Wednesday 1 June 2022

ఆ శిల్పాల సౌందర్యం భయమూ,ఆశ్చర్యమూ కలిగిస్తాయి.


ప్రపంచం లోనే అత్యంత పెద్దదైన హిందూ దేవాలయం ఎక్కడ ఉంది అంటే కాంబోడియా లోని అంగోర్ వాట్ లో ఉంది అని చెబుతారు. అయితే అదే దేశం లో ఉన్న ఇంకొక అద్భుతమైన ఆలయం గురించి చాలా తక్కువమంది కి తెలుసు. దానిపేరు బేయన్ టెంపుల్. ఏడవ జయవర్మ 12 లేదా 13 వశతాబ్దం ప్రారంభ కాలం లో దీనిని నిర్మించారు.ఈ ఆలయం లో ఉన్న అన్ని గోపురాల మీద నాలుగు ముఖాల తో ఉన్న ఒక మనిషి మర్మగర్భం గా నవ్వుతున్నట్లుగా ఉంటుంది. ఆ ముఖాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి.మొత్తం మీద ఈ ఆలయం 216 ముఖాలు అలాంటివి ఉన్నాయి.

ఉన్నట్లుండి ఏమరుపాటు గా చూస్తే ఒక్కక్షణం భయం,ఆశ్చర్యం ఒకేసారి కలుగుతాయి.ఈ దేవాలయానికి వచ్చే గుమ్మం మొదట్లో దేవతలు,రాక్షసులు చెరోవేపున ఉన్నట్లు పాలసముద్రాన్ని చిలికే ఘట్టాన్ని శిల్పాల్లో చెక్కారు అప్పటి శిల్పులు.ప్రవీణ్ గారు చేసిన ఈ వీడియో లో చూడండి,చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ మార్మిక వదనం మొదట్లో బోధిసత్వుని ది అనుకున్నారు. కాని బుద్ధుని కి సంబందించిన ఏ శిల్పాల్లోనూ నాలుగు ముఖాలతో ఉన్నట్లు గాని,మూడు నేత్రాల తో ఉన్నట్లుగాని ఏ బౌద్ధ గ్రంథాల్లోనూ లేదు.అది బ్రహ్మ యొక్క ముఖమని ఆ విధం గా నిర్మించడం లో అంతరార్ధాన్ని ఈ వీడియో లో చెప్పారు.

ఆసియా ఖండం లో తూర్పు వేపున మనకి చేరువ లోనే ఉన్న ఈ కాంబోడియా దేశానికి ఎంతమంది వెళ్ళిఉంటారు..? భారతీయ మూలాలు ఎంతో స్పష్టం గా ఉన్న పక్కదేశాలకి వెళ్ళి అక్కడి విషయాల్ని కూడా మనం పరిశీలించాలి.లేకపోతే ఎలాంటి అవగాహన లేని వారి మాటల్నే నిజమైన చరిత్ర గా లోకం తీసుకుంటుంది.1945 నుంచి జపాన్ దేశం ఈ బేయన్ టెంపుల్ ని సమ్‌రక్షించడానికి తీసుకుంది.ఖ్మేర్ రాజుల కాలం లో కొన్ని బౌద్ధ శిల్పాలు దీనిలో చొప్పించినప్పటికి మౌలికంగా హైందవ ఆలయమని తెలిసిపోతూనే ఉంటుంది.  
     
------ News Post Desk

Wednesday 19 January 2022

దేశం లోని సంగీతప్రియుల్ని అలరిస్తున్న సంబాల్ పూర్ యువసంచలనం...!

