్టెంబర్ 13 ని బ్లాక్ డే గా పరిగణిస్తారు.అదేరోజు 1993 లో NSCN(IM) అనే మిలిటెంట్ సంస్థ 15 గ్రామాల్లోని కుకీల్ని చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ఊచకోత కోసింది.

 ఈ మిలిటెంట్ సంస్థ నాగా తెగ కి చెందినది.ఈశాన్య ప్రాంతాల్లోని నాగా ప్రజల్ని,మైన్మార్ లో ఉన్న నాగా ప్రజల్ని ఏకం చేసి ప్రత్యేక దేశం గా ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నది.చైనా,పాక్ ల నుండి విరాళాలు వస్తుండేవి.2019 లో భారత సైన్యం వీరి గూఢచార నెట్ వర్క్ ని ధ్వంసం చేసి చాలా వరకు దీని ప్రభావాన్ని తగ్గించింది. ఈ NSCN సంస్థ ఓ వైపు మావో లతో కలిసిపనిచేస్తూనే మరోవేపు క్రైస్తవ మతం ఆధారంగా పనిచేస్తుంది."నాగాలాడ్ ఫర్ జీసస్" అనేది వారి స్లోగన్.


Sunday, 23 April 2023

వీరు ఒక రకంగా హిందువులు, మరో రకంగా హిందువులు కారు

 మన దక్షిణ భారతం ఎన్నో రమణీయ దృశ్యాలకు పెట్టింది పేరు. దానిలో ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో ఉన్న కూర్గు ప్రాంతం తప్పక చూడదగినది. కర్ణాటక రాష్ట్రం లో ఉన్న ఈ జిల్లా బెంగుళూరు నుంచి 270 కి.మీ,మైసూర్ నుంచి 122 కి.మీ. ఉంటుంది.కూర్గు జిల్లా మొత్తం పచ్చని ప్రకృతి తో,జలపాతాలతో,కనువిందు చూసే కాఫీ తోటలతో అలరారుతూంటుంది. కూర్గు జిల్లాని మూడు తాలూకాలుగా విభజించారు. అవి మడికేరి,విరాజ్ పేట,సోమవార్ పేట. 


సంవత్సరం మొత్తం అంతా కూడా 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. అంత చల్లగా ఉంటూ ,కాఫీ పంట ఇంకా అరుదైన సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి కాబట్టి దీన్ని బ్రిటీష్ వారు స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు.ఇప్పటికీ మనవాళ్ళు అలానే పిలుస్తుంటారు. వీరి స్వీట్లు,వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి.బ్రహ్మాండమైన పశ్చిమ కనుమల అందాల్ని చూడాలంటే తప్పక ఇక్కడకి రావాలిసిందే.


(Kodagu people)

రకరకాల వైన్స్ ని తయారుచేయడం లో ఈ ప్రాంతానికి ఓ చరిత్ర ఉన్నది.ఇక్కడ నివసించే ప్రధాన ప్రజలు కొడవ జాతికి చెందినవారు.సైనిక లేద యోధ జాతికి చెందినవారిగా పరిగణించుకుంటారు.వీరి వేషభాషలు,సంస్కృతి,ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీరి ప్రధాన దైవం కావేరి నదీమాత.ఇంకా ప్రకృతి. తుపాకుల్ని సైతం పూజిస్తారు.కేలి మూర్త వీరి పండుగ.వీరి పెళ్ళిళ్ళు గాని శుభ కార్యాలు గాని అన్నీ ఆ కొడవ జాతి పెద్దలే నిర్వహిస్తారు తప్పా బ్రాహ్మల్ని పిలిచి చేయించడం ఉండదు. నిజానికి వీరిలో కులాలు,ఉపకులాలు ఏమీ ఉండవు. అందుకనే వీరు హిందువుల్లో ఉన్నా లేనట్లు గానే కొంతమంది పరిగణిస్తారు.  



