Monday, 8 May 2023

కుకీ ప్రజల గురించి కొన్ని కొత్త సంగతులు

 మణిపూర్ లో చెలరేగిన హింసాత్మక ఘటనలు దేశం మొత్తాన్ని కలవరపరిచాయి. కుకీ ఇంకా మైటే తెగల మధ్య జరుగుతున్న ఘర్షణ అందరినీ మరోసారి ఈశాన్య రాష్ట్రాల వైపు చూసేలా చేశాయి. అసలు ఈ కుకీ తెగ ప్రజలు ఎవరు అని ప్రశ్నించుకుంటే వీరు ఒక్క మణిపూర్ లోనే కాక నాగాలాండ్,మిజోరాం,అస్సాం వంటి రాష్ట్రలతో బాటు మైన్మార్, బంగ్లాదేశ్ లలో కూడా ఉన్నారు.మళ్ళీ వీరిలో కొన్ని ఉప తెగలు ఉన్నాయి.లుషాయ్,డార్లంగ్,రోఖంస్,సరిహద్దు ప్రాంతాల్లో ఉండే చిన్ ఇలా చెప్పవచ్చు.

                                                                     (Kuki women)

వీరు టిబెటొ బర్మన్ మంగోలాఇడ్ జూయిష్ ఎత్నిక్ కమ్యూనిటికి చెందినవారని శాస్త్రవేత్తలు అంటారు. ఖు అంటే గుహ అని అర్థం.దాన్నుంచి కుకి అనే మాట వచ్చింది.అత్యంత్  పురాతన తెగల్లో ఇది ఒకటి.జంతువులు,చెట్లు,పర్వతాలు ఇలాంటి వాటిని ఒకప్పుడు పూజించేవారు.ప్రస్తుతం అనేకమంది క్రైస్తవ మతం లోకి మారడం తో పాత పద్ధతులు అడుగంటాయని చెప్పాలి. విలియం పెట్టి గ్రు అనే బ్రిటీష్ మిషనరీ 1890 ప్రాంతం లో ఇక్కడికి ప్రవేశించి క్రైస్తవ మతాన్ని వ్యాపింప జేశాడు.క్రైస్తవ మతం రాకతో కుకీ సమాజం లో అనేక సాంఘిక పరమైన మార్పులు చోటుచేసుకున్నాయి.  

మణిపూర్ రాష్ట్రం లో కుకీ లు ముప్ఫై శాతం దాకా ఉంటారు. ముఖ్యంగా రాష్ట్రం నలుమూలలా ఉన్న పర్వతాల మధ్య వీరు జీవిస్తుంటారు. మైటే తెగ వారు అధికార కేంద్రానికి దగ్గరగా ఇంఫాల్ పరిసర ప్రాంతం లో ఎక్కువ ఉన్నారు.కుకీ తెగ ప్రజలు క్రైస్తవ మతం లోకి మారినప్పటికీ వారి గిరిజన తెగ హోదా అలాగే ఉంటుంది.ఈశాన్య రాష్ట్రాల కి దానికి సంబందించి కొన్ని ప్రత్యేక చట్టాలు ఉండటం వల్ల అలా కొనసాగుతోంది. కుకీ ప్రజలు సెప్టెంబర్ 13 ని బ్లాక్ డే గా పరిగణిస్తారు.అదేరోజు 1993 లో NSCN(IM) అనే మిలిటెంట్ సంస్థ 15 గ్రామాల్లోని కుకీల్ని చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ఊచకోత కోసింది.

 ఈ మిలిటెంట్ సంస్థ నాగా తెగ కి చెందినది.ఈశాన్య ప్రాంతాల్లోని నాగా ప్రజల్ని,మైన్మార్ లో ఉన్న నాగా ప్రజల్ని ఏకం చేసి ప్రత్యేక దేశం గా ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నది.చైనా,పాక్ ల నుండి విరాళాలు వస్తుండేవి.2019 లో భారత సైన్యం వీరి గూఢచార నెట్ వర్క్ ని ధ్వంసం చేసి చాలా వరకు దీని ప్రభావాన్ని తగ్గించింది. ఈ NSCN సంస్థ ఓ వైపు మావో లతో కలిసిపనిచేస్తూనే మరోవేపు క్రైస్తవ మతం ఆధారంగా పనిచేస్తుంది."నాగాలాడ్ ఫర్ జీసస్" అనేది వారి స్లోగన్.