మంటూ చురియా ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? ఈ కుర్రాడి వయసు 25 సంవత్సరాలు.ఒడిషా లోని సంబాల్ పూర్ జిల్లా కి చెందిన వాడు.సంబాల్ పూర్ ప్రాంతానికి ఇతను ఓ ప్రత్యేక గుర్తింపు తెస్తున్నాడు. ఒడియా భాష లో సంబాల్ పూర్ ప్రాంతానిది ఓ ప్రత్యేకమైన యాస , దానిపట్ల వారు ఎంతో గర్వంగా ఫీలవుతారు.ముఖ్యం గా జానపద సంగీతం లో వాళ్ళది ప్రత్యేకమైన ఒరవడి.అలాగే మిగతా జానర్ లని కూడా ఇప్పటి యువ సంగీతకారులు స్పృశిస్తున్నారు.


మంటూ చురియా తను తీసే వీడియో ఆల్బం లోని కళాకారులందరికీ సంబాల్ పూరి వస్త్రాలు ధరింపజేస్తుంటాడు.తనతో సహా.చూస్తూంటేనే కనుల విందుగా ఉంటాయి అవి.తను పాడతాడు.కొరియోగ్రఫీ చేస్తాడు.ఇంకా మిగతా నైపుణ్యాలు ఎన్నో ఉన్నాయి.అతని యూట్యూబ్ సబ్స్క్రైబర్లు 1.46 మిలియన్ల మంది ఉన్నారు.తన లేటేస్ట్ ఆల్బం "రాని గురి" అనేదాన్ని దాదాపు 53,781,661 మంది చూశారు. మొత్తం దేశం లోని అన్ని రాష్ట్రాల వారు అతని వీడియో సాంగ్స్ చూస్తూ టాలెంట్ అనేది ఉంటే ప్రజలకి వాళ్ళూ వీళ్ళూ అనే తేడా ఉండదు అని నిరూపిస్తున్నారు.

 మన తెలుగు సినిమాల తో పోలిస్తే ఒడియా సినిమాలు సంఖ్యాపరం గా తక్కువ గా నిర్మాణమవుతాయి.అయితే మ్యూజిక్ ఆల్బం లు మాత్రం బాగా రిలీజ్ చేస్తంటారు.దాంట్లో సంబాల్ పూర్ కళాకారుల క్రియేటివిటీ ని బాగా గమనించవచ్చు.ఈ మంటూ ప్రస్తుతం అసీమా పండా తో కలిసి పాడుతున్న పాటలు పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నాయి.ఢోల్,గిటార్,హర్మనీ వంటి వాయిద్యాల్ని వాయించడమే కాకుండా తన పాట తో,ఆట తో ఆకట్టుకునే మంటూ చురియా కి అభినందనలు తెలియజేద్దాం.

మొత్తానికి సంబాల్ పూరి మాండలీకానికి మంటూ వల్ల ఓ కొత్త గుర్తింపు వచ్చింది.నిజానికి అంతకు ముందు " రంగ బాతి" అనే జానపద పాట కూడా సంబాల్ పూర్ ని దాని మాండలీకాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది.ఆ కళాకారులు చాలా సీనియర్ లు ఇతని తో పోల్చితే..!

బిహు,సెల్ఫీ బేబొ,దెసి పిలా,హం సమల్ పూరియా బాబూ ఇంకా ఇలాంటి ఆల్బం లతో చిన్నసైజు స్టార్ అయిపోయాడు మంటూ చురియా.చూడటానికి చాలా చిన్నగా హై స్కూల్ కుర్రాడి లా ఉండే ఇతను ఒడియా జానపద సంగీతాన్ని మరో స్థాయి కి తీసుకువెళ్ళాడు అని చెప్పాలి. ఇక్కడ అతని పాట ఉన్న వీడియా ని ఇస్తున్నాము,చూడండి.   

Saturday 13 November 2021

వైన్ ని ఆ కలప తో చేసిన బ్యారల్స్ లోనే ఎందుకు పులియబెడతారో తెలుసా..?