Tuesday, 11 April 2023

కొన్ని హాట్ సీన్స్ ఉన్నప్పటికీ ఈ అమెరికన్ వెబ్ డ్రామా సిరీస్ బాగానే ఉంది

 Daisy Jones & The Six అనే అమెరికన్ మ్యూజిక్ డ్రామావెబ్ సీరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైం వీడియో లో ఉన్నది. రాక్ బ్యాండ్ కళా కారుల జీవితాల్ని చాలా చక్కగా చిత్రించిన ఈ గాథ Taylor Jenkins Reid యొక్క నవల ని ఆధారం గా చేసుకుని తీసినది.ఎన్నో తంటాలు పడి పైకి వచ్చి మళ్ళీ కిందపడి ఎన్నో అనుభవాలు చూసిన ఎన్నో బ్యాండ్ లని పరిశీలించి ఈ నవల రాసినట్లుగా అనిపిస్తుంది.ఇది ఫిక్షన్ అయినప్పటికీ, డాక్యుమెంటరీ నా అన్నంత సహజంగా ప్రతి పాత్రా తమ వేపు నుంచి కథ చెబుతూంటుంది.


Daisy పాత్ర వేసిన Riley Keoush మనో పథం లో నిలిచిపోతుంది. అలాగే Billy పాత్ర లో Sam Claffin కూడా.అతను బ్యాండ్ లీడర్ గా బాగా మెప్పించాడు.డన్ బ్రదర్స్ అనే పేరుతో బ్యాండ్ ని స్థాపించి తనదైన దారిలో పోతుండగా,వాళ్ళకి తారసపడిన మేనేజర్ దీన్ని మరో దారి లోకి నడుపుతాడు.తన సలహాలతో.లాస్ ఏంజిల్స్ కి వెళ్ళి ప్రొగ్రాంస్ ఇస్తూ పేరు తెచ్చుకునే క్రమం లో అనేక మలుపులు తిరుగుతుంది కథ. Camila పాత్ర కి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆ పాత్రలో యువతిగా, మెప్పించిన ఆమె తల్లిగా కూడా చక్కగా నటించింది. మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్నాయి. ఆసక్తిపరులు చూడవచ్చు.    

Sunday, 9 April 2023

ఈ హిల్ స్టేషన్ ప్రత్యేకతే వేరు - కానీ మనవాళ్ళు వెళ్ళేది తక్కువే


ఎంతసేపూ అందరూ వెళ్ళే పర్యాటక ప్రదేశాలేనా,మన దేశం లో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ వాటికి పెద్దగా ప్రాచుర్యం లభించదు. కారణాలు ఏవైనా కావచ్చు.మరి ఇప్పుడు అలాంటి ఓ ప్రదేశం గురించి తెలుసుకుందాం.అది కోరాపుట్ పట్టణం ,దాని పరిసర ప్రదేశాలు.ఒరిస్సా రాష్ట్రం లో ఉన్నది. అయితే విశాఖపట్టణానికి దగ్గర,రైలు ప్రయాణం అయితే అక్కడ నుంచి అయిదు గంటలు పడుతుంది.


సముద్రమట్టానికి రమారమి 3000 అడుగుల పైన ఉన్న ఈ ప్రదేశం మరో కాశ్మీరు మాదిరిగా ఉంటుంది.గొప్ప పర్వత దృశ్యాలు,అడవులు,జలపాతాలు,నదీ ప్రవాహాలు,అటవీ జంతువులు,ఎంతో పురాతమైన ఆదివాసీ తెగలు ఇవన్నీ కలిసి ఓ ప్రత్యేక తరగతి కి చెందిన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాయి.కళ్ళకి విందు చేసే పచ్చదనం,ఎత్తైన గుట్టలు మనోరంజకం గా ఉంటాయి.అంతేకాదు ఇక్కడ కాఫీ పంట కి మంచి గిరాకీ ఉంది.నూరుశాతం అరబిక రకానికి చెందినది.1930 ప్రాంతం లో అప్పటి స్థానిక పాలకుడు రాజా బహదూర్ రామచంద్ర దేవ్   కాఫీ మొక్కల్ని మొట్టమొదటిగా ఇక్కడ నాటారు.

ఇక్కడికి 20 కి.మీ. దూరం లో హిందూస్థాన్ ఏరొనాటిక్స్ లిమిటెడ్ వారి విమానాల ఇంజన్లు తయారుచేసే కర్మాగారం ఉంది. ఇప్పటికీ కోరాపుట్ యొక్క ప్రకృతి దృశ్యాలు నాగరికత కోరలకి బలికాకుండా ఉన్నాయి. మంచి హిల్ స్టేషన్ గా పిలువబడే ఈ ప్రదేశం తన ప్రత్యేక అస్థిత్వాన్ని నిలుపుకొంటున్నది. ఈ చుట్టు పక్కల ఉన్న గుప్తేశ్వర్ ఆలయం,శబర శ్రీక్షేత్రం,కోరాపుట్ మ్యూజియం,కొలాబ డ్యాం, జైన మందిరం వంటి వాటిని తప్పక దర్శించుకోవాలి.     