Sunday, 23 April 2023

వీరు ఒక రకంగా హిందువులు, మరో రకంగా హిందువులు కారు

 మన దక్షిణ భారతం ఎన్నో రమణీయ దృశ్యాలకు పెట్టింది పేరు. దానిలో ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో ఉన్న కూర్గు ప్రాంతం తప్పక చూడదగినది. కర్ణాటక రాష్ట్రం లో ఉన్న ఈ జిల్లా బెంగుళూరు నుంచి 270 కి.మీ,మైసూర్ నుంచి 122 కి.మీ. ఉంటుంది.కూర్గు జిల్లా మొత్తం పచ్చని ప్రకృతి తో,జలపాతాలతో,కనువిందు చూసే కాఫీ తోటలతో అలరారుతూంటుంది. కూర్గు జిల్లాని మూడు తాలూకాలుగా విభజించారు. అవి మడికేరి,విరాజ్ పేట,సోమవార్ పేట. 


సంవత్సరం మొత్తం అంతా కూడా 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. అంత చల్లగా ఉంటూ ,కాఫీ పంట ఇంకా అరుదైన సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి కాబట్టి దీన్ని బ్రిటీష్ వారు స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు.ఇప్పటికీ మనవాళ్ళు అలానే పిలుస్తుంటారు. వీరి స్వీట్లు,వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి.బ్రహ్మాండమైన పశ్చిమ కనుమల అందాల్ని చూడాలంటే తప్పక ఇక్కడకి రావాలిసిందే.


(Kodagu people)

రకరకాల వైన్స్ ని తయారుచేయడం లో ఈ ప్రాంతానికి ఓ చరిత్ర ఉన్నది.ఇక్కడ నివసించే ప్రధాన ప్రజలు కొడవ జాతికి చెందినవారు.సైనిక లేద యోధ జాతికి చెందినవారిగా పరిగణించుకుంటారు.వీరి వేషభాషలు,సంస్కృతి,ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీరి ప్రధాన దైవం కావేరి నదీమాత.ఇంకా ప్రకృతి. తుపాకుల్ని సైతం పూజిస్తారు.కేలి మూర్త వీరి పండుగ.వీరి పెళ్ళిళ్ళు గాని శుభ కార్యాలు గాని అన్నీ ఆ కొడవ జాతి పెద్దలే నిర్వహిస్తారు తప్పా బ్రాహ్మల్ని పిలిచి చేయించడం ఉండదు. నిజానికి వీరిలో కులాలు,ఉపకులాలు ఏమీ ఉండవు. అందుకనే వీరు హిందువుల్లో ఉన్నా లేనట్లు గానే కొంతమంది పరిగణిస్తారు.  



Tuesday, 11 April 2023

కొన్ని హాట్ సీన్స్ ఉన్నప్పటికీ ఈ అమెరికన్ వెబ్ డ్రామా సిరీస్ బాగానే ఉంది

 Daisy Jones & The Six అనే అమెరికన్ మ్యూజిక్ డ్రామావెబ్ సీరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైం వీడియో లో ఉన్నది. రాక్ బ్యాండ్ కళా కారుల జీవితాల్ని చాలా చక్కగా చిత్రించిన ఈ గాథ Taylor Jenkins Reid యొక్క నవల ని ఆధారం గా చేసుకుని తీసినది.ఎన్నో తంటాలు పడి పైకి వచ్చి మళ్ళీ కిందపడి ఎన్నో అనుభవాలు చూసిన ఎన్నో బ్యాండ్ లని పరిశీలించి ఈ నవల రాసినట్లుగా అనిపిస్తుంది.ఇది ఫిక్షన్ అయినప్పటికీ, డాక్యుమెంటరీ నా అన్నంత సహజంగా ప్రతి పాత్రా తమ వేపు నుంచి కథ చెబుతూంటుంది.