 వైన్ ని పులియబెట్టడానికి చెక్క తో చేసిన బ్యారల్స్ ని ఉపయోగిస్తారని అందరికీ తెలిసిన విషయమే. కాని ఆ బ్యారల్స్ ని కేవలం ఫ్రెంచ్ ఓక్ కలప తో చేస్తారు. అయితే ఈ మధ్య కాలం లో అమెరికన్ ఓక్ చెట్లు కూడా పోటీ పడుతున్నాయి.అసలు ఆ కలప తో మాత్రమే చేసిన బ్యారల్స్ నే ఎందుకు వాడుతుంటారు..? స్టీల్ తో చేసిన వాటిని వాడవచ్చుగా అనుకుంటున్నారా..?ఈ ఓక్ చెట్ల కలప తో చేసిన బ్యారల్స్ లో పులియబెడితేనే వైన్ కి ఆ చక్కటి సువాసన,రుచి లాంటివి వస్తాయి.

వైన్ కి మంచి క్వాలిటీ రావాలంటే మంచి ద్రాక్ష జాతులు ఉండాలి దానిమీదట వైన్ ని తయారు చేయడం లో నిపుణత ఉండాలి. లోపల బ్యారల్స్ లో వైన్ ని పెట్టి దాచినప్పుడు కూడా తగిన మోతాదు లో ఆక్సిజన్ రావాలి.దానికోసం ఓక్ కలప తో బ్యారల్స్ చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.ఆపిల్,చెర్రీ వంటి చెట్ల కలప తో ప్రయత్నించినా ఓక్ కలప తో వచ్చే నాణ్యత రాలేదు.అమెరికా లో లభించే తెల్ల ఓక్ కలప కి ఈ మధ్య గిరాకీ పెరిగింది.వర్జీనియా,కెంటకీ,ఒరెగాన్,ఓహియా ప్రాంతాల్లో ఓక్ చెట్ల ని బాగా పెంచుతున్నారు.అందులోనూ ఎర్రని,నలుపు రంగుల్లో ఉండే కలప కంటే తెల్ల ఓక్ కే గిరాకీ ఉన్నది.

ఫ్రాన్స్ దేశం లో లిమోసన్,అలైర్స్,వోస్గెస్,ట్రాన్స్ కాయిస్ వంటి ప్రాంతాల్లో వీటి నిమిత్తం ఓక్ చెట్ల ని బాగా పెంచుతున్నారు.ఒక్క బ్యారల్ 200 డాలర్ల నుండి 500 డాలర్ల దాకా పలుకుతుంది.అమెరికన్ బ్యారల్స్ యొక్క ధర కాసింత ఎక్కువ నే అని చెప్పాలి.రోబస్ట్ రెడ్ వైన్స్ గా పిలువబడే  జిన్ ఫాండెల్,కొబర్నెట్,సవిగ్నాన్,మెర్లట్ వంటి వాటికి అమెరికా ఓక్ బ్యారల్స్ ని వాడుతుంటారు. 

----- NewsPost Desk

Monday 27 September 2021

"యారాడ కొండ" నవల పై ఓ సమీక్ష

 


 నేను ఇటీవల చదివిన నవల యారాడ కొండ. రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు. చదివిన తర్వాత నా అనుభూతిని కొన్ని వాక్యాల్లో పంచుకోవాలనిపించింది. తెలుగు నవల చదివి చాలా కాలమైంది.ఇంగ్లీష్ నవలలు చదువుతూ వాటి మీద ఏదో నాలుగు మాటలు నా బ్లాగు ల్లోనూ,అడపాదడపా పత్రికల్లోనూ రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్న నన్ను యారాడ కొండ వైపు లాక్కెళ్ళింది ఏమిటీ అంటే మూడు అంశాలు.

ఒకటి శ్రీశ్రీ ఆ కొండని కొన్నిమార్లు ఉగ్గడించడం,రెండు ముఖచిత్రం గా ఉన్న కెప్టెన్ జె.టి.బ్లంట్ యొక్క పేయింటింగ్. దీనిమీదట విశాఖ నగర సౌందర్యం పై నాకు గల మోహభావం. వీటిని పట్టుకుని యారాడ కొండ పైకి ఎక్కాను. సముద్రం అంత జీవితాన్ని ఎంతో శ్రద్ధ తో,ప్రేమ తో చిత్రించిన రచయిత అంతరంగాన్ని అవలోకించి ఔరా అనుకుని ఒక్క ఉదుటున నవల మొత్తం చదివేశాను.కాదు..కాదు యారాడ కొండ నే నన్ను తీసుకుపోయింది తనతో..!   