Sunday, 12 March 2023

ప్రఖ్యాత రచయిత రస్కిన్ బాండ్ అభిమానుల్ని అక్కడ మాత్రమే ఎందుకు కలుస్తారో తెలుసా..?


 రస్కిన్ బాండ్ (Ruskin Bond) ఈ పేరు వినని సాహితీప్రియులు ఉండరు. ఆయన స్వతహాగా ఆంగ్లం లో రాసినప్పటికీ ఇంచుమించు అన్ని భారతీయ భాషల్లోకి వారి రచనలు అనువాదాలు జరిగాయి,జరుగుతూనే ఉంటాయి.ఇంగ్లీష్ పాఠ్యగ్రంథం లో ఎక్కడో ఓ చోట బాండ్ ఒక్క కథనో ,వ్యాసమో చదివే ఉంటాము.ఇక CBSE,ICSE సిలబస్ లు చదివి వచ్చిన యువత గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన రాసిన అనేక కథల పుస్తకాల్ని చదువుకుంటూ పోతూనే ఉంటారు.జీవితం లో ఒక భాగమై ఆయన పేరు మీద అనేక గ్రూపులు ఆన్ లైన్ లో నడుపుతుంటారు.ఈ మేగజైన్ కూడ ఉంది. కథ ని ప్రేమించే మనిషికి ఆయన కథ తగిలితే చాలు ఇక అక్కడితో ఆగలేరు.

మరి ఇంతా చేసి ఈ రస్కిన్ బాండ్ ఎవరు..?చిన్నపిల్లలు,యువతరం,పెద్దతరం అందరినీ తనదైన ప్రత్యేక కథన కుతూహలం తో అలరించే ఈయన ముస్సోరి అనే పట్టణం లో ,హిమాలయ సానువుల్లో ,ఆ కొండల్లో ఎన్నో దశాబ్దాల నుంచి జీవిస్తూ అక్కడి తన అనుభవాలనే గాక ఇంకా తన జీవితం లోని ఎన్నో అనుభవాలను కథల రూపం లో రాస్తూ ఇప్పటికీ 100 పుస్తకాల కి పైగా వెలువరించాడు. ప్రస్తుతం ఎనభైవ పడి లో ఉన్నాడు. జన్మతహ ఆంగ్లేయ దంపతులకి పుట్టినప్పటికి భారత దేశాన్ని తన ఆవాసం గా చేసుకుని ఇక్కడే ఉండిపోయాడు. తన అసలు పేరు ఓవెన్ రస్కిన్ బాండ్ ,1934 లో హిమాచల్ ప్రదేశ్ లోని కాసులి అనే ఊరి లో జన్మించాడు.

ఆయన చిన్నతనం లోనే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి అప్పటి ఒక భారతీయ సంస్థానాధీశుణ్ణి రెండో వివాహం చేసుకోవడం తో, ఎక్కువగా తండ్రి వద్దనే పెరిగాడు. బ్రిటీష్ ఆర్మీ లో పనిచేసే అతను అనేక ప్రాంతాలు తిరిగేవాడు.బాండ్ కూడా తండ్రి తో పాటూ తిరిగాడు. యవ్వనదశ కి ముందే తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత తనది ఒకరకమైన అనాధ జీవితమే అయింది.స్నేహితుల సాయం తోనూ,చిన్న చిన్న పనుల తోనూ తనని తాను పోషించుకున్నాడు. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తన బంధువులు ,తెలిసిన వాళ్ళు చాలామంది ఇంగ్లండ్ కి వెళ్ళిపోయారు. అయితే తాను మటుకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు.