Daisy పాత్ర వేసిన Riley Keoush మనో పథం లో నిలిచిపోతుంది. అలాగే Billy పాత్ర లో Sam Claffin కూడా.అతను బ్యాండ్ లీడర్ గా బాగా మెప్పించాడు.డన్ బ్రదర్స్ అనే పేరుతో బ్యాండ్ ని స్థాపించి తనదైన దారిలో పోతుండగా,వాళ్ళకి తారసపడిన మేనేజర్ దీన్ని మరో దారి లోకి నడుపుతాడు.తన సలహాలతో.లాస్ ఏంజిల్స్ కి వెళ్ళి ప్రొగ్రాంస్ ఇస్తూ పేరు తెచ్చుకునే క్రమం లో అనేక మలుపులు తిరుగుతుంది కథ. Camila పాత్ర కి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆ పాత్రలో యువతిగా, మెప్పించిన ఆమె తల్లిగా కూడా చక్కగా నటించింది. మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్నాయి. ఆసక్తిపరులు చూడవచ్చు.    

Sunday, 9 April 2023

ఈ హిల్ స్టేషన్ ప్రత్యేకతే వేరు - కానీ మనవాళ్ళు వెళ్ళేది తక్కువే


ఎంతసేపూ అందరూ వెళ్ళే పర్యాటక ప్రదేశాలేనా,మన దేశం లో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ వాటికి పెద్దగా ప్రాచుర్యం లభించదు. కారణాలు ఏవైనా కావచ్చు.మరి ఇప్పుడు అలాంటి ఓ ప్రదేశం గురించి తెలుసుకుందాం.అది కోరాపుట్ పట్టణం ,దాని పరిసర ప్రదేశాలు.ఒరిస్సా రాష్ట్రం లో ఉన్నది. అయితే విశాఖపట్టణానికి దగ్గర,రైలు ప్రయాణం అయితే అక్కడ నుంచి అయిదు గంటలు పడుతుంది.


సముద్రమట్టానికి రమారమి 3000 అడుగుల పైన ఉన్న ఈ ప్రదేశం మరో కాశ్మీరు మాదిరిగా ఉంటుంది.గొప్ప పర్వత దృశ్యాలు,అడవులు,జలపాతాలు,నదీ ప్రవాహాలు,అటవీ జంతువులు,ఎంతో పురాతమైన ఆదివాసీ తెగలు ఇవన్నీ కలిసి ఓ ప్రత్యేక తరగతి కి చెందిన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాయి.కళ్ళకి విందు చేసే పచ్చదనం,ఎత్తైన గుట్టలు మనోరంజకం గా ఉంటాయి.అంతేకాదు ఇక్కడ కాఫీ పంట కి మంచి గిరాకీ ఉంది.నూరుశాతం అరబిక రకానికి చెందినది.1930 ప్రాంతం లో అప్పటి స్థానిక పాలకుడు రాజా బహదూర్ రామచంద్ర దేవ్   కాఫీ మొక్కల్ని మొట్టమొదటిగా ఇక్కడ నాటారు.

ఇక్కడికి 20 కి.మీ. దూరం లో హిందూస్థాన్ ఏరొనాటిక్స్ లిమిటెడ్ వారి విమానాల ఇంజన్లు తయారుచేసే కర్మాగారం ఉంది. ఇప్పటికీ కోరాపుట్ యొక్క ప్రకృతి దృశ్యాలు నాగరికత కోరలకి బలికాకుండా ఉన్నాయి. మంచి హిల్ స్టేషన్ గా పిలువబడే ఈ ప్రదేశం తన ప్రత్యేక అస్థిత్వాన్ని నిలుపుకొంటున్నది. ఈ చుట్టు పక్కల ఉన్న గుప్తేశ్వర్ ఆలయం,శబర శ్రీక్షేత్రం,కోరాపుట్ మ్యూజియం,కొలాబ డ్యాం, జైన మందిరం వంటి వాటిని తప్పక దర్శించుకోవాలి.     

Sunday, 12 March 2023

ప్రఖ్యాత రచయిత రస్కిన్ బాండ్ అభిమానుల్ని అక్కడ మాత్రమే ఎందుకు కలుస్తారో తెలుసా..?