ఇది ఒక జాలరి కుటుంబానికి చెందిన కథ. బ్రిటీష్ వారి పాలన లో మొదలయి ఆ తర్వాత రోజులవరకు అనగా ప్రస్తుత కాలం వరకు సాగిన కథ. దానితో బాటే విశాఖ నగరం కాలం తో బాటు మార్పులకు లోనవుతూ వచ్చిన కథ. మరి అంతమాత్రమేనా..? ఇంకా ఎన్నో ఉన్నాయి..ఆనాటి ఆంగ్లో ఇండియన్లు వారి సామాజిక పరిస్థితుల్ని కెప్టెన్ జిమ్మీ పెరీరా కుటుంబం ద్వారాచూపించారు.మన తెలుగు నవలల్లో ఇంత సావకాశం గా వారి జీవితాల్ని చిత్రణ చేసిన నవల నాకు తెలిసీ బహుశా అతి తక్కువ.

రచయిత కి సముద్రయానం పై గల అనుభవాలు ఈ నవల కి పెద్ద ఎస్సెట్ అని చెప్పవచ్చు. నూకరాజు,ఎల్లమ్మ పాత్రలు వారి బాల్యం...ఆంగ్లో ఇండియన్ ప్రభావం తో ఎదిగిన వైనం మనుషుల మధ్య జీవిత గమనాన్ని ఎలా మార్చుతాయో కళ్ళకి కట్టినట్లు చిత్రించారు. అలాగే వారి మధ్యనుంచే వచ్చిన సిమ్హాచలం బయటి నుంచి వచ్చిన పెట్టుబడిదారులకి తాబేదారుని గా మారిన వైనం నేటి స్థితిగతుల్ని గుర్తు తెప్పిస్తాయి.అప్పల్రాజు పాత్ర రెండు స్వభావాల మధ్య నలిగిపోయిన అభాగ్యుల్ని గుర్తు చేస్తుంది.   

భాస్కర్ పాత్ర ఆ రోజుల్లో ఆదర్శాల కోసం ప్రాణ త్యాగం చేసిన మనుషుల్ని సజీవం గా మనముందు నిలుపుతుంది.వీటన్నిటికీ మించీ విశాఖ అంతర్లీనం గా ప్రతి పాత్ర తోనూ పడుగూ పేక లా కలిసిపోయింది. సెల్వన్,కమల పాత్రలు మనతో ఎన్నో నేటి వాస్తవాల్ని ముచ్చటిస్తాయి. ఇంత ఏలా..?ఎయిర్ పోర్ట్ లో నూకరాజు, ఎం.పి. నాయుడుతో మాట్లాడుతున్నప్పుడు ఒక హేళన ధ్వనించే గొంతు తో అతను ఏకవచనం తో సంభోదించినపుడు తిరిగి అదే విధం గా నూకరాజు కూడా సంభోదించడం ఆత్మగౌరవం అంటే ఏమిటో ఒక సూక్ష్మ విధానం లో తెలియజేశారు.   

 మనం యారాడ కొండ ఎక్కి ఒక దృశ్యకావ్యాన్ని చూస్తాం.చదువుతున్నంత సేపు మైమరపు,చదివిన తర్వాత మనలో ఒక భాగం గా మారిపోవడం ఈ రెండు లక్షణాలు గొప్ప నవలల్లో నేను గమనించినవి. ఈ యారాడ కొండ ఆ కోవ కి చెందినది. ఇంతమంచి నవల ని తెలుగు వారికి అందించిన ఉణుదుర్తి సుధాకర్ గారికి, ఆటా వారికి,అన్విక్షికీ కి అభినందనలు.