రచయిత గా మాత్రమే జీవించాలని కంకణం కట్టుకున్నా,అది ఇండియా లో చాలా కష్టమని తెలిసింది.ట్యూషన్స్ చెప్పినా,స్వచ్చంద సంస్థ లో పని చేసినా దానికోసమే. మొత్తానికి రమారమి 70 ఏళ్ళపాటు రచనా రంగం లో ఉండి 100 కథల పుస్తకాల్ని ఇప్పటిదాకా రాశాడు. లెక్కలేనన్ని వ్యాసాలు,ఇతర ప్రక్రియలు చేపట్టాడు.మరి ఇన్నేళ్ళ తన జీవితం లో తాను పొందిన తీపి,చేదు అనుభవాలు అన్నిటినీ కలిపి రస్కిన్ బాండ్ తన ఆత్మకథ ని రాసుకున్నాడు దాని పేరు Lone Fox Dancing రెండువందల ఎనభై పేజీలు. స్పీకింగ్ టైగర్స్ వాళ్ళు ప్రచురించారు. ప్రతి ఒక్క రచయిత లేదా రచయిత కాదలుచుకున్న వ్యక్తి తప్పక చదవాలి. 

ఈ ఆటోబయోగ్రఫీ చదవడం వల్ల మనకి రస్కిన్ బాండ్ యొక్క జీవిత గాథ తెలియడమే కాదు. దానితో బాటు అనేక విషయాలు తెలుస్తాయి. నాటి బ్రిటిష్ ప్రభుత్వం లో పనిచేయడానికి వచ్చిన అనేక రకాల మనుషుల మంచీ చెడు తెలుస్తాయి.వాళ్ళ వ్యామోహాలు,ఉద్యోగధర్మం గా వాళ్ళు చేసిన పనులు, వాటి పర్యవసానాలు తెలుస్తాయి. అంతేకాకుండా స్థానిక ప్రజలతో వాళ్ళ అనుబంధాలు తెలుస్తాయి.ముఖ్యం గా సింలా,డెహ్రాడూన్,జాం నగర్,లక్నో వంటి ప్రాంతాల్లో నాటి నేటివ్ బ్రిటిషర్స్ ఎలా జీవించేవారు,రోజువారి జీవితం లోని పదనిసలు ఇప్పుడు చదువుతుంటే ఆసక్తి గా అనిపిస్తాయి.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలామంది బ్రిటిషర్లు ఇక్కడ ఉండడం లో  ఇన్సెక్యూరిటీ ఫీలయ్యి ఇంగ్లండ్ కి వెళ్ళిపోయారని రస్కిన్ బాండ్ చెబుతాడు. తాను నాలుగు ఏళ్ళు లండన్ వెళ్ళి కొన్ని ఉద్యోగాలు ప్రయత్నించి తనకి ఇండియా నే బాగుందనిపించి మళ్ళీ వెనక్కి వస్తాడు. దానికి కారణం చెబుతూ హిమాలయ సానువుల్లోని ఆ గుట్టల్లోనూ,చెట్ల లోనూ,ఉండి ఉండి అవి నాలో ఓ భాగమయిపోయాయి.ఆ తర్వాత ఢిల్లీ లోనూ ,బొంబాయి లోనూ ఉండాల్సివచ్చినా అది తనవల్లగాదని ముస్సోరి లోనే స్థిరపడ్డాడు.అక్కడ నుంచే తన రచనా యాత్రని సాగించాడు.అప్పటికి ఆ ఊరు చాలా చిన్నది. తన మొట్టమొదటి నవల The Room on the  Roof ఇలస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లో సీరియలైజ్ అయినప్పుడు ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. దాన్ని ఎవరికైనా చూపించి శభాష్ అనిపించుకోవాలన్నా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఆ చుట్టూతా ఎవరూ ఉండరు.

ఢిల్లీ లో ఉన్న కుష్వంత్ సింగ్ తనని ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు ఒకసారి,తన రచనల్ని బాగా ప్రోత్సహించేవాడని రస్కిన్ బాండ్ రాసుకున్నాడు.మెల్లిగా స్వదేశీ,విదేశీ ఇంగ్లీష్ పత్రికల్లో రాయడం మొదలుపెట్టి తనకంటూ ఓ స్థాయి ని సంపాదించుకుంటాడు.ఆ తర్వాత ఇంప్రింట్ అనే పత్రిక కి సహసంపాదకునిగా ఆర్.వి.పండిట్ కోరిక మీద పనిచేశాడు.ఎమర్జెన్సీ టైం లో ఆ పండిట్ మీద అప్పటి ప్రభుత్వానికి ఉన్న కోపం వల్ల ఓ చిన్న కేసు లో ఇరుక్కుంటాడు.అయితే ఈజీగానే దానిలోనుంచి బయటబడి తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగించాడు.