 రస్కిన్ బాండ్ (Ruskin Bond) ఈ పేరు వినని సాహితీప్రియులు ఉండరు. ఆయన స్వతహాగా ఆంగ్లం లో రాసినప్పటికీ ఇంచుమించు అన్ని భారతీయ భాషల్లోకి వారి రచనలు అనువాదాలు జరిగాయి,జరుగుతూనే ఉంటాయి.ఇంగ్లీష్ పాఠ్యగ్రంథం లో ఎక్కడో ఓ చోట బాండ్ ఒక్క కథనో ,వ్యాసమో చదివే ఉంటాము.ఇక CBSE,ICSE సిలబస్ లు చదివి వచ్చిన యువత గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన రాసిన అనేక కథల పుస్తకాల్ని చదువుకుంటూ పోతూనే ఉంటారు.జీవితం లో ఒక భాగమై ఆయన పేరు మీద అనేక గ్రూపులు ఆన్ లైన్ లో నడుపుతుంటారు.ఈ మేగజైన్ కూడ ఉంది. కథ ని ప్రేమించే మనిషికి ఆయన కథ తగిలితే చాలు ఇక అక్కడితో ఆగలేరు.

మరి ఇంతా చేసి ఈ రస్కిన్ బాండ్ ఎవరు..?చిన్నపిల్లలు,యువతరం,పెద్దతరం అందరినీ తనదైన ప్రత్యేక కథన కుతూహలం తో అలరించే ఈయన ముస్సోరి అనే పట్టణం లో ,హిమాలయ సానువుల్లో ,ఆ కొండల్లో ఎన్నో దశాబ్దాల నుంచి జీవిస్తూ అక్కడి తన అనుభవాలనే గాక ఇంకా తన జీవితం లోని ఎన్నో అనుభవాలను కథల రూపం లో రాస్తూ ఇప్పటికీ 100 పుస్తకాల కి పైగా వెలువరించాడు. ప్రస్తుతం ఎనభైవ పడి లో ఉన్నాడు. జన్మతహ ఆంగ్లేయ దంపతులకి పుట్టినప్పటికి భారత దేశాన్ని తన ఆవాసం గా చేసుకుని ఇక్కడే ఉండిపోయాడు. తన అసలు పేరు ఓవెన్ రస్కిన్ బాండ్ ,1934 లో హిమాచల్ ప్రదేశ్ లోని కాసులి అనే ఊరి లో జన్మించాడు.

ఆయన చిన్నతనం లోనే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి అప్పటి ఒక భారతీయ సంస్థానాధీశుణ్ణి రెండో వివాహం చేసుకోవడం తో, ఎక్కువగా తండ్రి వద్దనే పెరిగాడు. బ్రిటీష్ ఆర్మీ లో పనిచేసే అతను అనేక ప్రాంతాలు తిరిగేవాడు.బాండ్ కూడా తండ్రి తో పాటూ తిరిగాడు. యవ్వనదశ కి ముందే తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత తనది ఒకరకమైన అనాధ జీవితమే అయింది.స్నేహితుల సాయం తోనూ,చిన్న చిన్న పనుల తోనూ తనని తాను పోషించుకున్నాడు. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తన బంధువులు ,తెలిసిన వాళ్ళు చాలామంది ఇంగ్లండ్ కి వెళ్ళిపోయారు. అయితే తాను మటుకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు.

రచయిత గా మాత్రమే జీవించాలని కంకణం కట్టుకున్నా,అది ఇండియా లో చాలా కష్టమని తెలిసింది.ట్యూషన్స్ చెప్పినా,స్వచ్చంద సంస్థ లో పని చేసినా దానికోసమే. మొత్తానికి రమారమి 70 ఏళ్ళపాటు రచనా రంగం లో ఉండి 100 కథల పుస్తకాల్ని ఇప్పటిదాకా రాశాడు. లెక్కలేనన్ని వ్యాసాలు,ఇతర ప్రక్రియలు చేపట్టాడు.మరి ఇన్నేళ్ళ తన జీవితం లో తాను పొందిన తీపి,చేదు అనుభవాలు అన్నిటినీ కలిపి రస్కిన్ బాండ్ తన ఆత్మకథ ని రాసుకున్నాడు దాని పేరు Lone Fox Dancing రెండువందల ఎనభై పేజీలు. స్పీకింగ్ టైగర్స్ వాళ్ళు ప్రచురించారు. ప్రతి ఒక్క రచయిత లేదా రచయిత కాదలుచుకున్న వ్యక్తి తప్పక చదవాలి. 