ఇటీవల ఒక ట్రెండ్ గమనించాను. ఫలానా పుస్తకం బాగుందండీ అంటే దాని పిడిఎఫ్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు.తెలుగు భాష ని ఉద్ధరించుకోవడం అంటే మంచి తెలుగు పుస్తకాల్ని కొని చదవడం కూడా అని ఎందుకనుకోరో అర్ధం కాదు.మళయాళం లో గాని,కన్నడ భాష లో గాని మంచి పుస్తకం అని పేరు వస్తే మొదటి ఏడాది లో కనీసం మూడువేల ప్రతులు అమ్ముడవుతాయి.అంటే వారికి పిడిఎఫ్ ల గూర్చి తెలియదా ...భాషాభిమానాన్ని మాటల్లో తో బాటు చేతల్లో చూపించాలి. అది నేటి అవసరం. 

----- మూర్తి కెవివిఎస్ (7893541003)    

Friday 17 September 2021

యూట్యూబర్ గా దుమ్ము దులుపుతున్న గిరిజనుడు

 
యూట్యూబర్ గా దుమ్మురేపుతున్న గిరిజనుడు ఇసాక్ ముండా. ఈయన ఒడిశా రాష్ట్రం లోని సంబల్ పూర్ జిల్లా కి చెందిన అతి సాధారణ వ్యక్తి. అయితేనేం,తనదైన శైలి లో తన రోజువారీ జీవితాన్ని యూట్యూబ్ లో పెడుతూ పేరు కి పేరు డబ్బు కి డబ్బు సంపాదిస్తున్నాడు.అసలు ఈ వీడియోలు చేయడం అలాంటివి ఏవీ మొదట్లో తనకి తెలియవు.


ఒకసారి వాళ్ళ ఇంట్లో పిల్లలు జియో ఫోన్ లో ఏదో యూట్యూబ్ కార్యక్రమం చూస్తూ ఉండగా మనోజ్ డే అనే సీనియర్, యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బులు సంపాదించవచ్చని చెబుతూ వివరాలు చెప్పసాగాడు.వీటిని బాగా విన్న ఇసాక్ ముండా తాను కూడా వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలని సంకల్పించాడు.


మంచి స్మార్ట్ ఫోన్ కావాలనే ఉద్దేశ్యం తో ఇన్స్టాల్ మెంట్ లో మూడువేల రూపాయల ఫోన్ ని కొనుగోలు చేశాడు.తన పాత ఫోన్ ని అమ్మేశాడు.నిరుపేద గా ఉన్న తను ఏవో లేనిపోని గొప్పలకి పోదలుచుకోలేదు. తన రోజువారీ గ్రామీణ గిరిజన జీవితాన్నే వీడియోలు గా తీశాడు.తాను ప్రతి రోజు తినే తిండి,ఆహార పానియాలు,చుట్టుపక్కల ఉండే వాటినే షూట్ చేసి అప్లోడ్ చేసే వాడు. 

ఒక్కో రోజు కూర కూడా వేసుకోకుండా అన్నం తినేవాడు.దాన్ని కూడా వీడియో తీశాడు.వంటలు,భోజనాలు,వాటికి సంబందించిన పోటీలు ఇలాంటివి అన్నీ షూట్ చేసి అప్లోడ్ చేసే వాడు.క్రమేపి అతని యూట్యూబ్ చానెల్ కి దేశీయం గా,అంతర్జాతీయం గా బాగా సబ్ స్క్రైబర్లు పెరిగారు. తన మొదటి వీడియో కి 34000 రూపాయలు వచ్చాయి.ప్రస్తుతం అతను నెలకి లక్ష రూపాయల కి పైగా సంపాదిస్తున్నాడు.