ఇప్పుడు మాదిరిగా అప్పట్లో రచయితలకి పబ్లిసిటీ లేదని,తాను ఓసారి బిబిసి లో ప్రొగ్రాం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గ్రాహం గ్రీన్ తన పక్కనే కూర్చున్నా తాను గుర్తించలేదని ,ఆ తర్వాత ఎవరో తనకి చెప్పడం తో ఖంగుతిన్నానని అంటాడు. అయితే ఎర్నెస్ట్ హెమింగ్వెయ్ లాంటి వాళ్ళు వేరు.పబ్లిసిటీ కోసం ఏవో చేస్తుండేవారని అంటాడు. ఇలా ఎన్నో విషయాల్ని తనకి తారసపడిన సంఘటనల్ని అక్షరబద్ధం చేశాడు. 50 ఫోటోలు ఈ పుస్తకం లో ఉన్నాయి.అవి అన్నీ ఎన్నో నాటి సంగతులని వివరిస్తాయి. ముస్సోరి లో ఉండే రస్కిన్ బాండ్ ని కలవడానికి ఎంతోమంది అభిమానులు వస్తుంటారు.

 అక్కడ ఉండే కేంబ్రిడ్జ్ బుక్ హౌస్ అనే పుస్తకాల షాప్ లో వాళ్ళందర్నీ ప్రతి శుక్రవారం కలుస్తుంటాడు. ఇంట్లో మాత్రం ఎవరినీ కలవడాయన.దానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. బెంగాల్ నుంచి ఓ రచయిత్రి చాన్నాళ్ళ క్రితం ఈయన ఇంటికి వచ్చి తప్పనిసరిగా తన పుస్తకానికి ముందుమాట రాయవలసిందే అని కూర్చుందట. నేను కొద్దిగా పనిలో ఉన్నా ,స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళమంటే నానాయాగీ చేసిందట. సరె...ఎవరి అనుభవాలు వాళ్ళవి. మన ఆర్.కె.నారాయణ్ గారు జీవించి ఉన్న రోజుల్లో అభిమానుల్ని ఇంట్లో కాకుండా బయటనే ఎక్కువ కలిసేవారని చదివాను. అనేక అనుభవాల సమాహారంగా ఉన్న ఈ ఆటోబయోగ్రఫీ ప్రస్తుతం అమెజాన్ లో లభ్యమవుతోంది.

----- మూర్తి కెవివిఎస్      

Thursday, 2 March 2023

హైదరాబాద్ కెపాసిటీ పెరింగిందన్నమాట

 సాఫ్ట్ వేర్ డెవలపర్స్ ని ఇంటర్వూ చేయడం లో హైదరాబాద్ నగరం కొత్త రికార్డ్ లు సృష్టించి దేశం లో మొదటి స్థానం లో నిలిచింది.సియాటెల్ కేంద్రం గా ఉన్న టెక్నికల్ ఇంటర్వ్యుంగ్ ఫర్మ్ కారట్ ఇచ్చిన రిపోర్ట్ అది.ఈ విషయం లో మొదటి 20 స్థానాలు అమెరికా ఇంకా ఇండియా లో ఉన్నాయి.మన దేశం లోని హై వాల్యూం మార్కెట్ యు.ఎస్. లోని సాఫ్ట్ వేర్ డెవెలపర్స్ తో పోటీపడుతోంది.ముంబాయి,పూణే,బెణ్గళూరు,గురుగ్రాం,చెన్నయ్ ల కంటే కూడా హైదరాబాద్ ముందు స్థానం లో ఉంది.ప్రపంచ వ్యాప్తంగా చెప్పాలంటే 10 వ స్థానం లో ,లండన్ ఇంకా వాషింగ్టన్ ల తర్వాత ఉంది.గ్లోబల్ కంపెనీల నుంచి వచ్చే పెట్టుబడులు ఇక్కడున్న డిజిటైజేషన్ ట్రెండ్ ని మరింత బలోపేతం చేస్తున్నాయి.వాషింగ్టన్ డిసి,ఆస్టిన్ నగరాలు లాస్ ఏంజిల్స్,కన్సాస్ సిటీ,పిట్స్ బర్గ్ ల కన్నా ముందున్నాయి. 