ఈ ఆటోబయోగ్రఫీ చదవడం వల్ల మనకి రస్కిన్ బాండ్ యొక్క జీవిత గాథ తెలియడమే కాదు. దానితో బాటు అనేక విషయాలు తెలుస్తాయి. నాటి బ్రిటిష్ ప్రభుత్వం లో పనిచేయడానికి వచ్చిన అనేక రకాల మనుషుల మంచీ చెడు తెలుస్తాయి.వాళ్ళ వ్యామోహాలు,ఉద్యోగధర్మం గా వాళ్ళు చేసిన పనులు, వాటి పర్యవసానాలు తెలుస్తాయి. అంతేకాకుండా స్థానిక ప్రజలతో వాళ్ళ అనుబంధాలు తెలుస్తాయి.ముఖ్యం గా సింలా,డెహ్రాడూన్,జాం నగర్,లక్నో వంటి ప్రాంతాల్లో నాటి నేటివ్ బ్రిటిషర్స్ ఎలా జీవించేవారు,రోజువారి జీవితం లోని పదనిసలు ఇప్పుడు చదువుతుంటే ఆసక్తి గా అనిపిస్తాయి.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలామంది బ్రిటిషర్లు ఇక్కడ ఉండడం లో  ఇన్సెక్యూరిటీ ఫీలయ్యి ఇంగ్లండ్ కి వెళ్ళిపోయారని రస్కిన్ బాండ్ చెబుతాడు. తాను నాలుగు ఏళ్ళు లండన్ వెళ్ళి కొన్ని ఉద్యోగాలు ప్రయత్నించి తనకి ఇండియా నే బాగుందనిపించి మళ్ళీ వెనక్కి వస్తాడు. దానికి కారణం చెబుతూ హిమాలయ సానువుల్లోని ఆ గుట్టల్లోనూ,చెట్ల లోనూ,ఉండి ఉండి అవి నాలో ఓ భాగమయిపోయాయి.ఆ తర్వాత ఢిల్లీ లోనూ ,బొంబాయి లోనూ ఉండాల్సివచ్చినా అది తనవల్లగాదని ముస్సోరి లోనే స్థిరపడ్డాడు.అక్కడ నుంచే తన రచనా యాత్రని సాగించాడు.అప్పటికి ఆ ఊరు చాలా చిన్నది. తన మొట్టమొదటి నవల The Room on the  Roof ఇలస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లో సీరియలైజ్ అయినప్పుడు ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. దాన్ని ఎవరికైనా చూపించి శభాష్ అనిపించుకోవాలన్నా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఆ చుట్టూతా ఎవరూ ఉండరు.

ఢిల్లీ లో ఉన్న కుష్వంత్ సింగ్ తనని ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు ఒకసారి,తన రచనల్ని బాగా ప్రోత్సహించేవాడని రస్కిన్ బాండ్ రాసుకున్నాడు.మెల్లిగా స్వదేశీ,విదేశీ ఇంగ్లీష్ పత్రికల్లో రాయడం మొదలుపెట్టి తనకంటూ ఓ స్థాయి ని సంపాదించుకుంటాడు.ఆ తర్వాత ఇంప్రింట్ అనే పత్రిక కి సహసంపాదకునిగా ఆర్.వి.పండిట్ కోరిక మీద పనిచేశాడు.ఎమర్జెన్సీ టైం లో ఆ పండిట్ మీద అప్పటి ప్రభుత్వానికి ఉన్న కోపం వల్ల ఓ చిన్న కేసు లో ఇరుక్కుంటాడు.అయితే ఈజీగానే దానిలోనుంచి బయటబడి తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగించాడు.