ఒకసారి మన్ కి బాత్ లో ప్రధాని ఈయన గూర్చి ప్రస్తావించారు.దానితో తన కీర్తి మరింత పెరిగింది. ఇతని కి ఓ అభిమాని ఇల్లు కూడా కట్టించాడు.విదేశాల నుంచి కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.మరి ఇది సామాన్యుడు సాధించిన ఘన విజయం కాక మరేమిటి..? ఈ ముప్ఫై ఏళ్ళ యువకుని చదువు కేవలం ఏడవ తరగతి మాత్రమే.రెక్కాడితే గాని డొక్క నిండని కుటుంబం.భార్య,నలుగురు పిల్లలు. అదండీ విషయం.

Tuesday 17 August 2021

బాలి ద్వీపం లోనూ కుల వ్యవస్థ ఉందా..?

 

(దేవాలయాల వీడియో) 

బాలి,సుమత్రా,జావా,ఇండోనేషియా అంటూ మనం చదువుకుని ఉంటాము. కాని ఆయా దీవుల్లోని పూర్తి విశేషాలు మనకు చాలా తక్కువ తెలుసు.ఇపుడు బాలి అనే దీవి గురించి తెలుసుకుందాం.ఇది ప్రస్తుతం ఇండోనేషియా దేశం లోని ఒక ప్రావిన్స్.జావా కి తూర్పు గా,లాంబొక్ అనే దీవి కి పడమర దిక్కు లో ఉంటుంది.

ఈ బాలి ద్వీపం లోని వారు ప్రస్తుతం మనకి విదేశీయులు గా అనిపించవచ్చు గానీ కొన్ని వందల ఏళ్ళ కిందకి వెళితే వారి లోనూ మనకి కొన్ని సారూప్యతలు కనపడతాయి.కాలక్రమం లో భాష,సంస్కృతి వంటివి కొన్ని మార్పులు కి గురవ వచ్చు గానీ మౌలిక స్వరూపం మటుకు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.ఆ పేర్లు విన్నా,ఆ ఆలయాల్ని చూసినా ఇవి మన లాగానే ఉన్నాయే అనిపించక మానదు.

బాలి ద్వీపం లోని మెజారిటీ మతస్థులు హిందువులే.శిల్పం,నృత్యం,చిత్రలేఖనం వంటి ఎన్నో కళలు ఇక్కడ వర్ధిల్లినవి.ఇప్పటికీ మనోహరం గా అవి చూపరులను కట్టిపడేస్తూనే ఉన్నాయి.2005 లో జరిపిన డిఎన్ ఏ పరీక్ష లో బాలి ప్రజల వై క్రోమోజోంస్ 12 శాతం భారతీయుల్ని పోలిఉన్నాయి.   

కాలక్రమం లో తైవాన్,మలేషియా,చైనా నుంచి వలస వచ్చిన ప్రజల వల్ల వారి ప్రభావం వీరి సంస్కృతి పై పరుచుకుంది.ఇక్కడ రమారమి 2000 హిందూ ఆలయాలు ఉన్నాయి.పాశుపత,భైరవ,శివ సిద్ధాంత,వైష్ణవ,బోధ,బ్రహ్మ,రేసి,సోర,గాణాపత్య వంటి శాఖలు ఇక్కడ గత కాలం లో వర్ధిల్లినట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయి.వీరి అందరికీ ఎవరి ఇష్ట దైవం వారికి ఉండేది.అదే క్రమం లో బౌద్ధ మతం వంటివి కూడా ఆదరింపడ్డాయి.

2000 ఏళ్ళకి పూర్వం నుంచే ఇక్కడ మానవ సంచారం ఉన్నట్లు తెలుస్తున్నది.ఈ బాలి ద్వీపం లో శ్రీకేసరి వర్మదేవ నిర్మించిన ఆలయం లో దొరికిన ఆధారాల్ని బట్టి ఇంకా ఇతర నిర్మాణాల వల్ల  1293 నుంచి 1520 దాకా ఉన్న హైందవ రాజ్యాల తీరు తెన్నులు తెలుస్తున్నవి. ఈ బాలి ద్వీపం లో శక్తిమంతమైన పది వ్యాపార కుటుంబాలు ఉండేవని వారి మధ్య రేగిన స్పర్ధల వల్ల ఇంకా ఇండోనేషియా ప్రభుత్వ పోకడ వల్ల  వీటి ప్రాభావం తగ్గినట్లు చరిత్ర చెబుతున్నది.
       