పెద్ద స్థాయి లో ఉన్న టెక్కీ లని ఇంటర్వ్యూ చేయడానికి టాలెంట్ లీడర్స్ ఎంతో ఖర్చు చేస్తున్నారు.ముఖ్యం గా HR tech,Recruiting vendors లాంటి సంస్థలు.వాట్సప్ రిక్రూట్మెంట్ రిమోట్ లాంటి ప్లాట్ ఫాంస్ ని ఉపయోగించుకుంటున్నాయి. ఇండస్ట్రీ లో ఉన్న మిగతా వారితో సంప్రదిస్తున్నాయి.కొన్ని కంపెనీలు చవక గా పనిచేయించుకోడానికి ఇండియా లాంటి దేశాల వైపు చూస్తున్నాయి.ఇది ఎప్పటినుంచో ఉన్నదే.కారట్ సి.యి.వో. మోహింత్ బెండె గత ఏడాది లో తమ ఖాతాదారుల చలనం లో అనేక మార్పులు వచ్చినట్లు చెబుతున్నారు. 

Thursday, 26 January 2023

అమెరికా లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గడ్డుకాలమే..!

 Google, microsoft ఇంకా Amazon వంటి దిగ్గజ సంస్థలు లే ఆఫ్ ప్రకటించడం తో అమెరికా లో వేలాదిమంది భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. వీళ్ళందరూ తమ ఉద్యోగాలు పోగొట్టుకోవడమే కాకుండా వీలైనంత త్వరలో మళ్ళీ ఏదో ఇతర కంపెనీల్లో పని వెదుక్కోవలసిన స్థితి ఏర్పడింది.వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించిన దాని ప్రకారం దాదాపు రెండు లక్షల మంది ఐ.టి. ఉద్యోగులు గత నవంబర్ నుంచి ఇప్పటిదాకా రోడ్డున పడ్డారు.గూగూల్,మైక్రోసాఫ్ట్,ఫేస్ బుక్,అమెజాన్ కంపెనీల్లో ఐతే రికార్డ్ స్థాయిలో ఎప్పుడూ లేనంతమందిని తొలగించారు.


వీరిలో చాలామంది H-1B,L1 వీసాల మీద కొనసాగుతున్నారు. దీంట్లో H-1B వీసా అనేది అమెరికా లోని సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు గా కొనసాగడానికి పనికి వస్తుంది తప్పా ఇమ్మిగ్రేంట్ వీసా గా పరిగణించరు.అదీ ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగులు గా మాత్రమే H-1B వీసా పై రావచ్చును.చాలా సంస్థలు దీన్ని నెపం గా పెట్టుకుని వేలాదిమందిని ఇండియా,చైనా వంటి దేశాల నుంచి హైర్ చేసుకున్నాయి. ఇక L-1Bవీసా అనేది తాత్కాలిక ప్రాతిపదికన ఆయా సంస్థల మధ్య ట్రాన్స్ ఫర్ మీద వచ్చే మేనేజీరియల్ స్థాయి వారికి మాత్రమే సంబంధించినది. 

మన దేశానికి సంబందించిన ఐ.టి. నిపుణులు ఎక్కువగా ఈ రెండు వీసాల మీదనే ఆధారపడి అమెరికా లో పనిచేస్తున్నారు. వీరు ఎక్కువకాలం ఉండాలంటే సాధ్యమైనంత త్వరలో అంటే ఈ ఏప్రిల్ నెల లోగా వేరే కంపెనీల్లో ఉద్యోగం చూసుకోక తప్పదు. ఈ మార్చ్ నెల 20 తేదీ ఆఖరు పని దినం గా ఉన్న ఓ ఉద్యోగిని మాట్లాడుతూ హెచ్ వన్ బి వీసా ఉన్నవారు మరో అరవై రోజుల్లో ఇక్కడ జాబ్ చూసుకోకపోతే తిరిగి ఇండియా వెళ్ళడం తప్పా మరో దారి లేదని చెబుతున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ సంపాదించడం కూడా కష్టం గానే మారింది.  

--- NewsPostNetwork