ఇప్పుడు మాదిరిగా అప్పట్లో రచయితలకి పబ్లిసిటీ లేదని,తాను ఓసారి బిబిసి లో ప్రొగ్రాం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గ్రాహం గ్రీన్ తన పక్కనే కూర్చున్నా తాను గుర్తించలేదని ,ఆ తర్వాత ఎవరో తనకి చెప్పడం తో ఖంగుతిన్నానని అంటాడు. అయితే ఎర్నెస్ట్ హెమింగ్వెయ్ లాంటి వాళ్ళు వేరు.పబ్లిసిటీ కోసం ఏవో చేస్తుండేవారని అంటాడు. ఇలా ఎన్నో విషయాల్ని తనకి తారసపడిన సంఘటనల్ని అక్షరబద్ధం చేశాడు. 50 ఫోటోలు ఈ పుస్తకం లో ఉన్నాయి.అవి అన్నీ ఎన్నో నాటి సంగతులని వివరిస్తాయి. ముస్సోరి లో ఉండే రస్కిన్ బాండ్ ని కలవడానికి ఎంతోమంది అభిమానులు వస్తుంటారు.

 అక్కడ ఉండే కేంబ్రిడ్జ్ బుక్ హౌస్ అనే పుస్తకాల షాప్ లో వాళ్ళందర్నీ ప్రతి శుక్రవారం కలుస్తుంటాడు. ఇంట్లో మాత్రం ఎవరినీ కలవడాయన.దానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. బెంగాల్ నుంచి ఓ రచయిత్రి చాన్నాళ్ళ క్రితం ఈయన ఇంటికి వచ్చి తప్పనిసరిగా తన పుస్తకానికి ముందుమాట రాయవలసిందే అని కూర్చుందట. నేను కొద్దిగా పనిలో ఉన్నా ,స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళమంటే నానాయాగీ చేసిందట. సరె...ఎవరి అనుభవాలు వాళ్ళవి. మన ఆర్.కె.నారాయణ్ గారు జీవించి ఉన్న రోజుల్లో అభిమానుల్ని ఇంట్లో కాకుండా బయటనే ఎక్కువ కలిసేవారని చదివాను. అనేక అనుభవాల సమాహారంగా ఉన్న ఈ ఆటోబయోగ్రఫీ ప్రస్తుతం అమెజాన్ లో లభ్యమవుతోంది.

----- మూర్తి కెవివిఎస్      

Thursday, 2 March 2023

హైదరాబాద్ కెపాసిటీ పెరింగిందన్నమాట

 సాఫ్ట్ వేర్ డెవలపర్స్ ని ఇంటర్వూ చేయడం లో హైదరాబాద్ నగరం కొత్త రికార్డ్ లు సృష్టించి దేశం లో మొదటి స్థానం లో నిలిచింది.సియాటెల్ కేంద్రం గా ఉన్న టెక్నికల్ ఇంటర్వ్యుంగ్ ఫర్మ్ కారట్ ఇచ్చిన రిపోర్ట్ అది.ఈ విషయం లో మొదటి 20 స్థానాలు అమెరికా ఇంకా ఇండియా లో ఉన్నాయి.మన దేశం లోని హై వాల్యూం మార్కెట్ యు.ఎస్. లోని సాఫ్ట్ వేర్ డెవెలపర్స్ తో పోటీపడుతోంది.ముంబాయి,పూణే,బెణ్గళూరు,గురుగ్రాం,చెన్నయ్ ల కంటే కూడా హైదరాబాద్ ముందు స్థానం లో ఉంది.ప్రపంచ వ్యాప్తంగా చెప్పాలంటే 10 వ స్థానం లో ,లండన్ ఇంకా వాషింగ్టన్ ల తర్వాత ఉంది.గ్లోబల్ కంపెనీల నుంచి వచ్చే పెట్టుబడులు ఇక్కడున్న డిజిటైజేషన్ ట్రెండ్ ని మరింత బలోపేతం చేస్తున్నాయి.వాషింగ్టన్ డిసి,ఆస్టిన్ నగరాలు లాస్ ఏంజిల్స్,కన్సాస్ సిటీ,పిట్స్ బర్గ్ ల కన్నా ముందున్నాయి. 