    1906 లో ఇక్కడి Sanur ప్రాంతం లో వేలాది రాజవంశీకులు డచ్ వారి చేతి లో మరణించడం ఇష్టం లేక ఆత్మ హత్య చేసుకున్నారు,ఆ క్రతువు ని Puputan అని పిలుస్తారు.ప్రస్తుతం అది ఒక పర్యాటక ప్రాంతం గా మారింది. హిందూ దేవుళ్ళ పేర్లు కొన్నిసార్లు రూపం మార్చుకుని వినిపిస్తాయి ఉదాహరణకి గొవా గొజా ...అంటే గజాననుడి యొక్క పేరు అలా మారిందన్న మాట. విగ్రహం మాత్రం అదే వినాయకుడి దే ఉంటుంది...అక్కడ తేడా ఉండదు.1512 వరకు అంటే డచ్ వాళ్ళు వచ్చేంత వరకు హిందూ రాజులే పాలించినది.

హిందూ మతం లోని వర్ణ వ్యవస్థ ఇక్కడికీ పాకింది. అయితే నాలుగు వర్ణాలే ఉన్నాయి. వాటిని కొద్దిగా వేరేలా పిలుస్తారు..సోద్ర అంటే శూద్ర,వెసియా అంటే వైశ్య,సత్రియా అంటే క్షత్రియ,బ్రామణ అనగా బ్రాహ్మణ అని పిలుస్తారు. మన దేశం లో మాదిరిగా అంటరాని కులం అనేది లేదు.క్రాఫర్డ్,ఫ్రెడెరిక్ వంటి పరిశోధకులు ఈ వర్గీకరణ ఇక్కడి ప్రజల హిందూ మత మూలాల్ని తెలియజేస్తున్నదని అభిప్రాయపడ్డారు.

ఆ మధ్య కాలం లో పర్యాటకులే లక్ష్యం గా బాంబు పేలుళ్ళు జరగడం తో కొంత ఊపు తగ్గినా మళ్ళీ పర్యాటకులు బాగానే వస్తున్నారు.కారణం ఇక్కడి వాతావరణం,ప్రాచీన నిర్మాణాలు,అందమైన అడవులు,బీచ్ లు వంటివి.ట్రిప్ అడ్వైజర్ బాలి (2020 కి గాను) ని టాప్ డెస్టినేషన్ గా పేర్కొంది.ఈ దీవికి మూడు వైపులా చక్కని పగడాల దీవులు ఉంటాయి.అనేక దీవుల సముదాయం లో చాలావరకు నిర్మానుష్యం గా ఉంటాయి.  

--- NP Desk

Friday 16 July 2021

CV రాయడం లో కొన్ని మెళుకువలు


--ప్రతి ఉద్యోగార్ధి తనకి గల అర్హతల్ని క్రమపద్ధతి లో తయారుచేసుకోవాలి.


--మీ CV ని బట్టే మీరు ఏమిటో తెలుస్తుంది.మీకు ఉద్యోగం ఇచ్చే సంస్థ ని అలరించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి స్పెల్లింగ్ పొరబాట్లు లేకుండా చూసుకోవాలి.ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది రాసిన తరువాత.


--మీకు గల విద్యార్హతల్ని,ఇతర అవసరం అనుకున్న అంశాల్ని ప్రాధాన్యతని ఇచ్చి పొందుపరచండి.


--మిమ్మల్ని మీరు మరీ విపరీతం గా పొగుడుకున్నట్లు అనిపించకూడదు.మీకు ఉన్న నిజమైన బలాల్ని నిజాయితి గా రాయండి. 


--చూడగానే చక్కగా,చదవాలనిపించేలా ఫార్మేట్  చేసుకోవాలి.  


--మీరు సాధించిన విజయాలను మరిచిపోకుండా పొందుపరచాలి.