పెద్ద స్థాయి లో ఉన్న టెక్కీ లని ఇంటర్వ్యూ చేయడానికి టాలెంట్ లీడర్స్ ఎంతో ఖర్చు చేస్తున్నారు.ముఖ్యం గా HR tech,Recruiting vendors లాంటి సంస్థలు.వాట్సప్ రిక్రూట్మెంట్ రిమోట్ లాంటి ప్లాట్ ఫాంస్ ని ఉపయోగించుకుంటున్నాయి. ఇండస్ట్రీ లో ఉన్న మిగతా వారితో సంప్రదిస్తున్నాయి.కొన్ని కంపెనీలు చవక గా పనిచేయించుకోడానికి ఇండియా లాంటి దేశాల వైపు చూస్తున్నాయి.ఇది ఎప్పటినుంచో ఉన్నదే.కారట్ సి.యి.వో. మోహింత్ బెండె గత ఏడాది లో తమ ఖాతాదారుల చలనం లో అనేక మార్పులు వచ్చినట్లు చెబుతున్నారు. 

Thursday, 26 January 2023

అమెరికా లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గడ్డుకాలమే..!

 Google, microsoft ఇంకా Amazon వంటి దిగ్గజ సంస్థలు లే ఆఫ్ ప్రకటించడం తో అమెరికా లో వేలాదిమంది భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. వీళ్ళందరూ తమ ఉద్యోగాలు పోగొట్టుకోవడమే కాకుండా వీలైనంత త్వరలో మళ్ళీ ఏదో ఇతర కంపెనీల్లో పని వెదుక్కోవలసిన స్థితి ఏర్పడింది.వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించిన దాని ప్రకారం దాదాపు రెండు లక్షల మంది ఐ.టి. ఉద్యోగులు గత నవంబర్ నుంచి ఇప్పటిదాకా రోడ్డున పడ్డారు.గూగూల్,మైక్రోసాఫ్ట్,ఫేస్ బుక్,అమెజాన్ కంపెనీల్లో ఐతే రికార్డ్ స్థాయిలో ఎప్పుడూ లేనంతమందిని తొలగించారు.


వీరిలో చాలామంది H-1B,L1 వీసాల మీద కొనసాగుతున్నారు. దీంట్లో H-1B వీసా అనేది అమెరికా లోని సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు గా కొనసాగడానికి పనికి వస్తుంది తప్పా ఇమ్మిగ్రేంట్ వీసా గా పరిగణించరు.అదీ ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగులు గా మాత్రమే H-1B వీసా పై రావచ్చును.చాలా సంస్థలు దీన్ని నెపం గా పెట్టుకుని వేలాదిమందిని ఇండియా,చైనా వంటి దేశాల నుంచి హైర్ చేసుకున్నాయి. ఇక L-1Bవీసా అనేది తాత్కాలిక ప్రాతిపదికన ఆయా సంస్థల మధ్య ట్రాన్స్ ఫర్ మీద వచ్చే మేనేజీరియల్ స్థాయి వారికి మాత్రమే సంబంధించినది. 

మన దేశానికి సంబందించిన ఐ.టి. నిపుణులు ఎక్కువగా ఈ రెండు వీసాల మీదనే ఆధారపడి అమెరికా లో పనిచేస్తున్నారు. వీరు ఎక్కువకాలం ఉండాలంటే సాధ్యమైనంత త్వరలో అంటే ఈ ఏప్రిల్ నెల లోగా వేరే కంపెనీల్లో ఉద్యోగం చూసుకోక తప్పదు. ఈ మార్చ్ నెల 20 తేదీ ఆఖరు పని దినం గా ఉన్న ఓ ఉద్యోగిని మాట్లాడుతూ హెచ్ వన్ బి వీసా ఉన్నవారు మరో అరవై రోజుల్లో ఇక్కడ జాబ్ చూసుకోకపోతే తిరిగి ఇండియా వెళ్ళడం తప్పా మరో దారి లేదని చెబుతున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ సంపాదించడం కూడా కష్టం గానే మారింది.  

--- NewsPostNetwork